Finance Ministry Department
-
పోలవరానికి రూ.333 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.333 కోట్లను రీయింబర్స్ చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బహిరంగ మార్కెట్లో బాండ్లు జారీచేయడం ద్వారా నిధులు సమీకరించాలని నాబార్డును ఆదేశించింది. నాబార్డు నిధులను సేకరించి ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ), పీపీఏ (పోలవరంప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్టుకు వ్యయం చేసిన బిల్లులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పీపీఏకు పంపింది. వాటిని పరిశీలించిన పీపీఏ గత నెల రూ.333 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫార్సు చేసింది. ఈ నెలలో రూ.418 కోట్లను రీయింబర్స్ చేయాలని తాజాగా ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలిస్తున్న కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదముద్ర వేసి, కేంద్ర ఆర్థికశాఖకు నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకు రూ.17,153.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత చేసిన వ్యయం రూ.12,422.83 కోట్లు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.10,741.46 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో ఇంకా రూ.1,681.37 కోట్లను కేంద్రం బకాయిపడింది. రూ.1,681.37 కోట్లను రీయింబర్స్ చేయాలని పీపీఏకు రాష్ట్ర జలవరులశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలిస్తున్న పీపీఏ గత నెల రూ.333 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫార్సు చేసింది. ఈ నెలలో రూ.418 కోట్లను రీయింబర్స్ చేయాలని ప్రతిపాదనలు పంపింది. ఈ 418 కోట్లు రీయింబర్స్ చేసినా.. ఇంకా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.930.37 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది. -
బ్యాంకుల మూలధన అవసరాలపై కసరత్తు!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనం ఎంత మొత్తంలో అవసరమన్న అంశంపై ఆర్థికమంత్రిత్వశాఖ కసరత్తు ప్రారంభించింది. తక్షణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అలాగే సమీప ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుంచి తాజా మూలధనం ఎంత కావల్సి ఉంటుందన్న అంశంపై నివేదికలు సమర్పించాలని ప్రభుత్వ బ్యాంకులు అన్నింటినీ ఆదేశించింది. బాసెల్ నిబంధనలు, అలాగే వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా మూలధన అవసరాలను తెలియజేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థికమంత్రిత్వశాఖ సూచించింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, అంతర్జాతీయ బాసెల్ 3 నిబంధనల అమలు దిశలో 2018 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.40 లక్షల కోట్ల తాజా మూలధనం అవసరం అవుతుందని అన్నారు. తాజా బడ్జెట్లో రూ.8,000 కోట్ల తాజా మూలధనం కేటాయించినా... అవసరమైతే ఈ కేటాయింపులు మరింత పెంచుతామని అన్నారు. -
ఇంధన సబ్సిడీలకు 22,000 కోట్లు కావాలి..
ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెట్రోలియం శాఖ లేఖ న్యూఢిల్లీ: వంటగ్యాస్, కిరోసిన్ సబ్సిడీల కారణంగా వాటిల్లుతున్న ఆదాయ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ద్వితీయార్ధంలో రూ.22,201 కోట్లు ఇవ్వాల్సిందిగా చమురు శాఖ కోరుతోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు సబ్సిడీల భారంపై పరిహారం కింద రూ.17,000 కోట్లను చెల్లించింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఓఎంసీల ఆదాయ నష్టాల్లో(రూ.51,110 కోట్లు) ఈ మొత్తం మూడో వంతు మాత్రమే. కాగా, ప్రభుత్వరంగ చమురు ఉత్పత్తి(అప్‌స్ట్రీమ్ ఆయిల్) కంపెనీలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లు రూ.31,926 కోట్లను భరించాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 50 డాలర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో ద్వితీయార్ధంలో అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు ఓఎంసీలకు ఆదాయ నష్టాల కింద ఎలాంటి చెల్లింపులూ జరపాల్సిన అవసరం లేదని కూడా పెట్రోలియం శాఖ పేర్కొంది. ఆర్థిక శాఖకు రాసిన లేఖలో ఈ వివరాలను తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత 2014-15 ఏడాదిలో ఓఎంసీలకు ఆదాయ నష్టాలు(మార్కెట్ రేటు కంటే తక్కువకు ఇంధనాలను విక్రయించడం కారణంగా) రూ.74,773 కోట్లుగా అంచనా.