
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక భేటీ జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో బుధవారం ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
రుణాలు, డిపాజిట్ వృద్ధికి మధ్య అంతరం, లిక్విడిటీ రిస్క్ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మోసాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు వంటి అనేక అంశాలు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బ్యాంకుల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడం, సరిహద్దు లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచడం, ఆర్బీఐ ఆవిష్కరణ కార్యక్రమాలలో బ్యాంకుల భాగస్వామ్యం గురించి కూడా చర్చించారు.
తమ పరిధిలోకి వచ్చే బ్యాంకులు, సంస్థల సీనియర్ మేనేజ్‌మెంట్‌తో తరచూ ఆర్బీఐ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజా సమావేశం జరిగింది. ఇంతకుముందు భేటీ ఫిబ్రవరి 14న జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, డిప్యూటీ గవర్నర్లు ఎం. రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఆర్బీఐ నియంత్రణ, పర్యవేక్షణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment