టీపీసీసీకి కొత్త చీఫ్‌పై కాంగ్రెస్ అధిష్టానం అన్వేషణ
కర్ణాటక ఫార్ములా అమలు
చేస్తే రెండో పవర్ సెంటర్‌గా డిప్యూటీ సీఎం భట్టి
లేదంటే విధేయత, సమర్థత ఆధారంగా ఇతర కీలక నేతల్లో ఒకరికి చాన్స్
సామాజిక వర్గాల లెక్కల్లోనూ పలువురి పేర్లు పరిశీలన
నెలాఖరులోగా కొత్త సారథి నియామకం ఖాయమంటున్న పార్టీ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ పగ్గాల కోసం రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ పట్ల విధేయత, సీనియారిటీతోపాటు విపక్షాలను దీటుగా ఎదుర్కోగలిగిన సామర్థ్యం, అధికారంలో ఉన్న పార్టీని సమన్వయంతో నడి పించగలిగిన నేత కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే అంశాన్ని కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు సమాచా రం. అన్ని కోణాల్లో కసరత్తు పూర్తిచేసి ఈ నెలాఖరు కల్లా టీపీసీసీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
విధేయత, సమర్థతను పరిశీలిస్తూ: సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఈనెల 27 నాటికి మూడేళ్లు పూర్తవుతోంది. పీసీసీ అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. దీనికితోడు రేవంత్ సీఎం అయిన నేపథ్యంలో.. పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇందుకోసం సామాజిక వర్గాలు, విధేయత, సీనియారిటీ, కర్ణాటక ఫార్ములా తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. సమర్థుడైన నేతను పీసీసీ చీఫ్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ముఖ్యంగా సీనియారిటీతోపాటు పార్టీ పట్ల విధేయతను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. వచ్చే మూడేళ్లపాటు ప్రభుత్వంతో, పార్టీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం, విపక్షాలకు దీటుగా కౌంటర్లు ఇవ్వగలిగిన నేతను ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ కోణంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలో పార్టీని నడిపించిన అనుభవం, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సభ్యుడిగా పనిచేయడం నేపథ్యంలో.. ఉత్తమ్‌ను మరోమారు పీసీసీ చీఫ్‌గా నియమించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని అంటున్నారు. మరోవైపు పారీ్టకి విధేయులైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డితోపాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
సామాజికవర్గ కోణంలోనూ ఫోకస్..
పీసీసీ అధ్యక్ష పదవిని సామాజిక వర్గాల కోణంలో ఇవ్వాల్సి వస్తే.. ఎస్సీ (మాదిగ) వర్గ నేతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. ఈ సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎస్సీలకు కాదంటే బీసీలకు పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీహెచ్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని అంటున్నాయి.
అదే ఎస్టీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే.. సీతక్క, బలరాం నాయక్ తదితరుల పేర్లను.. మైనార్టీ కోణంలో చూస్తే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. అయితే సామాజిక వర్గాల కోణంలో ఇవ్వాల్సి వస్తే.. ఎస్సీ లేదా బీసీలకే చాన్స్ ఎక్కువనే చర్చ జరుగుతోంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి పీసీసీ బాధ్యతలు ఇవ్వాలనుకుంటే మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆయనను పీసీసీ చీఫ్‌గా నియమించలేని పక్షంలో ఏఐసీసీలో మంచి హోదాలో నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
మొత్తంగా సీనియారిటీ, సిన్సియారిటీ, సామాజిక వర్గాల లెక్కల్లో అన్ని అంశాలను పరిశీలించి.. ఈ నెలాఖరు కల్లా పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సోనియాగాం«దీని కలిసిన సందర్భంగా కొత్త పీసీసీ చీఫ్‌గా ఎవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం.
కర్ణాటక తరహా ఫార్ములాపై పరిశీలన
కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ విషయంలో కర్ణాటక తరహా ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్‌ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టిన శివకుమార్‌కు ఆ అవకాశం ఇవ్వలేకపోవడంతో డిప్యూటీ సీఎంతోపాటు పీసీసీ చీఫ్ బాధ్యతలనూ అప్పగించారు. దాంతో ఆయన పారీ్టలో, ప్రభుత్వంలో రెండో పవర్ సెంటర్‌గా నిలిచారు.
అదే తరహాలో తెలంగాణలో డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్కను పీసీసీ చీఫ్‌గా నియమించే అంశాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రాష్ట్రంలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని.. కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఇలానే ఉంటాయని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment