‘రుణం’ తీర్చుకునేది ఇలాగేనా!
‘రుణం’ తీర్చుకునేది ఇలాగేనా!
Published Sun, Oct 23 2016 11:19 PM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
–రుణమాఫీ అని చెప్పి నోటీసులిస్తారా!
–సర్కారుపై డ్వాక్రా మహిళల మండిపాటు
అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకుంటామని, రుణమాఫీ చేసి తీరతామని ప్రగల్భాలు పలికిన అధికారపార్టీ ఆ మాటను తప్పింది. ఫలితంగా తీసుకున్న రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో రుణం తీర్చుకునే తీరిదేనా అంటూ మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటీవల నరసాపురం మండలం, జంగారెడ్డిగూడెంలలో డ్వాక్రా మహిళలకు నోటీసులుజారీ చేసిన బ్యాంకులు తాజాగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన సుమారు వంద మందికి తాఖీదులు ఇచ్చాయి. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు.
జంగారెడ్డిగూడెం రూరల్ : రైతుమిత్ర రుణాలు తీసుకున్న జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన సుమారు 100 మందికి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామంలో 50 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నీ నాలుగేళ్ల క్రితం రైతుమిత్ర రుణాల కింద గ్రూపునకు రూ.3లక్షల చొప్పున లక్కవరం ఆంధ్రాబ్యాంకులో రుణాలు పొందాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం, ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో ఈ గ్రూపులు రుణమాఫీ అవుతుందనే ఆశతో తిరిగి చెల్లించడం మానేశాయి. ఈ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం గ్రూపునకు రూ.ఐదులక్షలు చెల్లించాలని గ్రూపుల్లోని సభ్యులందరికీ నోటీసులు అందాయి. ఇలా సుమారు గ్రామంలో వందమందికి తాఖీదులు వచ్చాయి. ఇంకా చాలామందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మహిళలు దేవులపల్లి వచ్చిన మంత్రి పీతల సుజాత దష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆమె దీనిని పరిశీలించాలని వ్యవసాయ శాఖ ఏడీఎ కమలాకర శర్మను ఆదేశించారు. ఈ సమస్యపై బ్యాంకర్లతో మాట్లాడతానని ఏడీఏ చెప్పుకొచ్చారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకునేది ఇలాగేనా అంటూ పెదవివిరుస్తున్నారు.
న్యాయం చేయాలి
తీసుకున్న రుణాలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. రుణాలను చెల్లించాలంటూ నోటీసులు పంపారు. మాఫీ అవుతుందని ఎదురుచూశాం. మాకు నిరాశే ఎదురైంది. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలి
– షేక్ మస్తాన్‌బీ, దేవులపల్లి
రుణమాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూశాం. కానీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా తాము తీసుకున్న రైతుమిత్ర గ్రూపు రుణాలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఒక పక్క రుణాలు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. ఏం చేయాలో తెలియని దుస్థితి నెలకొంది.
– బల్లే రమాదేవి, దేవులపల్లి
Advertisement
Advertisement