- రుణ విముక్తి పత్రాలతో తేలిన లెక్కలు
- నిరుడు దాదాపు రూ.300 కోట్ల మిగులు
- మొత్తంగా రుణమాఫీ రూ.16 వేల కోట్ల లోపే
సాక్షి, హైదరాబాద్: రైతు రుణ మాఫీపై సర్కారు లెక్క తప్పింది. గత ఏడాది అంచనా ప్రకారం వేసుకున్న లెక్కలకు... రుణాల మాఫీకి సంబంధించి క్షేత్రస్థాయి గణాంకాలకు దాదాపు రూ.1,200 కోట్ల తేడా ఉండే అవకాశముంది. కానీ ఈసారి బడ్జెట్‌లోనూ రూ. 4,250 కోట్లను ప్రభుత్వం రుణ మాఫీకి కేటాయించింది. కానీ నిరుడు దాదాపు రూ. 300 కోట్ల మాఫీ సొమ్ము బ్యాంకుల్లో మిగిలిపోయింది. రైతులను ఆదుకునేందుకు రూ.లక్ష వరకు పంట రుణం మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ సర్కారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి రాగానే హామీని నిలబెట్టుకుంది. రూ. లక్ష పరిమితి మేరకు పంట రుణంతోపాటు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకూ పథకాన్ని అమలు చేసింది.
తొలి బడ్జెట్‌లోనే 35,56,678 మంది రైతులకు సంబంధించిన రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. నాలుగేళ్లలో వాయిదాల పద్ధతిన ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించనుంది. అందులో మొదటి విడతగా 2014-15 సంవత్సరంలో రూ. 4,250 కోట్లు మంజూరు చేసింది. బ్యాంకుల నివేదిక ఆధారంగా రుణాల మాఫీకి ఎన్ని నిధులు కావాలో లెక్కలేసుకున్న సర్కారు.. అమలు చేసేటప్పుడు వాస్తవ గణాంకాలను మదించుకుంది. దీంతో రుణమాఫీ మొత్తం రూ.16 వేల కోట్లకు మించే పరిస్థితి కనిపించటం లేదు.
గత నెల 16 నుంచి 23 వరకు వ్యవసాయశాఖ రుణమాఫీ వారోత్సవాలు నిర్వహించింది. రైతులకు రుణ విముక్తి పత్రాలను జారీ చేసింది. రైతులకు ఇచ్చే రుణమాఫీ పత్రంలో మొత్తం రుణం, ఇప్పటికే మాఫీ అయిన రుణం.. మిగిలిన రుణానికి సంబంధించిన మొత్తంలో ప్రభుత్వ బాధ్యత ఎంతమేరకనే వివరాలున్నాయి. దీంతో రైతులకు తమ రుణమెంత మాఫీ అయిందనే స్పష్టత వస్తుందని.. మిగిలిన రుణాన్ని భవిష్యత్తులో ప్రభుత్వమే చెల్లిస్తుందన్న భరోసా కల్పించేందుకు సర్కారు ఈ ప్రయత్నం చేసింది. మొదటి విడతలో రుణమాఫీ కింద విడుదల చేసిన రూ.4,250 కోట్లు రైతుల ఖాతాల్లో సర్దుబాటు చేసింది.
కొత్తగా రుణాలు అవసరమయ్యే వారు బ్యాంకులను ఆశ్రయించాలని.. ఇంకా బకాయిలున్న వారు రెన్యువల్ చేసుకోవాలని కోరింది. ఈ వారోత్సవాలు ముగిసేసరికి.. 27.50 లక్షల మంది రుణాలు రెన్యువల్ చేసుకున్నారు. 8.50 లక్షల మంది ఇంకా చేసుకోవాల్సి ఉంది. కొందరు రైతులు మృతిచెందటంతో వారి వారసులు ఖాతాల మార్పిడి, రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. మొత్తంగా రుణ విముక్తి పత్రాల జారీతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన స్పష్టత వచ్చింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో రైతుల ఖాతాలకు సంబంధించి రూ. 3,950 కోట్లు సర్దుబాటుకాగా మిగిలిన రూ. 300 కోట్లు మిగులు ఖాతాలోనే ఉండిపోయాయి.
విముక్తి పత్రాలు తీసుకునేందుకు రైతులు రాకపోతే అంతమేరకు మిగులు సొమ్మును ప్రభుత్వానికి బ్యాంకర్లు తిరిగి పంపించాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వాయిదాకు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన రుణ మాఫీ రూ.17 వేల కోట్లకు బదులు రూ.16 వేల కోట్లకు తగ్గిపోనుంది.