ఏం మాయ చేశారు | Loan waiver the list of Government digit juggling | Sakshi
Sakshi News home page

ఏం మాయ చేశారు

Published Mon, Sep 7 2015 3:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఏం మాయ చేశారు - Sakshi

రుణం తీసుకున్నవాడు రుణగ్రస్తుడు ... ఇచ్చినవాడు రుణదాత. ఇది సహజమే కదా కొత్తగా చెప్పేదేముందని విసుక్కుంటున్నారు కదూ. కసురుకోకుండా సర్కారు లెక్కల్లోకి తొంగి చూడండి వాస్తవమేమిటో మీకే తెలుస్తుంది. బాబు జమానాలో బ్యాంకర్లు లెక్కల ప్రకారం పరిశీలిస్తే రుణం పొందకుండానే రుణగ్రస్తులైపోతున్నారు ... రుణం ఇవ్వకుండానే రుణదాతలై కూర్చుంటున్నారు. అదేలా అంటే ఇలా...
 
రుణమాఫీ జాబితాలో సర్కారు అంకెల గారడీ
ఇచ్చింది రూ.27 కోట్లు.. రికార్డుల్లో రూ.1,167 కోట్లు
 
- లక్ష్యానికి చేరవైపోయామంటూ బ్యాంకర్ల్ల గెంతులు
- విషయం తెలియక అయోమయంలో రైతులు
- ఖరీఫ్ ప్రారంభం కాకుండానే లక్ష్యం చేరిపోయారట!
- స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ దెబ్బకు ఠారెత్తిన అన్నదాతలు
- నేటికీ రుణ మాఫీ కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
రుణ మాయాజాలం ఇలా...

ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా రైతులకు రూ.1643.41 కోట్ల రుణాలివ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్ణయించారు. జూన్ మాసాంతానికే రూ.1167.37 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు  ప్రకటిం చేశారు. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాంతాలకుబ్యాంకర్లు చేరుకోవాల్సిన లక్ష్యం రూ.476.04 కోట్లు మాత్రమే. వాస్తవానికి ఇంత మొత్తం రుణాలు పంపిణీ జరగలేదు.  ఆ విషయం ఈ కింది పట్టికను పరిశీలిస్తే స్పష్టమవుతుంది.
 
పై పట్టికలోని సాగు విస్తీర్ణం వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించిందే. దాని ప్రకారంగా పరిశీలిస్తే ఈ ఏడాది 2,13,482.50 ఎకరాల్లో మాత్రమే రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఆ పంటలకు రకాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద మొత్తం మంజూరు చేయాల్సిన రుణం రూ.439.69 కోట్లు మాత్రమే. సాగు ప్రకారం చూస్తే రూ.109.92 కోట్లు మాత్రమే పంట రుణాలుగా తీసుకోవడానికి అర్హులు. ఇందులో బంగారం రుణాలు రూ.27.48 కోట్లు మాత్రమే ఉంటాయని అంచనా. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా రూ.1167 కోట్లు ఎలా పంపిణీ చేశారు? ఎంత మందికిచ్చారు? ఇచ్చిన రుణాలను ఏ పంటకింద వెచ్చించారో వ్యవసాయ శాఖే చెబితే బాగుంటుందని రైతులంటున్నారు. రెన్యువల్స్‌తో హస్తలాఘవం చేస్తూ బాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంద ని కన్నెర్ర చేస్తున్నారు.
 
ఒంగోలు: పంట రుణమైనా... బంగారం తాకట్టు రుణమైనా ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారమే అంటున్న బ్యాంకర్లు గోరంత సాగుకు కొండంత రుణాలు ఇచ్చినట్లు లెక్కలు చూపించేస్తున్నారు. వాస్తవానికి గతం తాలూకా రుణాలను రెన్యువల్ చేసి పాత రుణాలు రద్దుచేసి కొత్తగా ఇచ్చినట్లు బ్యాంకర్లు రికార్డులు తిరగ రాసేస్తుండడమే ఇందుకు కారణం. కొద్ది బ్యాంకులు మాత్రమే బంగారం తాకట్టుపై రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుండగా చాలా మంది పాస్ పుస్తకాలపైనే ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం రుణం ఇస్తామని చెప్పేస్తుండడంతో జిల్లా రైతాంగం ఠారెత్తిపోతోంది. వ్యాపారాన్ని, అవసరాన్ని ఒకే గాటన కట్టొద్దంటూ రైతాంగం వేడుకుంటున్నా రుణాల జారీకి బ్యాంకర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ప్రకృతి ప్రకోపాలు ఒక వైపు ... ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక పరిస్థితులు మరోవైపు వెరసి రైతు సాగుకు ముందుకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి.
 
భయపెట్టి...బెంబేలెత్తించి...

జిల్లాలో మొత్తం రూ.6500 కోట్ల రుణానికిగాను రుణమాఫీ కింద రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కేవలం రూ.1900 కోట్లు మాత్రమే. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణనలోకి లెక్కలోకి తీసుకోకుండా ఇష్టారీతిన ఎందుకు రుణాలు పంపిణీచేశారంటూ బ్యాంకర్లపై ప్రభుత్వం మండిపడింది. దీంతో అప్పటి వరకు రైతులపట్ల ఉదాశీనంగా వ్యవహరించిన బ్యాంకర్లు కూడా కఠిన వైఖరే అవలంబించాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన రుణాల పంపిణీలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతే రైతుల నుంచి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి తప్పదని భావించి అందుకు ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంది. బకాయిదారులను భయపెట్టి, బెంబేలెత్తించి, ఒత్తిడి తెచ్చి బంగారు రుణాలను వేలం వేస్తామంటూ పత్రికల్లో జారీచేసిన ప్రకటనలు రైతులను పరుగులెత్తించాయి. దీంతో బంగారానికి సంబంధించి మార్కెట్లో వచ్చిన హెచ్చుతగ్గులను చెల్లించి పాత బాకీని రదు ్దచేసుకున్నట్లు, తాజాగా రుణం తీసుకున్నట్లు బ్యాంకు రికార్డులలో చేరాయి. దీంతో లక్ష్యం కాస్తా ఖరీఫ్ ప్రారంభం కాని జూన్ నాటికే రూ. 1167.36 కోట్లకు చేరింది.
 
బంగారు రుణాలకు నై...
‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ వర్తింపజేసినాక వ్యవసాయం కోసమంటూ బంగారు రుణాలు ఇచ్చేదిలేదంటూ బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. మరీ అంతగా కావాలంటే రూ.2 లక్షల వరకు బంగారు రుణాల తాకట్టుపై 11 శాతం సాలుసరి వడ్డీకి, ఇంకా అంతకంటే ఎక్కువ కావాలంటే వాణిజ్య అవసరాలకు విధించే 12.5 శాతం వడ్డీకి రుణాలిస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది కూడా కొన్ని బ్యాంకులు మాత్రమే ముందుకు వస్తున్నాయి. అది కూడా పంట రుణం తీసుకోవాలంటే తప్పనిసరిగా బీమా ప్రీమియం కట్ చేసుకొని మిగతా మొత్తాన్ని అందిస్తున్నారు. దీంతో ఆ భారం కూడా రైతు నెత్తినే పడుతుంది.

దీంతో వడ్డీ భారం పెరిగి చివరకు రైతులు స్వచ్ఛందంగా పంట రుణాలకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, దేనా బ్యాంకు, యూకో బ్యాంకులాంటి పలు బ్యాంకులు బంగారు రుణాలను తాకట్టుపెట్టుకొని రుణాలు ఇచ్చేందుకు పూర్తిగా విముఖతను ప్రదర్శిస్తున్నాయి. ఖరీఫ్‌లో రూ.1167.36 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశామని, వాటిలో రూ. 594 కోట్లు బంగారు ఆభరణాల మీద ఇచ్చినవేనని బ్యాంకర్లు చెబుతున్నా వాటిలో కేవలం రూ. 27.48 కోట్లు మాత్రమే ఈ ఏడాది ఖరీఫ్‌లో వాస్తవానికి కొత్తగా ఇచ్చినవని, మిగిలిన మొత్తం పాత రుణాలను రెన్యువల్ చేయడం ద్వారా బ్యాంకర్లు చూపుతున్న లక్ష్యాలని రైతు సంఘాలు ఆక్షేపిస్తున్నాయి.
 
రైతులకు నష్టం ఇలా...
చంద్రబాబు రుణమాఫీ వ్యవహారం లేకముందు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకునేవారు. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ఎందుకు పాటించడంలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లను నిలదీయడంతో బ్యాంకర్లు కూడా చెక్ పెట్టేశారు. దీనికితోడు కొటేషన్లు...రకరకాల డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివాటితో రైతుకు అదనపు భారం పడుతుంది. ఈ నిబంధనలతో రైతుకు రూపాయి కూడా దక్కని పరిస్థితి నెలకుంది. చేతిలో చిల్లిగవ్వలుంటేనే సాగు...లేదంటే ఆగు పరిస్థితి ఏర్పడుతోంది.
 
మూడో విడతలోనూ మాఫీ కాలేదు
2011, డిసెంబర్ 28న మార్కాపురం ఎస్‌బీఐలో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బంగారం తాకట్టు పెట్టి రూ.75 వేల పంట రుణం తీసుకున్నాను. ఐదు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. రుణమాఫీలో తీసుకున్న నగదు మాఫీ అవుతుందన్న ఆశతో  రెండేళ్ల నుంచి బ్యాంక్‌కు చెల్లించలేదు. మొదటి, రెండో విడత జాబితాకు అన్ని అర్హత పత్రాలను పంపినా పేరు లేకపోవటంతో మూడవ విడత జాబితాకు కూడా ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, బ్యాంక్ పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్ పంపించాను. మూడో జాబితా లో కూడా నా పేరు లేదు.-భవనం వెంకట్రామిరెడ్డి, భూపతిపల్లె, మార్కాపురంమండలం  
 
రుణ మాఫీకోసం ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం..
మాది కొండపి మండలం పెరిదేపి గ్రామం. నా పేరు ముప్పరాజు బ్రహ్మయ్య. అయిదున్నర ఎకరాల పొలం ఉంది. రూ. 3 లక్షలు బ్యాంకులో రుణం తీసుకున్నా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నాకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున రుణం రద్దుకావాలి. కానీ కేవలం రూ.5 వేలు చొప్పున రుణమాఫీ ప్రకటించారు. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ తప్పుగా నమోదైందని, న్యాయం చేయాలంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. కానీ బ్యాంకర్లు మార్చి పంపినా పాత వివరాలే వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి తప్ప రుణమాఫీ జరగడం లేదు.
 -ముప్పరాజు బ్రహ్మయ్య, రైతు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement