రుణమాఫీలో... తిరకాసు..
కడప అగ్రికల్చర్ : రైతుల రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందే తప్ప ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. రుణమాఫీ చేసేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా బ్యాంకర్లు మాత్రం అఫిడవిట్, కుటుంబంలోని వారందరి ఆధార్‌కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని మెలికపెట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మొదటి విడతలో అర్హులని తేల్చిన వారిని సైతం మళ్లీ పెండింగ్ లిస్టులో చేరిందని వివరాలు అడుగుతుండడంతో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ఇలా ఇంకెన్ని మెలికలు పెడతారో చెప్పాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమేమి సమర్పించాలో ఒకేసారి చెబితే సమర్పిస్తారు కదా అని..? రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలో 2.86 లక్షల మందికి రుణమాఫీ వర్తిస్తుందంటూ జాబితా ప్రభుత్వం నుంచి జిల్లాకు చేరిందని అధికారులు చెబుతున్నారు. ఈ జాబితా ప్రకారం రూ. 314 కోట్లు అర్హుల ఖాతాలకు చేరుతుందని బ్యాంకర్లు అంటున్నారు.
రుణమాఫీలో మొదటి విడత ఖాతాల వారికేనా, రెండో విడత మాఫీ అయ్యే వారికి కూడా ఇప్పుడు ప్రభుత్వం పంపిన సొమ్ములు ఖాతాలకు పడతాయా అంటే ఈ విషయాన్ని రైతులకు చెప్పే వారు కరువయ్యారు. ప్రధాన పంటలకు స్కేల్ ఆప్ ఫైనాన్స్ ప్రకారం పెట్టుబడులు సరిపోక రైతులు కొందరు రెండు ఖాతాలతో పాసు పుస్తకాలను, బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. వేరువేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే ఒక సర్వే నెంబరుతో తీసుకున్న ఖాతా రుణమాఫీనే వర్తిస్తుందని తెగేసి చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు.
పంట పెట్టుబడులకు సరిపడా రుణాలు ఇస్తే రెండు సర్వే నంబర్లు బ్యాంకుల్లో పెట్టాల్సిన అఘత్యం పట్టదని రైతులు అంటున్నారు. ప్రభుత్వ ప్రకటనతో చాలా మంది రైతులు మదనపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారులు జిల్లాలో 3,08,380 మంది ఖాతాలకు సంబందించిన వివరాలలో తేడాలు ఉన్నాయని మండల రెవిన్యూ అధికారులకు నేరుగా ఆన్‌లైన్‌లో జాబితాను పంపింది. గత అక్టోబరునెల 13వ తేదీ లోపల తుది జాబితాను తయారు చేసి పంపాలని ఆదేశించారు.
అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు దీనిపై అధికారులు కుస్తీ పట్టినా సరైన సమాచారం ఎవరి వద్ద లేకపోవడం విచారకరం. జిల్లా వ్యాప్తంగా పంటల సాగు కోసం భూములు, బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి 5,50,513 మంది రైతులు రుణాన్ని తీసుకున్నారు. ఇందులో ఆధార్, రేషన్‌కార్డులకు ముడిపెట్టి 3,08,377 ఖాతాలను ప్రభుత్వం తిరస్కరించింది.
జిల్లాలో రేషన్‌కార్డులు లేని రైతులు 41,365 మంది, ఆధార్‌కార్డులు లేని 14,291 మంది, ఆధార్, రేషన్ కార్డులు లేని 85,104 ఖాతాలు, ఆధార్ ఉండి కూడా ఆన్‌లైన్ ధ్రువీకరించని 1,67,617 మంది ఖాతాలు ఉన్నాయని తేల్చారు. వీటన్నింటిని పరిశీలించాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శించాలని ఆర్థికశాఖ ఆదేశించింది. మండల రెవిన్యూ అధికారులు ఏ గ్రామ పంచాయితీల్లో కూడా జాబితాను ప్రదర్శించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో దీనిపై ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జన్మభూమి కమిటీలు దీనిపై విచారణ చేయాలని పురమాయించినా పట్టించుకున్న నాధుడేలేడు. రుణమాఫీకి అర్హులెవరో అనర్హులెవరో చూసుకోవడానికి జాబితానే అందుబాటులోలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన కేవలం మభ్య పెట్టేందుకేనని రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
రుణమాఫీ చేసి తీరుతామని ఢంకా బజాయించి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రుణమాఫీపై ఎలాంటి చర్యలు లేవు. కేవలం మసిపూసి మారేడు కాయచేసేందుకే ఈ హంగామా అంతా అని రైతు సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వం ఏదో ఒక లిటిగేషన్ పెట్టి రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తే రైతులు మరిచిపోయి రుణాలు బ్యాంకులకు చెల్లిస్తారనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోందని రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి.