బ్యాంకుల మూలధన అవసరాలపై కసరత్తు!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనం ఎంత మొత్తంలో అవసరమన్న అంశంపై ఆర్థికమంత్రిత్వశాఖ కసరత్తు ప్రారంభించింది. తక్షణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అలాగే సమీప ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుంచి తాజా మూలధనం ఎంత కావల్సి ఉంటుందన్న అంశంపై నివేదికలు సమర్పించాలని ప్రభుత్వ బ్యాంకులు అన్నింటినీ ఆదేశించింది. బాసెల్ నిబంధనలు, అలాగే వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా మూలధన అవసరాలను తెలియజేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థికమంత్రిత్వశాఖ సూచించింది.
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, అంతర్జాతీయ బాసెల్ 3 నిబంధనల అమలు దిశలో 2018 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.40 లక్షల కోట్ల తాజా మూలధనం అవసరం అవుతుందని అన్నారు. తాజా బడ్జెట్‌లో రూ.8,000 కోట్ల తాజా మూలధనం కేటాయించినా... అవసరమైతే ఈ కేటాయింపులు మరింత పెంచుతామని అన్నారు.