­పసుపు రైతు కల సాకారం | Turmeric farmer dream comes true | Sakshi
Sakshi News home page

­పసుపు రైతు కల సాకారం

Jan 16 2025 6:19 AM | Updated on Jan 16 2025 6:19 AM

Turmeric farmer dream comes true

పసుపుబోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌

పసుపు ఉత్పత్తులు భారీగా పెరుగుతాయని ఆశాభావం

ప్రధాని మాట ఇస్తే తప్పరు...కేంద్ర మంత్రి బండి సంజయ్‌

మోదీని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు: ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌ సిటీ: దేశంలోని పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంగా జాతీయ బోర్డును ఎంపీ అర్వింద్‌తో కలిసి ఢిల్లీలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. పసుపు బోర్డు తొలి చైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత పల్లె గంగారెడ్డిని నియమించారు. 

బోర్డును ఏర్పాటు చేసినందుకు పీయూష్‌ గోయల్‌కు ఎంపీ అర్వింద్‌ కృతజ్ఞతలు తెలిపి, పసుపు కొమ్ముల దండను బహూకరించారు. నిజామాబాద్‌ లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్‌ కార్యక్రమంలో జిల్లాకు బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. 

పసుపు ఉత్పత్తులు పెరుగుతాయి: గోయల్‌
సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి పసుపును ప్రత్యేక బోర్డుగా ఏర్పాటు చేయడంతో పసుపు, పసుపు ఉత్పత్తులు బాగా పెరుగుతాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. బోర్డును నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని ఎంపీ అర్వింద్‌ ప్రధాని మోదీని సైతం ఒప్పించారని అభినందించారు. 

ప్రధాని మాట ఇస్తే నెరవేరుస్తారు: బండి సంజయ్‌
ప్రధాని నరేంద్రమోదీ వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ అర్వింద్‌ కొన్నేళ్లుగా శ్రమించి విజయం సాధించారని ప్రశంసించారు. ఆయన కరీంనగర్‌ నుంచి ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు.

ప్రజలు రుణపడి ఉంటారు: ఎంపీ అర్వింద్‌
ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటు జిల్లా రైతుల దశాబ్దాల కల అని ఎంపీ అర్వింద్‌ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చానని తెలిపారు. తెలంగాణ రైతులు ప్రధాని మోదీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను జాతీయ పసుపు బోర్డు తొలి చైర్మన్‌గా నియమించడం తన అదృష్టమని బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి అన్నారు. 

తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. నిజామాబాద్‌లో వర్చువల్‌ కార్యక్ర మంలో పల్లె గంగారెడ్డితో పాటు అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి: పసుపు బోర్డు ఏర్పాటు తో నిజామాబాద్‌ జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. గుంటూరులో పొగాకు బోర్డు, కేరళలోని కొచ్చిలో స్పైసెస్‌ బోర్డు ఉంది. ఇప్పుడు పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చే శారు. ప్రపంచంలో పండించే మొత్తం పసుపులో మన దేశంలో నే 62% పండుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత నిజా మాబాద్‌లోనే అత్యధికంగా నాణ్యమైన పసుపు పండిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement