
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నిరుద్యోగులను మోసం చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, ఇంటికో ఉద్యోగం ఏది కేసీఆర్.. ఉద్యోగం ఇస్తామంటే ప్రజలు వద్దంటారా అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వస్తే ఒక్క ఏడాదిలోనే 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాని మోదీ సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సారి బడ్జెట్‌లో డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.1,100 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో ఆ ఇళ్లు పూర్తి కావడానికి 120 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. మరోవైపు బడ్జెట్ ప్రకారం దళితులు, గిరిజనులకు మూడెకరాలు భూమి ఇవ్వడానికి 75 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరగకపోగా, నాలుగేళ్లలో దాదాపు ఏడు వేల చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment