స్నేక్ బ్రెయిడ్
సిగ సౌందర్యం
మెలికలు తిరిగే పామును చూస్తే ఒళ్లు ఝల్లుమంటుంది. అదే మెలికలు తిరిగిన సొగసైన జడను చూస్తే ఒళ్లు పులకరిస్తుంది. అందమైన తలకట్టు అతివ అందానికి తొలి మెట్టు. అందుకే కురులను ముడి వేసినా చెల్లుతుంది, మెలికలు తిప్పి అల్లినా చెల్లుతుంది. కనికట్టు చేసే స్నేక్ బ్రెయిడ్ తలకట్టు ఈవారం మీకోసం...
1. ముందుగా జుత్తును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఆ తర్వాత నడి నెత్తిమీద ఓ పెద్ద పాయను తీసుకోవాలి.
2. ఆ పాయలోంచి ఓ పక్కగా మరో చిన్న పాయను తీయాలి.
3. పక్క నుంచి తీసిన సన్నని పాయను జడలాగా అల్లుకోవాలి.
4. ఆ జడను అల్లుతున్నప్పుడు పక్క నుంచి మరో చిన్న పాయను తీసుకోవాలి.
5. తీసుకున్న పాయను ఆల్రెడీ అల్లుతున్న జడతో కలిపి అల్లాలి. దాన్ని ఓ పక్కగా పెట్టి కదలకుండా స్లైడ్స్ పెట్టేయాలి.
6. మరో పాయను కూడా తీసుకుని జడను వెనక్కి అల్లుకుంటూ రావాలి.
7. పైన మొదట తీసిన పాయ కింద నుంచి ఒక్కొక్క పాయనూ తీసుకుని ఈ జడకు కలుపుకుంటూ అల్లాలి. దాన్ని ఎడమవైపున ఉంచి స్లైడ్స్ పెట్టేయాలి.
8. మళ్లీ పాయలు తీసుకుంటూ జడను కుడివైపునకు అల్లుకుంటూ రావాలి.
9. అప్పుడు జడ ఈ ఫొటోలో చూపినట్టుగా అవుతుంది.
10. జడను జాగ్రత్తగా పట్టుకుని, కింద ఉన్న జుత్తునంతా నున్నగా దువ్వుకోవాలి. ఆపైన జుత్తుని జడతో కలిపి చివరి వరకూ అల్లుకుంటూ వచ్చి, చివర కొద్దిగా జుత్తు వదిలేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి.
ఇది సల్వార్ కమీజుల మీదికి, గాగ్రాస్ మీదికి బాగా నప్పుతుంది. జడకు అక్కడక్కడా చిన్న చిన్న పూసలు కానీ, ప్లాసిక్ పువ్వులు కానీ గుచ్చితే మరింత రిచ్ లుక్ వస్తుంది.