న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీలు) గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో నిధులను సమకూర్చుకోవడంలో దూకుడు ప్రదర్శించాయి. వెరసి రుణాలు, ఈక్విటీ మార్గాలలో దాదాపు రూ. 58,700 కోట్లు సమీకరించాయి. ఒక ఏడాదిలో ఇది సరికొత్త రికార్డు కాగా.. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులను పెంపొందించుకోవడంలో బ్యాంకులు జోరు చూపాయి.
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 4,500 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 2,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (ప్రయివేట్ ప్లేస్‌మెంట్) రూ. 3788 కోట్లు చొప్పున అందుకున్నాయి. క్విప్‌లు విజయవంతంకావడం పీఎస్‌బీల పట్ల దేశ, విదేశీ ఇన్వెస్టర్లకున్న నమ్మకానికి నిదర్శనమని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 12 పీఎస్‌బీలు రికార్డుకు తెరతీస్తూ టైర్–1, టైర్–2 బాండ్ల జారీ ద్వారా గతేడాది రూ. 58,697 కోట్లు సమీకరించాయి.
సంస్కరణల ఎఫెక్ట్
గుర్తింపు, రుణ పరిష్కారాలు, కొత్తపెట్టుబడులు వంటి పలు ప్రభుత్వ సంస్కరణల నేపథ్యంలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) తగ్గడంతోపాటు.. లాభాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా పీఎస్‌బీల ఎన్‌పీఏలు రూ. 6,16,616 కోట్లకు తగ్గాయి. 2020లో ఇవి రూ. 6,78,317 కోట్లుకాగా.. 2019లో రూ. 7,39,541 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో ప్రొవిజన్ల కవరేజీ నిష్పత్తి 84 శాతానికి బలపడింది. గత ఐదేళ్లలోలేని విధంగా ప్రభుత్వ బ్యాంకుల లాభాలు రూ. 31,816 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాది ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించినప్పటికీ పటిష్ట పనితీరును కనబరిచాయి.
2020లో నమోదైన రూ. 26,015 కోట్ల నష్టాల నుంచి ఈ స్థాయి టర్న్‌అరౌండ్‌ను సాధించడానికి మొండి రుణ సవాళ్లను అధిగమించడం సహకరించింది. ఎన్‌పీఏల నియంత్రణ, రికవరీ చర్యలు ఇందుకు తోడ్పాడునిచ్చాయి. గత ఆరేళ్లలో పీఎస్‌బీలు రూ. 5,01,479 కోట్లను రికవరీ చేయడం గమనార్హం. ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment