కార్మిక చట్టం సవరణకు ఓకే
- రెండో విడత రుణమాఫీకి నిధుల విడుదలకు అంగీకారం
- షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టులో.. సింగిల్ డెస్క్ విధానం
- ఏపీ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కార్మిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు వీలుగా కార్మిక చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు చొప్పున వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది.మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. కేబినెట్ భేటీలో తీసుకున్న ఇతర
నిర్ణయాలివీ...
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంటు యాక్టు ప్రకారం వ్యాపార సంస్థల ఏర్పాటుకు సింగిల్ డెస్క్ విధానం. ఏడాదిలోపు ఈ సంస్థలు దాఖలు చేసే ఐటీ రిటర్న్స్ ఒకేచోట దాఖలు చేసే వెసులు బాటు.
కేజీ రూపాయి వంతున దారిద్య్రరేఖకు దిగువనున్న(బీపీఎల్) కుటుంబాల్లోని అందరికీ ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం. ఏప్రిల్ 1 నుంచి అమలు రాష్ట్ర ఖజానాపై రూ.800 కోట్ల భారం పడుతుందని అంచనా .
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో శ్రీసిటీ పక్కన హీరో మోటార్స్‌కు 592 ఎకరాలు కేటాయింపు. త్వరలోనే శంకుస్థాపన.
రుణ విముక్తి కింద నాలుగు విడతల్లో భాగంగా రెండో విడత నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
గవర్నర్ కోటా కింద నామినేట్ చేసే ఇరువురు ఎమ్మెల్సీల పేర్లను సూచించాలని గవర్నర్ నరసింహన్ వద్ద నుంచి వచ్చిన సందేశాన్ని కేబినెట్ భేటీలో చదివి.. దీనిపై నిర్ణయాన్ని సీఎంకు వదిలిపెట్టారు.
ఉన్నతాధికారులతో సీఎం భేటీ
రాష్ట్ర కేబినెట్ సమావేశానంతరం సీఎం చంద్రబాబు సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యా రు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ప్రతి శాఖ కార్యదర్శి వచ్చే ఆర్ధిక సంవత్సరానికిగాను లక్ష్యాలు, కేటాయింపులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
పది మంది మంత్రుల గైర్హాజరు
ఏపీ మంత్రివర్గ సమావేశానికి పదిమంది మంత్రులు గైర్హాజరయ్యారు.ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల మంత్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ జిల్లాలకు వెళ్లారు. ఇక పరిటాల సునీత, సిద్ధా రాఘవరావు ముందస్తు అనుమతితో గైర్హాజరైనట్టు సమాచారం.