రూ ఆరు వేల కోట్లకు ఎసరు ! | Esaru Rs six crore! | Sakshi
Sakshi News home page

రూ ఆరు వేల కోట్లకు ఎసరు !

Published Sat, Nov 22 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

రూ ఆరు వేల కోట్లకు ఎసరు !

రూ ఆరు వేల కోట్లకు ఎసరు !

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట మార్చడం వల్ల జిల్లాలో సుమారు ఆరు వేల కోట్ల రూపాయల రుణాలు రద్దయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు భిన్నంగా గురువారం విజయవాడలో జరిగిన టీడీపీ విసృ్తత స్థాయి సమావేశంలో పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని చెప్పడం పట్ల ఆ పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి.

మార్చి 31న తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లకు విడివిడిగా విడుదల చేసిన మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

 విజయవాడ సమావేశంలో పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని ప్రకటించడంతో ‘బాబు’నైజంపై అన్ని వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఈ నిర్ణయం వల్ల బంగారు ఆభరణాలు తనఖా పెట్టి తీసుకున్న రుణాలు రద్దు కావని, రుణం తీసుకున్నప్పుడు రైతు బ్యాంకులో బంగారు ఆభరణాలతోపాటు భూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకాల ఫొటోస్టాట్ కాపీలను ఇచ్చి ఉంటేనే ఆ రుణాలు మాత్రమే రద్దవుతాయని బ్యాంకర్లు చెబుతున్నారు.

కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి తీసుకున్న రుణాలు రద్దయ్యే అవకాశాలు లేదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. దీనికితోడు వ్యవసాయ రుణాల రద్దు ప్రక్రియకు సంబంధించిన వెబ్‌సైట్‌కు గురువారం నుంచి బ్యాంకర్లు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీంతో రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 జిల్లా వ్యాప్తంగా రూ.5995 కోట్లకు ఎగనామం?
జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు రైతులు, స్వయం సహాయక సంఘాలకు కలిపి పదివేల కోట్ల రూపాయలను పంట రుణాలుగా ఇచ్చినట్లు లీడ్‌బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 5,29,358 మంది రైతులు రూ.4005 కోట్లు పంట రుణాలు పొందారు. 6,49,025 మంది బ్యాంకుల్లో తమ బంగారాన్ని పెట్టి రూ. 4,593 కోట్లు రుణాలు తీసుకున్నారు.

గుంటూరు రూరల్ పరిధిలో 58, 624 స్వయం సహాయక సంఘాలు రూ. 1145 కోట్లు, మెప్మా ద్వారా అర్బన్‌లో 12,794 గ్రూపులు రూ. 257 కోట్ల రుణాలను పొందాయి.

ఎలాంటి నిబంధనలు పెట్టకుండా రుణమాఫీ జరిగితే ఇవన్నీ కలిపి జిల్లా వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల రుణాలు రద్దు కావాల్సి ఉంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు స్వయం సహాయక సంఘాలు తీసుకున్న మొత్తం రుణాలను రద్దు చేయకుండా వాటికి మూల నిధిని ఏర్పాటు చేస్తామని మాట మార్చారు. దీంతో డ్వాక్రా గ్రూపులు వడ్డీతో కలిపి రూ.1402 కోట్లను చెల్లించాల్సి వచ్చింది.

బంగారం తనఖా పెట్టి రూ.4,593 కోట్ల రుణాలను తీసుకున్న 6.50 లక్షల మంది రైతులకు బాబు పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ రెండు వర్గాలకు మొత్తం రూ.5 995 కోట్లను మాఫీ చేయకుండా బాబు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకర్లు చెబుతున్నా, పంట రుణాలకు, వ్యవసాయ రుణాలకు వ్యత్యాసం ఉందంటున్నారు.
 
ఆది నుంచి ఆయన నైజం అంతే ..
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చితే ఆశ్చర్య పడాల్సిందేకాని, మాట మార్చితే ఆశ్చర్యపోనవసరం లేదు. మొదటి నుంచి ఆయన నైజం ఇంతే. కిలో రూ. 2 బియ్యం పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత రూ.5.50కు పెంచారు. మొన్నటి ఎన్నికల్లో బెల్టుషాపులు రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలే వాటిని నడుపుతూ గతం కంటే ఎక్కువగా అమ్ముతున్నారు.

ఇసుక అమ్మకాల ద్వారా వచ్చిన మైనింగ్ సెస్‌ను జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు ఇస్తానన్నారు. ఇప్పుడు ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు కేటాయించి వచ్చిన ఆదాయంలో 25 శాతం వాటికి ఇస్తూ మిగిలిన ఆదాయాన్ని రైతు సాధికారిక సంస్థకు జమ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల గ్రామాలు, మండలాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత వెన్నాడుతోంది.

వ్యవసాయ రుణాలన్నింటినీ రద్దు చేస్తామని ప్రకటన ఇచ్చిన బాబు ఇప్పుడు పంట రుణాలనే రద్దు చేస్తామనడం దుర్మార్గం. ప్రజలంటే ఆయనకు చులకన భావం. ఏ అబద్ధం అడినా కొంతకాలానికి మర్చిపోతారనే అభిప్రాయం ఆయనకు ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇస్తూ పబ్బం గడుపుతున్నారు.                           
- మర్రి రాజశేఖర్,  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement