Published
Wed, Aug 3 2016 11:16 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
త్వరలోనే రుణమాఫీ నిధుల విడుదల
జేడీఏ విజయ్‌కుమార్ వెల్లడి
సుభాష్‌నగర్ : జిల్లాలో 80 శాతం పంటల సాగు పూర్తయిందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు ఎం.విజయ్‌కుమార్ తెలిపారు. అన్ని పంటలు కలిపి 3,23,170 హెక్టార్లలో సాగు నిర్దేశించగా, అందులో ఇప్పటికే 2,48,038 హెక్టార్లలో (80 శాతం) సాగు పూర్తయ్యిందని చెప్పారు. వరిసాగు మాత్రం 40 శాతమే పూర్తయిందన్నారు. రుణమాఫీ నిధుల్లో ఇప్పటికే 12.5 శాతం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. మరో పది రోజుల్లో 12.5 శాతం నిధులు విడుదల చేయనుందన్నారు. బుధవారం వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసారి సంవృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, ఎస్సారెస్పీలో ఇప్పటికే 45 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు. జిల్లాలో 40 శాతం వరినాట్లు పూర్తయ్యాయని, ఆగస్టు 15 లోగా మిగతా 60 శాతం పూర్తవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నందున ఇప్పటికైనా నార్లు పోసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ నాటు ఆలస్యమైతే నారు మొక్కలు ఎక్కువగా నాటుకోవాలని, ఎరువుల మోతాదు సైతం రెట్టింపుగా వాడుకోవాలని తెలిపారు. తద్వారా సరైన సమయానికి వేసిన దిగుబడే ఇప్పుడూ వస్తుందన్నారు. రుణమాఫీలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో ప్రతి బ్యాంకుకు ఒక వ్యవసాయాధికారిని పర్యవేక్షణ కోసం నియమించామన్నారు. రైతుల కోసం 30 వేల టన్నుల యూరియా, 45 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఏమైనా సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు.