
హైదరాబాద్: ఎంపీ టికెట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీసీలను మరోసారి మోసం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఉద్యమంలో ముందు నుంచి ఉన్న బీసీలకు మొండి చేయి చూపి అగ్రకులాల వారికే పెద్ద పీట వేశారన్నారు. చిక్కడపల్లిలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఐదు శాతం ఉన్న రెడ్లకు ఐదు టికెట్లు కేటాయించి 56% ఉన్న బీసీలకు మూడు టికెట్లే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ అధిపతులు, పారిశ్రామికవేత్తలు, విద్యను వ్యాపారం చేసే వారికి, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్లకు టికెట్లు కేటాయించి, సామాజికవేత్తలను విస్మరించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్‌ను తెలంగాణ రెడ్ల సమితిగా మార్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ మలిఉద్యమకారులను విస్మరించటం సరికాదన్నారు. కేసీఆర్ సైతం పోటీ చేస్తే ఓడిపోయే హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించి అవమానించారన్నారు. రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, దీనికి బీసీలంతా ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్.దుర్గయ్య, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment