ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి పొన్నాల, జాజుల
హైదరాబాద్: తెలంగాణలో బీసీల ఓట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 22%కు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరు తూ శనివారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ, అఖిలపక్ష నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 54% ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల రాజ్యం తీసుకురావడానికి రాత్రికి రాత్రే దొంగచాటుగా బీసీలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం అయింద న్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్‌లను కొనసాగించాలని ఎంబీసీ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన బీసీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు మల్లయ్య, జి.నరేశ్, కిల్లె గోపాల్, రాకేశ్ నాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment