నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు
- ముఖ్యమంత్రిపై డ్వాక్రా మహిళల ఆగ్రహం
- పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్
- తంబళ్లపల్లెలో నిరసన ర్యాలీ, ధర్నా
తంబళ్లపల్లె: ఎన్నికల ముందు ప్రజలు అడగక మునుపే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మాట నిలుపుకోకుంటే మనుగడ ఉండదని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు.
డ్వాక్రా రుణాల మాఫీపై రోజుకో విధంగా ప్రకటనలు చేస్తూ కాలయాపన చేయడంపై తంబపల్లెలో నిరసనకు దిగారు. సోమవారం తంబళ్లపల్లెలో డ్వాక్రా మహిళలు ఆర్‌టీసీ బస్టాండ్ నుంచి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహశీల్దార్ కార్యాల యం వరకు ర్యాలీ చేశారు. హరిత సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు డ్వా క్రా మహిళలు మాట్లాడుతూ మహిళలను న మ్మించి మోసం చేయడం ముఖ్యమంత్రికి తగదన్నారు. పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణమాఫీపై రోజుకో నిర్ణయాన్ని తీసుకుంటూ మహిళలను తికమక పెట్టడం సరికాదన్నారు. డ్వాక్రా సంఘాలను పూర్తిగా అధోగతిపాలు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిపోతారన్నారు.
ఎన్నికల ప్రచారంలో ఎవ్వరూ రుణాలు చెల్లించవద్దని చెప్పి ఇప్పుడు మాట మార్చడం నీచమన్నారు. దీనిపై మహిళలంతా ఉద్యమించి ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధమవుతామే గానీ రుణాలు చెల్లించేది లేదని తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయకుంటే ఓట్లు అడిగిన వారిని నిలదీస్తామన్నారు. ఎమ్మెల్యేలను సైతం గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. అనంతరం డెప్యూటీ తహశీల్దార్ షంషీర్‌ఖాన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్‌ఐ నరేష్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.