రైతన్న హైరానా
పెదకూరపాడు: రుణమాఫీ వ్యవహారం రైతులకు తలనొప్పిగా పరిణమించింది. నింబధనల పేరిట ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోంది. మాఫీ వర్తించిన వారికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఖాతాలకు నగదు జమచేసే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. లేని అప్పులు చూపిండటం.. ఉన్న లోను మాఫీ కాకపోవడం.. ఇలా వ్యవసాయ రుణాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. భారం తగ్గించుకునేందుకు చంద్రబాబు సర్కారు లేని పోని సాకులు చూపుతూ అన్నదాత సహనాన్ని పరీక్షిస్తోంది.
మాఫీ మాట దేవుడెరుగు వెన్యూ అధికారులు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక రైతుల హైరానా పడిపోతున్నారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల రుణాలన్నీ వడ్డీతో సహా మాఫీ చేసేస్తాం అంటూ బీరాలు పలికారు. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా షరతులు విధిస్తూ రైతు ఖాతాల్లో కోత విధించింది.
వడ్డీ చెల్లించాలని బ్యాంకర్ల వత్తిడి..
2013 డిసెంబరు 31 లోగా తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ కావాల్సి ఉండగా ఈ ఏడాది మార్చి 31 లోపు ఉన్న రుణాలే మాఫీకి కిందకి వచ్చాయి. ఆ తర్వాత రూ.50వేల లోపు రుణ బకాయి ఉన్న వారికి రూ.1400 నుంచి రూ.1500 వరకు వడ్డీ భారపడుతోంది. దీనిపై రైతులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నిస్తే మార్చి 2013 తర్వాత తీసుకున్న వారు వడ్డీ చెల్లించాల్సిందేనని చెబుతున్నారు.
పెదకూరపాడు మండలంలో 7350 మంది రుణమాఫీకి అర్హత సాధించారు. వారిలో తక్కువ మందికి రూ. 50వేలు లోపు మాఫీ వర్తించింది. మాఫీ వర్తించిన కాలం నుంచి నేటి వరకు వడ్డీతో పాటు మళ్లీ ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, భూముల వివరాములు, ఆఫిడవిట్ పేర్లుతో నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కొందరి రైతులు పేర్లు నేటికి ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. పదిరోజుల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు ప్రసుత్తం సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడులు లేక అవస్థలు పడుతున్నారు.
వడ్డీ చెల్లించమంటున్నారు..
నేను 25వేలు అప్పు తీసుకున్నాను. వడ్డీతో సహా రూ.33769 అయింది. ఈ మొత్తానికి 2013 నుంచి ఇప్పటి వరకు వచ్చిన వడ్డీ రూ.1,400 చెల్లించమంటున్నారు. లేదంటే రుణం మాఫీ కాదని బ్యాంకుల వారు చెప్తున్నారు. వడ్డీతో సహా మాఫీ అవుతుందనుకుని మోసపోయా. ఇప్పుడు చెల్లించకపోతే అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నారు.
- నరిశెట్టి శేషగిరిరావు, రైతు, పెదకూరపాడు