meanders
-
అమ్మ
‘‘భయంగా ఉంది’’ భర్త భుజమ్మీద తల వాల్చుతూ భార్య.‘‘నేనున్నా కదా.. ’’ భార్య చెక్కిలి స్పృశిస్తూ అభయమిచ్చాడు. నిట్టూరుస్తూ అతణ్ణి అల్లుకుపోయింది ఆమె.వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. సొంత ఊళ్లో పెద్దలు తమని వేరు చేస్తారనే భయంతో కొన్ని వందల కిలోమీటర్లు దాటి వచ్చారు. యేడాదిగా ఒక్కో ఊరు.. ప్రస్తుతం ఇక్కడ. ఇప్పుడు ఆమె నిండు గర్భిణి. ఆ ఊళ్లో టీచర్‌గా ఉపాధి దొరికింది అతనికి. పల్లెటూరు. పచారీ కొట్టు అందుబాటులోనే ఉన్నా.. ఆసుపత్రి లేదు. కనీసం ఏడు కిలోమీటర్లు వెళ్లాలి. ఇరుగూపొరుగూ దగ్గరగా లేక విసిరేసినట్టుగానే ఉంది ఇల్లు. అద్దె తక్కువని చేరారు. సమయానికి ఎవరూ రారేమోనన్న భయం ఆమెది. బయటకు బింకంగా కనిపిస్తున్నా లోపల అతనికీ దిగులుగానే ఉంది కాన్పు గురించి. ‘‘ఆకు కూరలు తీసుకోమ్మా... తాజాగా ఉన్నాయ్. నీ బిడ్డక్కూడా మంచిది’’ లేత తోటకూర కట్టల్ని ఏరిఏరి ఇస్తోంది కూరగాయలమ్మ.సిగ్గు.. ఆమె నున్నటి బుగ్గల మీద ప్రతిఫలిస్తోంది గులాబీ రంగుగా. ‘‘చక్కటి పిల్ల. ఆలనాపాలనా ఉంటే ఇంకెంత ఆరోగ్యంగా ఉండేదో’’ మనసులో అనుకుంటూ పైకి అడిగింది‘‘నెలలు నిండినట్టున్నాయ్.. పెద్దవాళ్లెవరూ లేరా తల్లీ’’ అని.తోటకూర కట్టల్ని చేటలో సర్దుకుంటున్నదల్లా ఒక్కసారిగా తలెత్తి చూసింది కూరలగాయలమ్మను.‘‘కొత్తగా వచ్చినట్టున్నారు.. నాలుగు రోజులుగా చూస్తున్నా..! పెద్దవాళ్లెవరూ కనిపించలేదు’’ నింపాదిగా కూరగాయలమ్మ.గబగబా ఆ ఆకుకూరలు తీసుకుని లోపలికి వెళ్లిపోయి తలుపేసుకుంది ఆ అమ్మాయి.‘‘ఇదిగో అమ్మాయ్...మాట...’’అని కూరగాయలమ్మ పిలుస్తున్నా వినకుండా. ‘‘అయ్యో తల్లీ.. ఒక్కదానివే ఎలా నెట్టుకొస్తావ్’’ బాధపడుతూ బుట్ట ఎత్తుకుంది ఇంకో చోటికి. ‘‘మీ అమ్మో.. అత్తో.. మీతో ఉంటే ఇవన్నీ చేసేవారు. తొలిచూలు అపురూపమే వేరు’’ గోరింటాకు పెడ్తూ చెప్తోంది.‘‘సారీ.. అవ్వా.. ఆరోజు నీ మొహమ్మీదే తలుపేసాను. కొత్త కదా... ఎవరు ఎలాంటి వాళ్లో తెలీదు.. ఎవరూ లేరని తెలిస్తే.. ’’ ఆగిపోయింది ఆ అమ్మాయి.‘‘నేనేం తప్పుపట్టుకోలేదు తల్లీ.. నువ్వు నా బిడ్డలాంటిదానివి! ’’ అంది గోరింటాకు పెట్టిన ఆ పిల్ల చేతులను ముద్దుగా చూసుకుంటూ!ఆ అమ్మాయి కళ్లల్లో నీళ్లు.‘‘అరే... ఏంటమ్మా ఇది? చెప్పా కదా..నువ్వు నా బిడ్డ లాంటిదానివని.నీకు పురుడు పోసే బాధ్యత నాది. ఊరుకో తల్లీ.. ఈ టైమ్‌లో అలా కళ్లనీళ్లు పెట్టద్దు’’ ఖాళీ అయిన గోరింటాకుగిన్నెలో చేతులు కడుక్కుని ఆ తడి చేత్తోనే ఆ అమ్మాయి కళ్లు తుడుస్తూ అంది ఆమె.ఆ ఆప్యాయతకు ఆ అమ్మాయిలో గడ్డకట్టుకున్న దుఃఖం కరిగిపోయింది.అంతే ఆమె గుండెలో తలపెట్టి వెక్కివెక్కి ఏడ్వసాగింది. ఆ పిల్ల తల నిమురుతూ అలాగే ఏడ్వనిచ్చింది. ఆ కాసేపట్లోనే ఆ పెద్దామె మనసులో ఎన్నో జ్ఞాపకాలు.. తన కూతురు... ఇలాగే ఉండేది. ఈ ఇంట్లోనే. కడుపులో ఉన్నది ఆడపిల్లఅని తెలిసి ఆ పిల్ల పెంపకానికి డబ్బులు కావాలని ఇబ్బంది పెట్టారు. ఇచ్చేట్టు లేమని తెలిసి పురిటికి పుట్టింటికి పంపలేదు. నొప్పులు పడ్తున్నా ఆసుపత్రికీ తీసుకెళ్లలేదు. కడుపులో బిడ్డ పేగుమెడకేసుకుని అడ్డం తిరిగింది. కడుపులోనే పోయింది. వైద్యం అందక తన బిడ్డా ప్రాణం వదిలింది. ఆ విషాదగతం ఆమె కంటా నీరు పెట్టించింది.తేరుకున్న ఆ అమ్మాయి చూసి.. ‘‘అయ్యో.. అమ్మా.. మీరెందుకేడుస్తున్నారు?సారీ.. అమ్మా.. నేనేమైనా బాధపెట్టుంటే ’’ గోరింటాకు చేతి మణికట్టుతో ఆమె కళ్లు తుడుస్తూ నొచ్చుకుంది ఆ అమ్మాయి.తెప్పరిల్లిన ఆమె ‘‘ఛ.. ఛ..అట్లాదింటేం లేదు’’ అని చీర చెంగుతో మొహం తుడుచుకుంటూ ‘‘అన్నం పెట్టనా..’’ అంటూ వంట గదిలోకి వెళ్లింది.‘‘థాంక్స్ దేవుడా.. ఈ అమ్మను ఇచ్చినందుకు’’ కనిపించని ఆ దేవుడికి దండం పెట్టుకుంది ఆ అమ్మాయి. ‘‘అమ్మా...భరించలేను.. నా వల్ల కాదు..’’ నొప్పితో మెలికలు తిరిగిపోతోంది ఆ పిల్ల.‘‘కాస్త ఓర్చుకో ప్లీజ్.. నేను అలా వెళ్లి ఎవరైనా తోడు వస్తారేమో చూస్తా... ’’‘‘నా వల్ల కావట్లేదు... కూరగాయలమ్మ వస్తుందేమో చూడవా ఒకసారి’’ పంటి కింద నొప్పిని భరిస్తూ నడుమ్మీద చేతి ఆసరాతో మంచమ్మీద కూర్చుంటూ అంది.‘‘ఆమె కోసం చూసేంత టైమ్ లేదులేగానీ.. బయటకు వెళ్లి ఎవరినైనా సాయం అడిగొస్తా.. ఆసుపత్రికెళ్లడానికి.. అందాక కాస్త ఓపిక పట్టు’’ అంటూ మంచినీళ్ల చెంబు ఆమెకిచ్చి బయటకు వెళ్లిపోయాడు.అతనలా వెళ్లాడో లేదో.. కూరగాయలమ్మ వచ్చింది.‘‘ఏం తల్లీ.. నొప్పులు పడ్తున్నావా?అయ్యో.. నిన్న రాత్రి ఇక్కడే ఉంటానంటికదా.. పర్లేదు పో అన్నావ్’’ అంటూ గబగబా ఆ అమ్మాయిని పడుకోబెట్టింది.కూరగాయలమ్మను చూడగానే అమ్మాయికి భరోసా వచ్చింది.‘‘అమ్మా... ఇక్కడే ఉంటావ్ కదా..’’ ఓ ధైర్యం కోసం అడుగుతోంది ఆ పిల్ల.‘‘నేనెక్కడికి పోతానమ్మా..నీ చేతిలో పండంటి బిడ్డను పెట్టందే ఎక్కడికీ పోను’’ అంటూ ఆమె నుదిటి మీద చేయి వేసి ధైర్యమిచ్చి... తను వెంటతెచ్చిన పాత గుడ్డల మూట విప్పింది.‘‘అమ్మా....’’ అంటూ అరిచింది అమ్మాయి.‘‘ఏంకాదు... కాస్త ఓపికపట్టు’’ అంటూ ఆ పిల్ల కాళ్లను మలిచి ఎడం చేసింది.ఆ అమ్మాయికి అంతకంతకు నొప్పులు ఎక్కువవుతున్నాయి.. అర్థమవుతోంది కూరగాయలమ్మకు. వంటింట్లోకి వెళ్లి స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టింది. మళ్లీ ఈ గదిలోకి వచ్చేటప్పటికే పిల్లకు నొప్పులు ఉధృతమయ్యాయి. ఆ పిల్ల కాళ్లువణుకుతున్నాయి. మొహం ఎర్రబడింది.. చూసింది... నల్లగా తలకట్టు కనబడుతోంది...‘‘తల్లీ.. బిడ్డ బయటకు వస్తోంది.. ఊపిరి ఎగబబీల్చకు.. కిందకు నొక్కు నొప్పిని...’’ చెప్తోంది..అయినా బిగబట్టలేక పైకి పీల్చుకుంది ఆ పిల్ల.కంగారు పడింది కూరగాయలమ్మ.. ‘‘అయ్యో అలా చేయకమ్మా,, బిడ్డకు శ్వాసాడదు.. ’’ తన అనుభవసారం చెప్తోంది..మూడేమూడు పెద్ద నొప్పులు... బిడ్డ కూరగాయలమ్మ చేతిలో పడింది.. కేర్... కేర్.....‘‘ఆడపిల్ల’’ కూరగాయలమ్మ మొహం వెలిగిపోతోంది.అప్పటిదాకా అనుభవించిన నరకం.. మాయమైంది... బిడ్డ ఏడుపు.. ఆ తల్లి మనసును శాంత పరిచింది. హాయిగా కళ్లు మూసుకుంది బాలింత అలసట తీర్చుకునేందుకు.‘‘మాయా... మాయా..’’ పడుకున్న భార్యను లేపాడు.మగతగా కళ్లు తెరిచింది ఆమె. భర్తను చూసింది... అతని వెంట ఉన్న మరో ఇద్దరు ఆడవాళ్లనూ!లేవబోయింది... పక్కన పొత్తిళ్లల్లో బిడ్డ ఒళ్లు విరుచుకుంటూ ...‘‘నీళ్లాడింది కదా బాబూ...’’ అంది వెంట వచ్చిన ఆడవాళ్లలో ఒకామే ఆ బిడ్డను ఎత్తుకుంటూ.‘‘ఎలా?’’ చూశాడు. ‘‘కూరగాయలమ్మ’’ చెప్పింది చిన్న స్వరంతో.‘‘ఎక్కడా?’’ అడిగాడు ‘‘ఇందాకటిదాకా నా పక్కనే ఉందే! వంటింట్లోకెళ్లిందేమో’’ అంది .చూశాడు.. వంటగదిలో లేదు.. ఇంకెక్కడా కనిపించలేదు. తను సాయం కోసం బయటకు వెళ్లొచ్చిన పదినిమిషాల్లోనే ఇదంతా.. ఎలా సాధ్యం? వింతగా.. అయోమయంగా ఉంది అతనికి! - సరస్వతి రమ -
స్నేక్ బ్రెయిడ్
సిగ సౌందర్యం మెలికలు తిరిగే పామును చూస్తే ఒళ్లు ఝల్లుమంటుంది. అదే మెలికలు తిరిగిన సొగసైన జడను చూస్తే ఒళ్లు పులకరిస్తుంది. అందమైన తలకట్టు అతివ అందానికి తొలి మెట్టు. అందుకే కురులను ముడి వేసినా చెల్లుతుంది, మెలికలు తిప్పి అల్లినా చెల్లుతుంది. కనికట్టు చేసే స్నేక్ బ్రెయిడ్ తలకట్టు ఈవారం మీకోసం... 1. ముందుగా జుత్తును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఆ తర్వాత నడి నెత్తిమీద ఓ పెద్ద పాయను తీసుకోవాలి. 2. ఆ పాయలోంచి ఓ పక్కగా మరో చిన్న పాయను తీయాలి. 3. పక్క నుంచి తీసిన సన్నని పాయను జడలాగా అల్లుకోవాలి. 4. ఆ జడను అల్లుతున్నప్పుడు పక్క నుంచి మరో చిన్న పాయను తీసుకోవాలి. 5. తీసుకున్న పాయను ఆల్రెడీ అల్లుతున్న జడతో కలిపి అల్లాలి. దాన్ని ఓ పక్కగా పెట్టి కదలకుండా స్లైడ్స్ పెట్టేయాలి. 6. మరో పాయను కూడా తీసుకుని జడను వెనక్కి అల్లుకుంటూ రావాలి. 7. పైన మొదట తీసిన పాయ కింద నుంచి ఒక్కొక్క పాయనూ తీసుకుని ఈ జడకు కలుపుకుంటూ అల్లాలి. దాన్ని ఎడమవైపున ఉంచి స్లైడ్స్ పెట్టేయాలి. 8. మళ్లీ పాయలు తీసుకుంటూ జడను కుడివైపునకు అల్లుకుంటూ రావాలి. 9. అప్పుడు జడ ఈ ఫొటోలో చూపినట్టుగా అవుతుంది. 10. జడను జాగ్రత్తగా పట్టుకుని, కింద ఉన్న జుత్తునంతా నున్నగా దువ్వుకోవాలి. ఆపైన జుత్తుని జడతో కలిపి చివరి వరకూ అల్లుకుంటూ వచ్చి, చివర కొద్దిగా జుత్తు వదిలేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. ఇది సల్వార్ కమీజుల మీదికి, గాగ్రాస్ మీదికి బాగా నప్పుతుంది. జడకు అక్కడక్కడా చిన్న చిన్న పూసలు కానీ, ప్లాసిక్ పువ్వులు కానీ గుచ్చితే మరింత రిచ్ లుక్ వస్తుంది. -
రుణమాఫీలో... తిరకాసు..
కడప అగ్రికల్చర్ : రైతుల రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందే తప్ప ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. రుణమాఫీ చేసేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా బ్యాంకర్లు మాత్రం అఫిడవిట్, కుటుంబంలోని వారందరి ఆధార్‌కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని మెలికపెట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మొదటి విడతలో అర్హులని తేల్చిన వారిని సైతం మళ్లీ పెండింగ్ లిస్టులో చేరిందని వివరాలు అడుగుతుండడంతో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇలా ఇంకెన్ని మెలికలు పెడతారో చెప్పాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమేమి సమర్పించాలో ఒకేసారి చెబితే సమర్పిస్తారు కదా అని..? రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలో 2.86 లక్షల మందికి రుణమాఫీ వర్తిస్తుందంటూ జాబితా ప్రభుత్వం నుంచి జిల్లాకు చేరిందని అధికారులు చెబుతున్నారు. ఈ జాబితా ప్రకారం రూ. 314 కోట్లు అర్హుల ఖాతాలకు చేరుతుందని బ్యాంకర్లు అంటున్నారు. రుణమాఫీలో మొదటి విడత ఖాతాల వారికేనా, రెండో విడత మాఫీ అయ్యే వారికి కూడా ఇప్పుడు ప్రభుత్వం పంపిన సొమ్ములు ఖాతాలకు పడతాయా అంటే ఈ విషయాన్ని రైతులకు చెప్పే వారు కరువయ్యారు. ప్రధాన పంటలకు స్కేల్ ఆప్ ఫైనాన్స్ ప్రకారం పెట్టుబడులు సరిపోక రైతులు కొందరు రెండు ఖాతాలతో పాసు పుస్తకాలను, బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. వేరువేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే ఒక సర్వే నెంబరుతో తీసుకున్న ఖాతా రుణమాఫీనే వర్తిస్తుందని తెగేసి చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు. పంట పెట్టుబడులకు సరిపడా రుణాలు ఇస్తే రెండు సర్వే నంబర్లు బ్యాంకుల్లో పెట్టాల్సిన అఘత్యం పట్టదని రైతులు అంటున్నారు. ప్రభుత్వ ప్రకటనతో చాలా మంది రైతులు మదనపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారులు జిల్లాలో 3,08,380 మంది ఖాతాలకు సంబందించిన వివరాలలో తేడాలు ఉన్నాయని మండల రెవిన్యూ అధికారులకు నేరుగా ఆన్లైన్లో జాబితాను పంపింది. గత అక్టోబరునెల 13వ తేదీ లోపల తుది జాబితాను తయారు చేసి పంపాలని ఆదేశించారు. అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు దీనిపై అధికారులు కుస్తీ పట్టినా సరైన సమాచారం ఎవరి వద్ద లేకపోవడం విచారకరం. జిల్లా వ్యాప్తంగా పంటల సాగు కోసం భూములు, బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి 5,50,513 మంది రైతులు రుణాన్ని తీసుకున్నారు. ఇందులో ఆధార్, రేషన్‌కార్డులకు ముడిపెట్టి 3,08,377 ఖాతాలను ప్రభుత్వం తిరస్కరించింది. జిల్లాలో రేషన్‌కార్డులు లేని రైతులు 41,365 మంది, ఆధార్‌కార్డులు లేని 14,291 మంది, ఆధార్, రేషన్ కార్డులు లేని 85,104 ఖాతాలు, ఆధార్ ఉండి కూడా ఆన్లైన్ ధ్రువీకరించని 1,67,617 మంది ఖాతాలు ఉన్నాయని తేల్చారు. వీటన్నింటిని పరిశీలించాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శించాలని ఆర్థికశాఖ ఆదేశించింది. మండల రెవిన్యూ అధికారులు ఏ గ్రామ పంచాయితీల్లో కూడా జాబితాను ప్రదర్శించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దీనిపై ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జన్మభూమి కమిటీలు దీనిపై విచారణ చేయాలని పురమాయించినా పట్టించుకున్న నాధుడేలేడు. రుణమాఫీకి అర్హులెవరో అనర్హులెవరో చూసుకోవడానికి జాబితానే అందుబాటులోలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన కేవలం మభ్య పెట్టేందుకేనని రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. రుణమాఫీ చేసి తీరుతామని ఢంకా బజాయించి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రుణమాఫీపై ఎలాంటి చర్యలు లేవు. కేవలం మసిపూసి మారేడు కాయచేసేందుకే ఈ హంగామా అంతా అని రైతు సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వం ఏదో ఒక లిటిగేషన్ పెట్టి రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తే రైతులు మరిచిపోయి రుణాలు బ్యాంకులకు చెల్లిస్తారనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోందని రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి.