రైతుల ఖాతాలకే ఎసరు..!
- రుణాల మాఫీలో సర్కారు కొత్త కిరికిరి - 49 లక్షల ఖాతాలే అర్హతగా తేల్చిన వైనం
సాక్షి, హైదరాబాద్ : రైతుల రుణాల మాఫీలో రకరకాల ఆంక్షలు, పరిమితులు విధిస్తూ అన్నదాతను ముప్పుతిప్పలు పెడుతున్న సర్కారు.. ఇప్పుడు ఏకంగా వారి ఖాతాలకే ఎసరు పెడుతోంది. వ్యవసాయ రుణాలు తీసుకున్న ఖాతాల సంఖ్యను దాదాపు 50 లక్షలకు కుదించింది. ఈ సంఖ్యను మరింత తగ్గించే ప్రయత్నాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కోటీ ఐదు లక్షల రైతుల ఖాతాలకు గాను కేవలం 80 లక్షల ఖాతాల రుణాలనే ప్రభుత్వం తొలుత పరిగణనలోకి తీసుకుంది.
ఈ ఖాతాల వివరాలను బ్యాంకులు ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్‌లో పంపాయి. వీటిని ఆధార్, రేషన్ కార్డు, సర్వే నంబర్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి రకరకాల నిబంధనలతో వడపోశారు. ఇప్పుడు కేవలం 49 లక్షల ఖాతాలు మాత్రమే రుణ మాఫీకి అర్హమైనవని తేల్చింది. ఈ విషయాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు బుధవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ ఖాతాలనూ మరింతగా తగ్గించే ప్రయత్నాల్లో సర్కారు ఉంది. ఇప్పుడు అర్హత పొందిన ఖాతాలు ఎన్ని కుటుంబాలకు చెందినవో తేల్చాలని ప్రభుత్వం కొత్త కిరికిరి పెట్టింది. అధికారులు వాటిని తేల్చనున్నారు.
15లోగా తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశం
ఇప్పటివరకు రైతుల ఖాతాలు ఆధార్ నంబర్లతో సరిపోవడంలేదంటూ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ ద్వారా 5.58 లక్షల ఖాతాలను మాఫీ పరిధి నుంచి తప్పించారు. మరో 22.92 లక్షల ఖాతాలను జన్మభూమి కమిటీల ద్వారా మరోసారి వడబోయనున్నారు. వీటిలో ఆధార్ నంబర్, రేషన్ కార్డులు లేని ఖాతాలు 16.16 లక్షలు, ఆధార్ నంబర్ ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేని రైతుల ఖాతాలు 6.76 లక్షలు ఉన్నాయి. ఆధార్ నంబర్ లేని రైతుల ఖాతాలన్నీ బోగస్‌విగా తేల్చి, వారిని మాఫీకి అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయించారు. ఆధార్, రేషన్ కార్డులు లేని రైతుల జాబితాలను జిల్లా కలెక్టర్ల ద్వారా గ్రామాల్లోని జన్మభూమి కమిటీలకు పంపిస్తారు.
ఈ కమిటీలు ఆయా రైతులకు ఆధార్ నంబర్ ఉందా లేదా అనే విషయాన్ని తనిఖీల ద్వారా తెలుసుకుంటాయి. ఆధార్ నంబర్ లేకపోయినా, ఆ రైతులు గ్రామాల్లో లేకపోయినా ఆ ఖాతాల రుణాలు మాఫీకి అర్హత లేనివని తేలుస్తారు. ఆధార్ ఉండి రేషన్ కార్డు లేని వారు ఓటర్ కార్డు చూపిస్తే ఇంటి పేరు, ఇంటి నంబర్ ఆధారంగా ఏ కుటుంబానికి చెందిన వారో జన్మభూమి కమిటీలు తేలుస్తాయి. ఇందుకు ఈ నెల 15వ తేదీ వరకు సమయం ఇస్తూ జిల్లా కలెక్టర్లకు ఆర్థిక శాఖ బుధవారం సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఖాతాలు తగ్గనున్నాయి.