ప్రమాదంలో ‘డ్వాక్రా’..!
- రుణమాఫీ కాక, కొత్త అప్పు పుట్టక తిప్పలు
►బాబు హామీ నమ్మి రుణాలు చెల్లించని మహిళలు
►తీసుకున్న అప్పు కట్టితీరాలంటున్న బ్యాంకర్లు
►కొత్త రుణాల మంజూరులోనూ కోతలు..
చెరుకుపల్లి : డ్వాక్రా మహిళలను నిరాశ నిసృ్పహలు చుట్టుముడుతున్నాయి. నామమాత్రంగా రుణాలు మంజూరు చేయడం పట్ల నిర్వేదం చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే పాత రుణాలను రద్దు చేయని పక్షంలో సంఘాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.
►కొత్త ప్రభుత్వం వచ్చిన తరవాత గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి.
►గతంలో ఒక్కో గ్రూపునకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించ గా ప్రస్తుతం రుణాలు మంజూరు చేయటం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
►చెరుకుపల్లి మండలంలోని డ్వాక్రా గ్రూపు మహిళలు వివిధ బ్యాంక్‌ల్లో పొదుపు చేస్తున్నారు. గతంలో ఈ గ్రూపులన్నిటికీ కలిపి సుమారు రూ.50 కోట్లకు పైగా రుణాలను ఆయా బ్యాంక్‌లు అందించగా,ప్రస్తుతం 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.10.5 కోట్లకు పరిమితం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
►ఎన్నికలకు ముందు వడ్డీలేని డ్వాక్రా రుణాలను గ్రూపునకు రూ.10లక్షలకు వరకు అందజేస్తామని నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయంటున్నారు.
►గతంలో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించినప్పటికీ కొత్తరు ణాలు మంజూరు చేయకపోవటమేమిటని ప్రశ్నిస్తున్నారు.
►ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరకపోవడం తో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
►ఆయన మాటలు నమ్మిన మహిళలు బ్యాంకులకు రుణాల చెల్లింపును నిలిపివేసి మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నట్టు మహిళలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.
► చంద్రబాబు హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో ఇప్పుడు తమ పరిస్థితి ‘ఇంటి కూటికి బంతికూటికి చెడ్డ’ చందంగా తయారైందని వాపోతున్నారు.
►పాత రుణాలు చెల్లించలేక, కొత్తరుణాలు పొందలేక సంఘాలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయని,తక్షణమే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సంఘాలను బతికించాలని కోరుతున్నారు.