ఆశలు  ప్రతిబింబించేలా! | KCR Review Meeting State Budget Plan | Sakshi
Sakshi News home page

ఆశలు  ప్రతిబింబించేలా!

Published Sun, Jan 13 2019 1:08 AM | Last Updated on Sun, Jan 13 2019 1:28 AM

KCR Review Meeting State Budget Plan - Sakshi

తెలంగాణ సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ రూపకల్పన చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రజావస రాలను అన్నిరంగాల్లో పరిశీలించిన తర్వాతే తుది బడ్జెట్‌ రూపుదిద్దుకోవాలన్నారు. రూపొందించే బడ్జెట్‌ కేవలం ఒక్క ఏడాదికా? లేక ఐదేళ్ల పూర్తి కాలానికా? అన్న అవగాహనతో బడ్జెట్‌ విధి విధానాలు ఉండాలన్నారు. తెలంగాణ నేటి పరిస్థితేంటి? వచ్చే ఐదేళ్లలో ఎక్కడ ఉండబోతోందన్న అవగాహనతోనే బడ్జెట్‌ అంచనాలు రూపొందించాల న్నారు. ప్రభుత్వం కేవలం చట్టాలను అమలుపరచడమే కాకుండా రాష్ట్రాభి వృద్ధిని సులభతరం చేస్తూ ఒక ఉత్ప్రేర కంగా, ఉద్దీపనకారిగా తన పాత్రను నిర్వహిస్తుందన్నారు.

ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ ఫలించేలా, వారి అవసరాన్ని తీర్చుతూ, తెలంగాణ ఆర్థికాభివృద్ధిని మరింత బలోపేతం చేసే దిశగా బడ్జెట్‌ ఉండాలన్నారు. కొద్దిరోజుల్లో 15వ ఆర్థిక సంఘం బృందం రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ, ఇతర సీనియర్‌ అధికారులతో శనివారం సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ సలహాదారు జీఆర్‌ రెడ్డి, సీఎంవో అధికారులు నర్సింగ్‌ రావు, స్మితా సబర్వాల్, సందీప్‌ సుల్తానియా, మానిక్‌ రాజ్, స్పెషల్‌ సీఎస్‌ రాజేశ్వర్‌ తివారి, ఫైనాన్స్‌ సెక్రటరీ రామకృష్ణారావు, పంచాయతీ రాజ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్, ఐటీ సెక్రటరీ జీటీవీ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బడ్జెట్‌ రూపకల్పనపై కేసీఆర్‌ పలు కీలక సూచనలు చేశారు. బడ్జెట్‌ రూపకల్పనకు ముందు ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని, ఒక్కొక్క అంశాన్ని తీసుకుని, పనిని విభజించి సమస్యను ఛేదించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. ‘తెలంగాణ ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెందుతూ.. ప్రగతి మార్గంలో పయనించేందుకు అవలంబించాల్సిన మార్గదర్శకాలేంటి? మన ఆర్థిక ప్రగతికి దోహద పడుతున్న అశాలేంటి? అనే విషయాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్‌ రూపొందించాలి. సీఎంగా నన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు నేను వారికి ఎంత గొప్పగా సేవలందించగలననే ఆలోచన చేయాలి.

ఆదరాబాదరాగా కాకుండా ముందుగా ఒక సమగ్ర అవగాహనకు వచ్చిన తర్వాతే బడ్జెట్‌ రూపకల్పనకు సిద్ధమవ్వాలి. అటువంటి కీలక బడ్జెట్‌ను రూపొందించేందుకు పూనుకున్న వ్యక్తులు, అధికారులు ఆ దిశగా తమ ధృక్పథాన్ని ఏర్పరుచుకోవాలి. మనకున్న బలాలు–బలహీనతలు, మంచి–చెడులను బేరీజు వేసుకున్న తర్వాతే పని ప్రారంభించాలి. రాబోయే ఐదేండ్ల కాలంలో రాష్ట్రానికి ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు ఖర్చు కాబోతుందనే దానిపై సమగ్ర అంచనా ఉండాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

ఆశలు తీరేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు
రాష్ట్రంలో కొనసాగుతన్న సాగు నీటి వనరులతో సహా ఇతర శాఖలను ఉదాహరిస్తూ.. ఆయా శాఖల పరిధిలో ప్రజలు పెట్టుకున్న ఆశలు ప్రతిఫలించేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌ను రూపొందించే క్రమంలో ముందుగా గత నాలుగేళ్లలో చేసిన ఖర్చు, రాబోయే ఐదేళ్లలో ఎంత ఖర్చు చేయాలనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా ఐదేళ్ల కాలానికి మొత్తం కలిపి ఇరిగేషన్‌ శాఖ కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతాయన్నారు.

కేంద్రం నుంచి అన్ని సాగునీటి ప్రాజెక్టులకు అన్నిరకాల అనుమతులను సాధించడం గొప్పకార్యమని, అది బడ్జెట్‌లో ప్రతిఫలించాలన్నారు. ఇక గొర్రెల పంపిణీకి సంబంధించిన ఉదాహరణను ప్రస్తావిస్తూ.. అది ఎంతగొప్పగా ప్రజాదరణ పొందిందో తెలిపారు. దాంతో పాటు చేపల పెంపకం, చేనేత రంగం.. రాష్ట్రంలో పురోగతి సాధిస్తుందన్నారు. విద్యుత్‌ సగటు వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనల రూపకల్పనకు ముందు ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఆకర్షణీయ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి విధానాలను అనుసరించాలో సూచించాలన్నారు. యూనివర్సీటీ పరిశోధనలతో పాటుగా వ్యవసాయాన్ని అధునీకరించే అంశాలపై అధికారులు విధివిధానాలను రూపొందించాలన్నారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలసపోకుండా రాష్ట్రంలో విద్యావ్యవస్థను ఆకర్షణీయంగా రూపొందించాలన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా మానవీయ కోణంలో బడ్జెట్‌ విధానాలను రూపొందించాలని సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుద్ధిచేసిన పరిశుభ్రమైన తాగునీరు లభిస్తున్నదని, అది రాష్ట్రాభివృద్ధికి సూచికని సీఎం పేర్కొన్నారు.

దేశ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి
భారత ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్థిక సంఘం నడుం బిగించాల్సి వుందని, మూస పద్దతిలో కాకుండా తన పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయ పడ్డారు. ‘స్వాతంత్య్రానంతరం.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో చాల పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఎటువంటి గుణాత్మక మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో తిరిగి లోతైన విశ్లేషణ, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో నిరసన వ్యక్తం చేస్తుండడం విచారకరం. దీనికి కాంగ్రెస్, బీజేపీ అనే రెండు రాజకీయ వ్యవస్థలే మూలకారణం’ అని సీఎం పేర్కొన్నారు. ‘దేశానికి విశాలమైన విత్త విధానం వున్నది.

వికేంద్రీకరణ చేయాల్సిన అధికారాలను అందుకు విరుద్ధంగా కేంద్రీకరించారు. పురోగతి సాధిస్తున్న రాష్ట్రాల విధానాల్లో జోక్యం చేసుకోవద్దని నేను నీతి ఆయోగ్‌ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు స్పష్టం చేశాను. రాష్ట్ర ప్రగతిని దేశ ప్రగతిగా పరిగణించాలి. పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచొద్దు. స్వల్ప నిధుల విడుదలకు ఎన్నో నిబంధనలను విధిస్తున్నారు. రాష్ట్రానికి, కేంద్రానికి నడుమ ఉండాల్సిన రాజ్యాంగ సంబంధం రోజురోజుకూ కనుమరుగవుతోంది. రాష్ట్రాల అధికారాలు, హక్కుల పంపిణీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రాలను కించపరిచే విధంగా వుండడం అత్యంత విచారకరం’ అని కేసీఆర్‌ అన్నారు.

ఫైనాన్స్‌ కమీషన్‌ పాత్రపై సీఎం మాట్లాడుతూ.. ‘రాష్ట్రాలలో పర్యటించే క్రమంలో ఫెనాన్స్‌ కమీషన్‌ సభ్యులు ముందే ఒక అభిప్రాయాన్ని కలిగి వుండడం సరికాదు. రాష్ట్రాన్ని పర్యటించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా క్షేత్ర స్థాయి పర్యటనకు ముందే ఒక అవగాహనతో ‘టరŠమ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌’ చేయడం సరికాదు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సాంస్కృతిక, ఆర్థిక జీవన విధానం వుంటుంది. ఆయా రాష్ట్రాల అవసరాల రీత్యా డివల్యూషన్‌ అంశం రాష్ట్రాల హక్కుగా పరిగణించి.. కేవలం విధానాల రూపకల్పనకు మాత్రమే ఫైనాన్స్‌ కమిషన్‌ పరిమితమైతే మంచిది. ఈ అంశాలన్నీ పరిశీలించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను రూపొందించాలి’ అని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం సూచించారు.

100 పార్కులకు మాస్టర్‌ ప్లాన్‌.
హైదరాబాద్‌ నగరం గురించి సీఎం మట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీ. దేశంలోని ఏడు పెద్ద నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. ఇక్కడ కనీసం 100 పార్కుల అవసరముంది. హైద్రాబాద్‌ను రక్షించడానికి రేపటి భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలి. అందులో ఒక్క పేరాను మార్చాలంటే కేబినెట్‌ నిర్ణయం తీసుకునేంత స్థిరంగా నియమావళి రూపొందించాలి. రాబోయే ఐదేళ్ల కాలంలో హైదరాబాద్‌ను అద్భుతమైన గ్లోబల్‌ సిటీగా రూపొందించే దిశగా, ఎంతఖర్చు చేయాలో.. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ప్రతిఫలించాలి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్‌ వెన్నముక వంటిది’ అని పేర్కొన్నారు.

మంత్రులకు, సెక్రెటరీలకు శిక్షణ
కేబినెట్‌ రూపొందిన వెంటనే మొత్తం మంత్రులకు, ఆయా శాఖల కార్యదర్శులకు వారి విధులు, బాధ్యతల మీద అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆధ్వర్యంలో సునిశిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంతో సహా దేశ ఆర్థిక వ్యవహారాలను, సచివాలయ విధివిధానాలు, బడ్జెట్‌ రూపకల్పన నిబంధనలు, వాటి పరిమితులు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆయా మంత్రిత్వ శాఖల్లో చేపట్టే కార్యక్రమాలన్నీ సంబంధిత మంత్రులకు తెలిసేలా శిక్షణ ఉండాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement