ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణం మొత్తం రూ.13,500 కోట్లు
ఇందులో ఏడీబీ వాటా సుమారు రూ.6,694.36 కోట్లు
గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందంటూ కూటమి విస్తృత ప్రచారం
అప్పుడు కాదన్నారు.. ఇప్పుడేమంటారు?
సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన రూ.15 వేల కోట్లు రుణమని తేలిపోయింది. ఈ మొత్తం కేంద్రం నుంచి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు ఇప్పటికే శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు.. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సభలో ధన్యవాదాలు సైతం తెలిపారు. ఇక ప్రకటించిన మొత్తంలో రూ.13,500 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి కేంద్రం రుణం తీసుకుని ఏపీ రాజధాని నిర్మాణానికి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు కూటమి నేతలు ప్రచారం చేశారు.
కానీ, ఇవన్నీ అబద్ధమని.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇచ్చేది పూర్తిగా షరతులతో కూడిన రుణమని తాజాగా బహిర్గతమైంది. ఈ మేరకు గురువారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సమావేశమైన ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు అధికారులు ‘అమరావతి ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’కి 788.8 మిలియన్ డాలర్ల రుణాన్ని (సుమారు రూ.6,694.36 కోట్లు) ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ రుణం మొత్తం థీ121.97 బిలియన్ల జపనీస్ యెన్‌లో అందించనున్నట్లు ప్రకటించారు.
ఈ మొత్తంతో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద వాటాదారులుగా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చుచేయాలని సూచించారు. ఈ మొత్తాన్ని ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (మల్టీలేటరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్) సహకారంతో ప్రోగ్రామ్‌కు మద్దతు ఉంటుందని ఏడీబీ భారతదేశ కంట్రీ డైరెక్టర్ మియో ఓకా తెలిపారు.
ఇక రుణంగా ఇచ్చే మొత్తానికి వడ్డీ ఉండదని, కానీ 20 ఏళ్ల తర్వాత వాయిదాలుగా ఆనాటికి ఉన్న డాలర్ల విలువకు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, అప్పటికి డాలర్ విలువ 20 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతికి వచ్చే రూ.15,000 కోట్లలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులు ఇచ్చే రూ.13,500 కోట్ల రుణం కాగా, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment