అంపిలి గ్రామ రైతులకు బుధవారం ఆంధ్రాబ్యాంకు షాకిచ్చింది. ఈ గ్రామంలోని 30 రైతులకు బ్యాంకు నుంచి నోటీసులందాయి. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించకపోతే వాటిని వేలం వేస్తామన్న హెచ్చరిక ఆ నోటీసుల సారాంశం. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రుణమాఫీ ఉచ్చులో పడి పీకల మీదకు తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు.
పాలకొండ : రైతు రుణమాఫీ హామీతో ఆధికారం చేపట్టిన ప్రభుత్వం.. ఆనక సవాలక్ష నిబంధనలతో తమను మోసగించిందని రైతులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో రుణమాఫీ అర్హుల జాబితాను, మొత్తాలను సగానికి సగం కోత వేసినా..మిగిలిన వాటికైనా ఇప్పటికీ చెల్లింపులు జరపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది వడ్డీతో సహా రుణాలు చెల్లించాలని బ్యాంకులు పీక మీద కత్తి పెడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తాజాగా బ్యాంకులు బంగారం తాకట్టు రుణాలకు సంబంధించి జారీ చేస్తున్న వేలం నోటీసులు రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
పంట రుణాలతోపాటు బంగారం రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణంలో నాలుగోవంతు బ్యాంకులకు జమ చేస్తామని, మిగతా మొత్తానికి బ్యాంకులకు ఒప్పంద పత్రాలు అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో బ్యాంకు అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. బకాయి పడిన రైతులకు వేలం నోటీసులు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన 30 మంది రైతులకు బుధవారం ఆంధ్రాబ్యాంకు నుంచి నోటీసులు అందాయి.
వీరంతా బంగారు అభరణాలను తాకట్టుపెట్టి రుణాలు పొందినవారే. మాఫీ జాబితాలో పేర్లు ఉండడంతో రుణాలు చెల్లించకుండా ఉన్నారు. అయితే రుణమాఫీ నిధులు బ్యాంకులకు జమ కాకపోవడంతో బ్యాంకర్లు బంగారు అభరణాలను వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. వడ్డీతో సహా రుణ మొత్తాలు భారీగా పెరిగిపోవడం.. ఒకేసారి ఆ మొత్తం చెల్లించాల్సి రావడం రైతులను కలవరపరుస్తోంది. బ్యాంకులు
మాత్రం తమకేమీ సంబంధం లేదని రైతులపైనే భారం వేస్తున్నాయి.
మాఫీ జాబితాలో పేరు ఉన్నా...
ఆంధ్రా బ్యాంకులో బంగారు అభరణాలు తాకట్టుపెట్టి రూ. 30 వేల రుణం తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీతో కలిపి రూ. 42 వేలు చెలించాల్సి ఉంది. రుణమాఫీ జాబితాలో నా పేరు ఉండడంతో అప్పు చెల్లించలేదు. రుణమాఫీ పత్రాలు అందజేశారు. కానీ నిధులు జమ కాలేదంటూ వస్తువులను వేలం వేస్తామని నోటీసులు అందజేశారు.
-లంక సూర్యనారాయణ, రైతు, అంపిలి
మాఫీకి రుణాలకు సంబంధం లేదు
రుణమాఫీకి రుణాలు చెల్లించడానికి సంబంధంలేదు. ప్రభుత్వం మాఫీ ప్రకటిస్తే నిధులు బ్యాంకులకు జమ కావాలి. ఎడాదిన్నర దాటిన రుణాలకు నోటీసులు ఇస్తున్నాం. ఒకవేళ మాఫీ వస్తే రుణాలు కట్టిన వారికీ వర్తిస్తుంది. ప్రభుత్వం నిధులు చెల్లించే వరకూ రుణాలు చెల్లించకుండా ఉంటే ఎలా? ప్రభుత్వం నిధులు జమ చేస్తే నోటీసులు వెనుక్కి తీసుకుంటాం.
-జె.షన్ముఖరావు, ఆంధ్రా బ్యాంకు మేనేజర్
వేలం వర్రీ!
Published Thu, Mar 5 2015 1:03 AM | Last Updated on Fri, Aug 17 2018 7:54 PM
Advertisement
Advertisement