ఈసారి తాత్కాలిక  బడ్జెట్‌..  | KCR To Launch A Temporary Budget | Sakshi
Sakshi News home page

ఈసారి తాత్కాలిక  బడ్జెట్‌.. 

Published Sat, Jan 12 2019 2:01 AM | Last Updated on Sat, Jan 12 2019 4:03 AM

KCR To Launch A Temporary Budget - Sakshi

తెలంగాణ సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ (ఓట్‌ ఆన్‌ అకౌంట్‌)ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని, ఆ బడ్జెట్‌ లోనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిం చడం సాధ్యమవుతుందన్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే అంశంపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కాలె యాదయ్య, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉపసర్పంచులకు శిక్షణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్తగా నియమితులయ్యే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలసికట్టుగా పనిచేయడానికి అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు మూస పద్ధతిలో కాకుండా గ్రామాల సమగ్ర వికాసం కోసం పాటుపాడే ఉద్యమకారులుగా మారాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ‘కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలి. గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే విషయంలో వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలి.

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభత్ర పెంచడం లక్ష్యంగా కొత్తగా రూపొందించిన చట్టంపై గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలి. ప్రతి గామ పంచాయతీకీ కొత్త చట్టం తెలుగు ప్రతులను పంపించాలి. గ్రామాభివద్ధిలో సర్పంచ్, గ్రామ కార్యదర్శుల పాత్ర చాలా కీలకం. గ్రామ పంచాయితీలకు విధులు, బాధ్యతలు అప్పగించే విషయంలో కొంత జాప్యం అనివార్యమవుతుంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్, మేలలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడతాం. ఆలోగా సర్పంచులు, కార్యదర్శులకు పూర్థిస్థాయిలో శిక్షణ ఇచ్చి గ్రామాభివద్ధి కోసం పాటుపడే కార్యకర్తలుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ గ్రామీణాభివద్ధి సంస్థ, మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ), అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (అస్కీ) తదితర సంస్థలతో శిక్షణ ఇప్పించాలి’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement