మేసేస్తున్నారు
మేసేస్తున్నారు
Published Fri, Feb 10 2017 10:57 PM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
డ్వాక్రా మహిళల నుంచి బలవంతపు వసూళ్లు
ప్రతి గ్రూప్ నుంచి రూ.1,300 చెల్లించాల్సిందే
65 వేల గ్రూపుల నుంచి రూ.8.45 కోట్లు లూటీ
డ్వాక్రా మహిళలు అడుగడుగునా దగా పడుతున్నారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు చివరకు రిక్తహస్తం చూపించడంతో వడ్డీలు తడిసి మోపెడై మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో రుణమాఫీకి బదులుగా ఏటా రూ.3 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత ఏడాది పెట్టుబడి నిధి పేరిట రూ.3 వేల చొప్పున జమ చేసినా.. ఆ సొమ్మును బ్యాంక్ ఖాతాల నుంచి తీసుకునే అవకాశం లేకుండా చేశారు. ఈ ఏడాది పసుపు, కుంకుమ పేరిట రూ. 3 వేల చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించగా.. ఆ సొమ్ము తీసుకోవాలంటే తమ చేతులు తడపాలని యానిమేటర్లు.. గ్రామ, మండల సమాఖ్యల అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు. అదేమని అడిగితే.. ఆ సొమ్ములన్నీ పై అధికారులకు ముట్టజెప్పాల్సి ఉంటుందని చెబుతున్నారు.
పాలకోడేరు :
పసుపు, కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సొమ్ములో కమీషన్లు గుంజుతున్నారు. ఒక్కొక్క మహిళ నుంచి రూ.130 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆ సొమ్ము చెల్లిస్తేనే.. రూ.3 వేలను ఖాతాల్లో జమ అయ్యే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇలా ప్రతి గ్రూపు నుంచి రూ.1,300 చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. జిల్లాలో 65 వేల గ్రూపులకు పసుపు, కుంకుమ నిధులు మంజూరు కాగా, ఒక్కొక్క గ్రూపు నుంచి రూ.130 చొప్పున రూ.8.45 కోట్లను మింగేసేందుకు జిల్లా స్థాయిలో పథకం రచించి.. వసూళ్ల కార్యక్రమాన్ని యానిమేటర్లతోపాటు గ్రామ, మండల సమాఖ్య అధ్యక్షులకు అప్పగించారు.
వ్యక్తిగత ఖాతాల్లో జమకాని నిధులు
పసుపు, కుంకుమ పేరిట ఇస్తున్న ఈ నిధులను డ్వాక్రా మహిళల వ్యక్తగత ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఈ మొత్తాలను గ్రూపు లీడర్ల ఖాతాల్లో వేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుని ప్రతి గ్రూపు నుంచి రూ.1,300 చొప్పున వసూలు చేస్తున్నారు. కమీషన్ నగదు ముట్టచెప్పిన అనంతరమే పసుపు, కుంకుమ సొమ్మును ఆ గ్రూపు ఖాతాలో జమ చేయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో డ్వాక్రా సంఘం అధ్యక్షులు తమ గ్రూపులోని ప్రతి సభ్యురాలి నుంచి రూ.130 చొప్పున వసూలు చేసి ఐకేపీ సిబ్బందికి సమర్పించుకుంటున్నారు.
డబ్బులిస్తేనే సొమ్ములిస్తారంట
: విప్పర్తి జూలియమ్మ, మోగల్లు
రుణమాఫీ పేరుతో ఒక్కొక్క మహిళ నుంచి రూ.130 చొప్పున యానిమేటర్లు వసూలు చేశారు. ఎందుకని అడిగితే ఇలా సొమ్ములిస్తేనే పసుపు, కుంకుమ నిధులు ఇస్తామంటున్నారు. ఈ ఒక్క దానికే కాదు.. ప్రతి పనికీ వాళ్ల చేయి తడపాల్సి వస్తోంది.
డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు
పెనుమాల మరియమ్మ , మోగల్లు
వాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వకపోతు ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మొదటి నుంచీ ఇలాగే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీల విషయాలు మాత్రం మాకు తెలియనివ్వడం లేదు.
డబ్బులు తీసుకుంటారు.. రుణాలివ్వరు
బి.మార్త, మోగల్లు
ప్రభుత్వ పరంగా ఇచ్చే సబ్సిడీలు, పథకాల గురించి మాకు తెలియడం లేదు. డబ్బులు వసూళ్లకైతే ఇంటికొచ్చి వచ్చి మరీ అడుగుతారు. రాయితీలతో కూడిన రుణాలు మాత్రం మాకు ఇవ్వడం లేదు
వసూళ్లకు ఆస్కారం ఉండదు
డ్వాక్రా గ్రూపులకు మంజూరైన పసుపు, కుంకుమ నిధులు సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యాయి. అలాంటప్పుడు వసూళ్లకు ఆస్కారం ఉండదు. ఎవరైనా డబ్బులు అడిగినా, తీసుకున్నా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.
కె.శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఆర్‌డీఏ
Advertisement