ఉచిత విద్యుత్తు బకాయిలు కట్టాల్సిందే! | 8-year-old free electricity arrears | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్తు బకాయిలు కట్టాల్సిందే!

Published Tue, Dec 16 2014 5:02 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన రైతుకు పంపిన కరెంట్ బిల్లు

తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన రైతుకు పంపిన కరెంట్ బిల్లు

  •  8 ఏళ్ల ఉచిత విద్యుత్ బకాయిలు కట్టాల్సిందే
  •  8 లక్షల మంది రైతులకు సర్కారు నోటీసులు
  •  2004 నుంచీ కట్టాలని ఒత్తిడి.. గ్రామాల్లో చాటింపుతో హెచ్చరికలు
  •  రెవెన్యూ చట్టాల ప్రయోగానికి, కేసుల నమోదుకూ సిద్ధం
  •  ఆధార్ ఆధారంగా ఇళ్ల సర్వీస్ నంబర్ల గుర్తింపు.. ఇంటి కనెక్షన్లకూ విద్యుత్ బంద్?
  •  రబీ దృష్ట్యా అన్నదాతల్లో ఆందోళన
  • సాక్షి, హైదరాబాద్: రుణమాఫీలో మోసపోయిన రైతన్నకు చంద్రబాబు సర్కారు మరో షాకిచ్చింది. ఉచిత విద్యుత్‌ను దొంగదెబ్బ తీసే క్రమంలో మరో అడుగు ముందుకేసింది. ఉన్నపళంగా ఎనిమిదేళ్ల విద్యుత్ బకాయిలూ కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2004 నాటి ఉచిత విద్యుత్ కనె క్షన్ జాబితాలో ఉంటే చాలు ఎనిమిదేళ్లుగా బకాయిలు ఉన్నట్టేనంటూ కొత్త లెక్కలు తెరమీదకు తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8 లక్షల మంది రైతులకు డిమాండ్ నోటీసులు పంపింది.

    ‘బిల్లులు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తాం...’ అంటూ హెచ్చరిస్తోంది. విద్యుత్ వాడినా, వాడకున్నా ఈ బిల్లులు చెల్లించాల్సిందేనంటూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. అవసరమైతే ఇళ్లకూ విద్యుత్ సరఫరా నిలిపివేయాలనే యోచనలో ఉంది. బకాయిలు కట్టనివారిపై రెవెన్యూ చట్టాలను ప్రయోగించాలని నిర్ణయించింది. కేసులు పెట్టాలని ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగాలకు అంతర్గత ఆదేశాలు జారీ చేసింది.  ఇటీవలి కాలంలో విద్యుత్ వినియోగదారుల ఆధార్ నంబర్‌ను సేకరించిన పంపిణీ సంస్థలు, దీని ఆధారంగా రైతుల ఇళ్ళ సర్వీస్ నంబర్లు గుర్తించారు. వీటి ఆధారంగా  నోటీసులు జారీ చేస్తున్నారు.
     
    గత ఏడాది రూ.360కి పెరిగిన సాధారణ చార్జీలు

    గత ఏడాది ప్రభుత్వం ఈ సాధారణ చార్జీలను రూ.120 పెంచి, ఏడాదికి రూ.360 వసూలు చేయాలని ఆదేశించింది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మోయలేని భారమనీ చెప్పింది. ఎన్నికల సమయంలో కూడా ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి రావడంతోనే నష్టాల పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే వ్యూహాలకు శ్రీకారం చుట్టారు.

    తాజాగా 2004-2011 వరకు ఉన్న బకాయి పడిన బిల్లులు చెల్లించాల్సిందిగా విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.  గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో రైతులు ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. సర్కారు నోటీసులు అందిన రైతుల్లో ఉచిత విద్యుత్ వినియోగదారులు కాకుండా.. డీజిల్‌తో మోటార్లు నడిపించుకుంటున్న వాళ్ళూ ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 13.5 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటన్నిటికీ మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    ఈ క్రమంలోనే పాత బకాయిల పేరుతో రైతుల్ని వేధించే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీసిందని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. ఈ విషయమై ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్‌ను ‘సాక్షి’ వివరణ కోరింది. ఎస్పీడీసీఎల్ సీఎండీకి ఫోన్ చేసి విషయం తెలుసుకున్న ఆయన.. ఇప్పటికిప్పుడు విద్యుత్ కనెక్షన్లు తొలగించవద్దని ఆదేశించారు.
     
    చట్ట సమ్మతమేనా?

    విద్యుత్ చట్టాల ప్రకారం ఇన్నేళ్ళ బకాయిలు వసూలు చేయడం చట్ట విరుద్ధమని నిపుణులు అంటున్నారు. బకాయిలు ఉంటే, ప్రతి ఆరు నెలలకూ ఒకసారి నోటీసులు ఇవ్వాలని, అవి అందినా వినియోగదారులు కట్టకపోతే రెవెన్యూ చట్టాలను ఆశ్రయించవచ్చని చెబుతున్నారు. గతించిన బకాయిలకు ఇప్పుడే నోటీసులు ఇవ్వడం, ఇప్పటికిప్పుడే రెవెన్యూ, ఇతర చట్టాలను అమలు చేస్తామనడం న్యాయ సమ్మతం కాదని స్పష్టం చేస్తున్నారు.
     
    ఒక్క పైసా వసూలు చేయని వైఎస్

    2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో కోరిన ప్రతి రైతుకు కనెక్షన్ ఇచ్చారు. ప్రతి ఏటా భారీ సంఖ్యలో వ్యవసాయ కనెక్షన్లను పెంచుకుంటూ వచ్చారు. ఈ కనెక్షన్లపై సాధారణ చార్జీలు వసూలు చేయాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల సిఫారసులను అప్పటి సర్కారు పట్టించుకోలేదు. రైతుల కనెక్షన్లను అధికారికంగా గుర్తించడానికి నెలకు రూ.20 సర్వీసు చార్జీ విధించినా, ఆరేళ్ళూ ఒక్కపైసా వసూలు చేయలేదు. దీనికోసం రైతులపై ఎలాంటి ఒత్తిడి తేవద్దని వైఎస్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
     
    నోటీసులు నిజమే..

    డిమాండ్ నోటీసులు ఇచ్చిన మాట నిజమే. అయితే సాధారణ విద్యుత్ చార్జీలనే అడుగుతున్నాం. ప్రస్తుతం ప్రతి రైతు ఏటా రూ.360 చెల్లించాలి. ఇది కూడా ఆరు నెలలకోసారి రెండు విడతలుగా చెల్లించాలి. కానీ చెల్లించడం లేదు. అందుకే ఇప్పుడు కట్టాలని కోరుతున్నాం.
     - ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ .వై.దొర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement