సాక్షి, హైదరాబాద్: రైతాంగం కరువుకోరల్లో చిక్కుకుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కరువు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అప్పులపాలై 750 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. 9 తెలంగాణ జిల్లాల్లో 40 శాతం దాకా వర్షపాతం లోటుందన్నారు. దీనిపై నివేదికలు అందినా ప్రభుత్వం కరువుప్రాంతాల ప్రకటన చేయలేదన్నారు. రుణమాఫీ అమలుకాక, ఖరీఫ్ రుణాలు అందక, కరెంటు కోతలతో పంటలెండిపోయి, పండిన పంటలకు మద్దతు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.