మాట్లాడుతున్న జిల్లా నాయకులు
ఎదులాపురం(ఆదిలాబాద్): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) పోరాటాల్లో అన్ని సంఘాలు భాగస్వాములు కావాలని ఆ సంఘం జిల్లా నాయకులు వెంకట్, వృకోధర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్ సంఘ భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న కొన్ని సంఘాలు వారి ఇమేజ్‌ను చూపించుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సహాయ నిధికి ఉద్యోగుల ఒక రోజు వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని మినహాయిస్తున్నట్లు 127 జీవో విడుదల చేసిందన్నారు.
ఈ జీవోను యూఎస్‌పీసీలోని 10 విభాగాలు సమ్మితించడం లేదని స్పష్టం చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చట్టసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దపు ప్రకటన చేసి, ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూఎస్ పీసీ నాయకులు నాగేందర్, శ్రీనివాస్, లక్ష్మణ్‌రావు, దిలీప్, విఠల్‌గౌడ్, సేవాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment