కేసీఆర్ కిట్ అందిందా..?
కేసీఆర్ కిట్ అందిందా..?
Published Thu, Jun 29 2017 2:05 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM
- ఎవరైనా డబ్బులు అడిగారా?
- ఆరా తీస్తున్న పథకం ప్రత్యేక అధికారి
రోజులు 25
ఇచ్చిన కిట్లు 13,152
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేసీఆర్ కిట్ అందిందా.. ఎవరైనా డబ్బులు అడిగారా.. అంటూ లబ్ధిదారులకు అధికారులు ఫోన్లు చేసి మరీ తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపె ట్టిన కేసీఆర్ కిట్ పథకానికి స్పందన పెరుగుతోంది. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలు పెరుగుతున్నాయి. పేద కుటుంబాల్లోని మహిళలకు ప్రసవాలతో ఆర్థికంగా భారం పడకుండా ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించినవారికి రూ.12 వేలు, కాన్పులో ఆడపిల్ల పుడితే రూ.13 వేలు చెల్లిస్తోంది. 4 దశలుగా ఈ డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కాన్పు జరిగిన వెంటనే శిశువు సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్‌ను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది జూన్ 3న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి జూన్ 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా 13,152 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 2,092 కిట్లను, జనగామ జిల్లాలో తక్కువగా 164 కిట్లను పంపిణీ చేశారు.
మూడు లక్షలు సిద్ధం...
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే 3,51,541 మంది గర్భిణుల పేర్లను నమోదు చేశారు. వీరిలో 3,03,213 కాన్పు తేదీలను గుర్తించారు. కేసీఆర్ కిట్ పథకం అమలు కోసం ఇప్పటికే రూ.150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కేసీఆర్ కిట్‌లో ఇచ్చే వస్తువులను రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. దాదాపు మూడు లక్షల కేసీఆర్ కిట్లను సేకరించి పంపిణీకి సిద్ధంగా పెట్టింది. కేసీఆర్ కిట్ పథకం అమలు కోసం వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ కిట్ పథకం లబ్ధిదారులకు ఈ కార్యాలయం నుంచి నేరుగా ఫోన్లు చేసి కిట్లు అందాయో, లేదో అడిగి తెలుసుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్‌కు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు కేసీఆర్ కిట్ పథకం ప్రత్యేక అధికారి సత్యనారాయణ తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే విచారణ జరుపుతున్నట్లు వివరించారు.
Advertisement