
న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం బుధవారం ఎండీ, సీఈఓలను నియమించింది. కొత్త చీఫ్‌లలో ఐదుగురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లు కావడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది. నియామక వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీచేసిన అధికారిక ఉత్తర్వులను క్లుప్తంగా చూస్తే...
ఎస్‌బీఐ నుంచీ వీరు...
మొండిబకాయిలతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులు ఈ సమస్య నుంచి బయటపడ్డానికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు– ఎస్‌బీఐ నిపుణుల సహాయం కీలకం అని భావించిన కేంద్రం, ఎస్‌బీఐ నుంచి ఈ నియామకాలు చేపట్టినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నియామకాలు చూస్తే...
►ఆంధ్రాబ్యాంక్: జే. పకీర్‌సామి. 2021 ఫిబ్రవరి 28 పదవీ విరమణ వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు.
► సిండికేట్ బ్యాంక్: మృత్యుంజయ్ మహాపాత్ర. పదవీకాలం పూర్తయ్యే వరకూ అంటే 2020 మే 31 మహాపాత్ర ఈ బాధ్యతలను నిర్వహిస్తారు.
► ఇండియన్ బ్యాంక్: పద్మజా చంద్రూ. 2021, ఆగస్టు 31న చంద్రూ పదవీ విరమణ చేస్తారు.
► సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: పల్లవ్ మహాపాత్ర. 2021 ఫిబ్రవరి వరకూ ఉంటారు.
► దేనా బ్యాంక్: కర్నమ్ శేఖర్. 2020, జూన్ 30 వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు.
ఇతర ఐదు బ్యాంకులనూ చూస్తే...
►అలహాబాద్ బ్యాంక్: ఎస్‌ఎస్ మల్లికార్జునరావు. తొలి బాధ్యతల కాలపరిమితి మూడేళ్లు. అయితే ఆయన పదవీ విరమణ సమయం 2022 జనవరి 31 వరకూ బాధ్యత కాలపరిమితిని పొడిగించే వీలుంది. ప్రస్తుతం ఆయన సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
►బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఏఎస్ రాజీవ్. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ కాలం మూడేళ్లు. మంచి పనితనం కనబరిస్తే, పదవీకాలం మరో రెండేళ్లు పొడిగించవచ్చు.
►యూకో బ్యాంక్: అతుల్ కుమార్ గోయెల్. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా పనిచేస్తున్నారు.
►పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్: ఎస్. హరి శంకర్. అలహాబాద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
► యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: అశోక్ కుమార్ ప్రధాన్, ప్రస్తుతం ఇదే బ్యాంకులో అశోక్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆర్‌బీఐ స్థానిక బోర్డ్‌లకూ నియామకాలు...
రిజర్వ్ బ్యాంక్ స్థానిక బోర్డుల సభ్యుల నియామకాలనూ కేంద్రం ప్రకటించింది. వీటిలో దక్షిణ(రాకేష్ జైన్), ఉత్తర (రేవతీ అయ్యర్, రాఘవేద్ర నారాయణ్ దుబే), తూర్పు (ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది) ప్రాంత బోర్డులు ఉన్నాయి.