ముంబై: ప్రభుత్వ రంగంలోని మొత్తం 21 బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం పూర్తిగా మద్దతిస్తుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మొండిబాకీల పరిష్కారం దిశగా ఎన్‌పీఏల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ‘‘దీనిపై తగు సిఫార్సులు చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించాం. ఈ కమిటీ రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది’’ అని ఆయన వెల్లడించారు. పీఎస్‌బీల చీఫ్‌లతో శుక్రవారం భేటీ అయిన సందర్భంగా విలేకరులకు ఆయన ఈ విషయాలు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా సారథ్యంలోని కమిటీ.. రెండు వారాల వ్యవధిలో అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లేదా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఏర్పాటు చేయడంపై సిఫార్సులిస్తుందని మంత్రి చెప్పారు. మొండి పద్దులను పారదర్శకంగా, మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు బయటి నిపుణులతో ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసుకునే అంశాన్ని కూడా బ్యాంకులు పరిశీలిస్తాయన్నారు.
బ్యాంకర్లతో సమావేశంలో గవర్నెన్స్ ప్రక్రియను పటిష్టం చేయడం, మొండిబాకీలను పక్కాగా గుర్తించడం తదితర అంశాలపై చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.
అలాగే, రుణాల మంజూరు తీరుతెన్నులు, సక్రమంగా చెల్లింపులు జరిపే అర్హత గల రుణగ్రహీతలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసేలా తగు వ్యవస్థను రూపొందించడం కూడా చర్చకు వచ్చినట్లు గోయల్ చెప్పారు. మొండిబాకీల సత్వర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని బ్యాంకుల చీఫ్‌లు అభిప్రాయపడ్డారని ఆయన వివరించారు. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న చీఫ్‌ల స్థానాలను 30 రోజుల్లోగా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లాంటిది ఏర్పాటు చేయడం బ్యాంకింగ్ వ్యవస్థకు మేలు చేసేదేనా, ఒకవేళ ప్రయోజనకరమైనదే అయితే ఏర్పాటు చేయడానికి విధి విధానాలు ఎలా ఉండాలి మొదలైనవి కమిటీ పరిశీలించి, సిఫార్సులు చేస్తుందని గోయల్ తెలిపారు. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన అంశంపై ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ఆయన దాటవేశారు.
ఐసీఐసీఐ బ్యాంక్ అంశం..
చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఐసీఐసీఐ బ్యాంకులో ఆశ్రిత పక్షపాత ధోరణులపై ఆరోపణల మీద స్పందిస్తూ.. ఆ బ్యాంకు పటిష్టమైన విధానాలే అమలు చేస్తుందని గోయల్ పేర్కొన్నారు. బ్యాంకు గురించి వాటాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఏవైనా లొసుగులు ఉన్నాయని విచారణలో తేలిన పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని గోయల్ వ్యాఖ్యానించారు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్.. తన భర్త సంస్థకు ప్రయోజనం చేకూర్చేలా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరీలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ బ్యాంకులకు పూర్తి మద్దతు
Published Sat, Jun 9 2018 12:43 AM | Last Updated on Sat, Jun 9 2018 12:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment