డ్వాక్రాలపై అప్పు డప్పు | dwakralapai appu dappu | Sakshi
Sakshi News home page

డ్వాక్రాలపై అప్పు డప్పు

Published Wed, Feb 8 2017 11:07 PM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM

డ్వాక్రాలపై అప్పు డప్పు - Sakshi

డ్వాక్రాలపై అప్పు డప్పు

తక్షణమే రుణాలు చెల్లించాలంటూ మహిళా సంఘాలకు నోటీసులు
 లేదంటే ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరికలు
 ఆర్డీవో చెంతకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాలంటూ ఆదేశాలు
 రుణమాఫీ ఊసెత్తొదంటున్న అధికారులు
 
 
ః డ్వాక్రా మహిళలపై అప్పు డప్పు మోగుతోంది. రుణాలకు సంబంధించి బకాయిలు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగిస్తామని.. గ్రామాల్లో టాం టాం వేయించి పరువు తీస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌లో అప్పులు పుట్టకుండా చేస్తామని.. వడ్డీ వ్యాపారులు కూడా ఆదుకోలేని స్థితి కల్పిస్తామని బెదిరిస్తున్నారు. ’అదేంటయ్యా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా. చంద్రబాబు వీధివీధికీ వచ్చి మరీ రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆయన మాటవల్లే కదా బకాయి పడ్డాం. అసలు కంటే వడ్డీ భారం ఎక్కువైపోయింది. ఎలా కట్టమంటారు’ అని మహిళలు అడుగుతుంటే.. ’ఆ మాటలేం చెల్లవ్‌. రుణమాఫీ గురించి మాట్లాడొద్దు’ అంటూ అధికారులు హుకం జారీ చేస్తున్నారు.
 
 
కొవ్వూరు :
రుణాలు కట్టాలంటూ డ్వాక్రా మహిళలపై నిన్నటి వరకూ బ్యాంకులు విరుచుకుపడితే.. ఇప్పుడు ఆ బాధ్యతను అధికారులు తీసుకున్నారు. బకాయిలు చెల్లించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొవ్వూరులో సుమారు 400 మంది మహిళలకు బుధవారం ఇదే పరిస్థితి ఎదురైంది. మండలంలో 70 గ్రూపులకు చెందిన మహిళలకు ఇటీవల బ్యాంకుల నుంచి నోటీసులు అందాయి. తక్షణమే బకాయిలు చెల్లించకపోతే కోర్టుకెళ్లి ఆస్తులను జప్తు చేయిస్తామని అందులో పేర్కొన్నారు. గురువారంలోగా ఆర్డీవో ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో సుమారు 400 మంది మహిళలు బుధవారం ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యాలయ ఆవరణలోని నీట్లనీడన పడిగాపులు పడ్డారు. 
 
ఆస్తులు జప్తు చేయిస్తామని హెచ్చరిక
డ్వాక్రా మహిళలతో భేటీ అయిన ఆర్డీవో బి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ’బకాయిలు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగిస్తాం. గ్రామాల్లో టాం టాం వేయిస్తాం.అప్పుడు మీ గౌరవం పోతుంది. బ్యాంకులు నడవాలంటే సకాలంలో రుణాలు కట్టాలి. బకాయిలు చెల్లించకపోతే మీకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులే కాదు వడ్డీ వ్యాపారులు కూడా ముందుకు రారు. మీకు ఎక్కడా అప్పులు పుట్టవు’ అంటూ హెచ్చరించారు. ’అదేంటి సార్‌. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు కదా. ఆయన మాటనమ్మి బాకీలు కట్టలేదు. ఇప్పుడేమో అసలు కంటే వడ్డీలు పెరిగిపోయాయ్‌. ఎలా కట్టగలం’ అని మహిళలు నిలదీశారు. ఆర్డీవో స్పందిస్తూ.. ’ఎవరు హామీ ఇచ్చారో వాళ్లను అడగండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మి.. ఎవరికోసమో ఎదురుచూస్తూ రుణాలు చెల్లించడం మానేయవద్దు’ అన్నారు. ’బకాయిలు చెల్లించకపోతే ఆస్తులన్నీ వేలం వేస్తారు. మీకు ఇష్టమేనా’ అని ప్రశ్నించారు. బడికెళ్లే మీ పిల్లల్ని డ్వాక్రా బకాయిలు ఎగ్గొట్టారంటగా అని తోటి విద్యార్థులు అడిగితే వాళ్లు తలదించుకోవాల్సి వస్తుందని హితోపదేశం చేశారు. బ్యాంకు రుణాలను వాయిదాలు లేదా వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ ద్వారా చెల్లించాలని సూపించారు. నెల రోజుల తరువాత ఇలా మాట్లాడే అవకాశం తమకు ఉండదన్నారు. ’కాగితాలొస్తాయి. మా తహసీల్దార్లు వస్తారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం బకాయిలన్నీ ముక్కుపిండి వసూలు చేస్తారు’ అని హెచ్చరించారు. దీంతో అవాక్కవడం మహిళల వంతైంది. 
 
అధికారులకు లక్ష్యాలు
డ్వాక్రా బకాయిలను రాబట్టుకునేందుకు మండల శాఖ అధికారులకు ప్రభుత్వం టార్గెట్లు ఇచ్చింది. మార్చినెలాఖరు నాటికి నూరు శాతం బకాయిలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. డ్వాక్రా మహిళలపై ఒత్తిళ్లు పెరిగాయి. రంగంలోకి దిగిన అధికారులు సామదాన దండోపాయలను ప్రయోగిస్తున్నారు. బకాయిల వసూలు విషయంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపే ప్రయత్నంలో భాగంగా వేధింపులకు దిగుతున్నారు. జిల్లాలోని డ్వాక్రా మహిళలు తీసుకున్న మొత్తం రుణాల్లో 1.32 శాతం (సుమారు 20 కోట్లు) మాత్రమే బకాయిలు ఉన్నాయి. మార్చి నెలాఖరు నాటికి దీనిని సున్నాగా చూపించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒక్క జీలుగుమిల్లి మండలంలోనే అత్యధికంగా రూ.3.50 కోట్ల మేర బకాయిలున్నాయి. పాత రుణాలు చెల్లిస్తే కొత్త రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మహిళలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
 
 
హామీ ఇచ్చి నోటీసులు పంపుతారా
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. నాలుగేళ్ల కిత్రం బ్యాంకు నుంచి మా గ్రూపు సభ్యులు రూ.2 లక్షల రుణం తీసుకున్నాం. రుణాలు కట్టవద్దని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానన్నారు. ఇప్పుడు రుణాలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయిస్తామని నోటీసులు పంపారు. ఇది ఎంతవరకు సమజసం.
 చదలవాడ రూత్‌కుమారి, డ్వాక్రా మహిళ, తోగుమ్మి
 
హామీలు నమ్మి వీధిన పడ్డాం
డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి నమ్మించారు. ఎన్నికల సమయంలో ఎంపీ మురళీమోహన్‌ ఇంటింటికీ మరీ ఈ విషయం చెప్పారు. ఇప్పుడు బకాయిలు మాఫీ చేయకపోవడంతో వీధిన పడ్డాం. నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. ఆర్డీవో వద్ద వివరణ ఇవ్వాలంటే కూలీ పనులు మానుకుని వచ్చాం.
ముప్పిడి కుమారి, డ్వాక్రా మహిళ, తోగుమ్మి
 
మోసం చేశారు
డ్వాక్రా రుణాలు కట్టొద్దన్నారు. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు .రుణం తీసుకుని మూడేళ్లయ్యింది. ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే వాయిదాలు కట్టేసేవాళ్లం. ఇప్పుడు రుణాలపై వడ్డీలు పెరిగి తడిసిమోపెడయ్యాయి. ఇచ్చిన మాట నిలుపుకోలేనప్పుడు హామీ ఇవ్వడం ఎందుకు. పేదలను మురిపించి ముంచేశారు. రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా. ఇప్పుడు కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు.
కాకులపాటి మల్లేశ్వరి, డ్వాక్రా మహిళ
 
బకాయిలు చెల్లించాల్సిందే
బకాయిల చెల్లింపుల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో ఉంది. ఇంకా సుమారు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటి వసూలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. వడ్డీ లేని రుణాలు పొందాలంటే సకాలంలో రుణాలు చెల్లించాలి. జీలుగుమిల్లి మండలంలో అత్యధికంగా రూ.3.50 కోట్లు బకాయిలు ఉన్నాయి. మార్చి నెలాఖరు నాటికి బకాయిలన్నీ వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నాం.
కె.శ్రీనివాసులు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్‌డీఏ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement