బలంగా ఆర్థిక మూలాలు
ద్రవ్యోల్బణం దిగొస్తుంది
వచ్చే సమావేశంలో రేట్లపై నిర్ణయం
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు నెలకొన్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా సాగిపోతున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యాఖ్యానించారు. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారకం నిల్వలు పటిష్టంగా ఉండడం, నియంత్రణలో కరెంటు ఖాతా లోటు, వస్తు, సేవల ఎగుమతుల వృద్ధిని ప్రస్తావించారు.
682 బిలియన్ డాలర్ల విదేశీ మారకంతో (అక్టోబర్ 31 నాటికి) ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తు చేశారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇదే సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ రేట్ల కోతకు ఇచ్చిన పిలుపుపై స్పందించలేదు. డిసెంబర్‌లో జరిగే ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం కోసం తన వ్యాఖ్యలను రిజర్వ్ చేస్తున్నట్టు దాస్ చెప్పారు.
ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు వీలుగా అక్టోబర్ పాలసీ సమీక్షలో తటస్థ విధానానికి మారినట్టు దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం మధ్యమధ్యలో పెరిగినప్పటికీ మోస్తరు స్థాయికి దిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతం మించిపోయిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 4 శాతానికి ప్లస్ 2 లేదా మైనస్ 2 శాతం మించకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలన్నది ఆర్‌బీఐ దీర్ఘకాలిక లక్ష్యం కావడం గమనార్హం.
దీర్ఘకాలం పాటు అంతర్జాతీయంగా ఎన్నో సంక్షోభ పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు చూపించినట్టు దాస్ చెప్పారు. కాకపోతే అంతర్జాతీయంగా ప్రస్తుతం కొన్ని ప్రతికూల పవనాలు వీస్తున్నాయంటూ.. బాండ్ ఈల్డ్స్, కమోడిటీ ధరల పెరుగుదలను ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లోనూ ఫైనాన్షియల్ మార్కెట్లు బలంగా నిలబడినట్టు చెప్పారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని.. ఇందుకు ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్న స్వీయ అభిప్రాయాన్ని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇదే సభలో వ్యక్తం చేశారు.
రూపాయికి లక్ష్యం లేదు..
రూపాయి మారకం విషయంలో ఆర్‌బీఐకి ఎలాంటి లక్ష్యం లేదని, అస్థిరతలను నియంత్రించేందుకు అవసరమైనప్పుడే జోక్యం చేసుకుంటుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. యూఎస్ ఫెడ్ 2022, 2023లో ద్రవ్య కఠిన విధానాలను చేపట్టిన తరుణంలోనూ రూపాయి స్థిరంగా ఉండడాన్ని ప్రస్తావించారు. ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) కార్యాచరణకు సంబంధించి ముసాయిదాను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment