Protest actions
-
కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టి బొమ్మల దహనం, రాస్తారోకోలు, ధర్నాలతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు నిరసన తెలిపాయి. ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల శనివారం తెల్లవారుజాము నుంచే పార్టీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వనపర్తి, నల్లగొండ తదితర చోట్ల నిరసనలు మి న్నంటాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్ర హం వ్యక్తంచేసింది. లోకసభఎన్నికల ముందు బీఆర్ ఎస్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో కుట్ర పన్నుతున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నిరసనలో అపశృతి సిరిసిల్ల: కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో శనివారం చేపట్టిన ధర్నాలో భాగంగా ప్రధాని మోదీ ఫ్లెక్సీపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ క్రమంలో కోడం సాయి (30) అనే యువకుడికి మంటలంటుకున్నాయి. వెంటనే మంటలార్పి అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇదే ఆందోళన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మహిళా ఎంపీపీలు పరస్పరం ఘర్షణపడి ఒకరినొకరు కొట్టుకోబోయారు. నేతలు వారిని వారించారు. -
52 కొత్త ముఖాలకు టిక్కెట్లు.. కర్ణాటక బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 52 కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇస్తూ విడుదల చేసిన తొలి జాబితా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ రాని అసంతృప్త నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై కొడుతున్నారు. మరికొందరు పార్టీ నుంచి వెళ్లిపోతామంటూ బెదిరింపులకి దిగుతున్నారు. ఆశావహుల మద్దతుదారులు బీజేపీ కార్యాలయం వద్ద నిరసనలకు కూడా దిగారు. సీనియర్ నేత లక్ష్మణ్ సావాది, మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ పాటిల్ నారిబోల్లు పార్టీకి బుధవారం గుడ్‌బై కొట్టేశారు. సలియా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎస్. అంగారా టికెట్ రాకపోవడంతో ఏకంగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మణ్ సావాది మాజీ సీఎం బీఎస్ యడ్డీయూరప్పకి అత్యంత విధేయుడు, శక్తిమంతమైన లింగాయత్ నాయకుల్లో ఒకరు. 2018 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుదారుల్ని ఆకర్షించడంలో పకడ్బందీగా వ్యూహాలు పన్నారు. ఈసారి టికెట్ రాకపోవడంతో సావాది తాను ఎవరినీ బిచ్చమడగనని, తనకి ఆత్మ గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌లోకి వెళతారంటున్నారు. మాజీ ఎమ్మెల్యే దొడ్డప్ప గౌడ కూడా రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టార్ పేరు తొలిజాబితాలో లేకపోయేసరికి ఆగ్రహావేశాలతో ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఇక మంత్రి అంగారా పార్టీ తనను తీవ్రంగా అవమానించిందంటూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. -
నిరసన... ప్రాథమిక హక్కు కాదా?
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ‘నిరసన తెలిపే హక్కు’ తిరుగులేనిదా అనే అంశాన్నీ పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి గానీ, శాంతియుతంగా నిరసన తెలుపడానికి గానీ ఢిల్లీ పోలీసులు తమకు అనుమతి నిరాకరించడంపై కిసాన్ మహా పంచాయత్ ఒక పిటిషన్ వేసింది. కానీ, కోర్టు ముందు పిటిషన్ వాయిదాలో ఉండటం, లేక న్యాయస్థానం పరిధిలో ఉండటం అనే కారణాలు చూపి నిరసన తెలిపే హక్కుపై ఆంక్షలను విధించకూడదు. ఒక సమస్యపై న్యాయపరిష్కారం కోసం కోర్టులను సంప్రదించాక, ప్రజలు అదే సమస్యపై నిరసన తెలిపే హక్కును కోల్పోతారని న్యాయమూర్తులు పేర్కొనడం పరిహాసాస్పదమైన విషయం. అక్టోబర్ 4న, ఇద్దరు న్యాయమూర్తులతో (జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్) కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మూడు పేజీల ఆదేశాన్ని జారీ చేసింది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ‘నిరసన తెలిపే హక్కు’ తిరుగులేనిదా అనే అంశాన్నీ పరిశీలించాల్సి ఉందని కోర్టు నొక్కి చెప్పింది. అలాగే కేంద్రప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన 3 వ్యవసాయ సంస్కరణ చట్టాల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ రైతు ప్రతినిధులు న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత కూడా, ఆ చట్టాలకు వ్యతిరేకంగా కిసాన్ మహాపంచాయత్ తన నిరసనలను బహిరంగంగా కొనసాగించవచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలించదల్చుకున్నట్లు కోర్టు ఆదేశం పేర్కొంది. దీనిపై కోర్టు తన ఆదేశంలో పొందుపర్చిన రాతపూర్వకమైన విషయం కానీ, న్యాయమూర్తులు వాడిన పదాల తీరు కానీ అత్యంత విచారకరంగా ఉన్నాయని చెప్పాలి. జంతర్‌మంతర్ వద్ద కూర్చుని ధర్నా చేయడానికిగానీ, శాంతియుతంగా నిరసన తెలుపడానికిగానీ ఢిల్లీ పోలీసులు తమకు అనుమతి నిరాకరించడంపై కిసాన్ మహా పంచాయత్ ఒక పిటిషన్ వేసింది. తమకు అనుమతి నిరాకరించిన పోలీసులు, సంయుక్త కిసాన్ మోర్చా వంటి సంస్థలకు మాత్రం అనుమతి మంజూరు చేశారని పిటిషన్‌దారులు సుప్రీంకోర్టుకి విన్నవిం చారు. చట్టం ముందు సమానత్వానికి హామీ ఇస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 బట్టి చూస్తే, ఈ ప్రత్యేక సందర్భంలో ఢిల్లీ పోలీసుల నిరాకరణ వివక్షతో కూడి ఉందా లేదా ఆర్టికల్ 19 కింద నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును ఇది ఉల్లంఘిస్తోందా అనే విషయాన్ని పరిశీలించడానికి న్యాయస్థానం ముందుగా ఢిల్లీ పోలీసుల ఆదేశాన్ని పరిశీలించాల్సి ఉంది. కానీ దీనికి బదులుగా, నిరసన హక్కు పరిమితులను విచారించేందుకు న్యాయస్థానం ముందుకు రావడం గమనార్హం. రాజ్యాంగ విధానం, స్ఫూర్తి ఏమిటి? నిరసన తెలిపే హక్కు అనేది... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ– ఆర్టికల్ 19(1) (బి) కింద శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛకు చెందిన రెండు ప్రాథమిక హక్కులతో కూడి ఉంది. పైన పేర్కొన్న రెండు హక్కులూ భారత సార్వభౌమాధికారం, దేశ సమగ్రత, సామాజిక శాంతి వంటి అంశాల ప్రాతిపదికన ఆర్టికల్ 19(2), ఆర్టికల్ 19(3) కింద హేతుపూర్వకమైన పరిమితులకు లోబడి ఉంటాయి. కోర్టు ముందు వాయిదాలో ఉండటం, లేక న్యాయ స్థానం పరిధిలో ఉండటం అనే అంశాలకు రాజ్యాంగపరంగా విలువకానీ, అనుమతికానీ లేదు. ఈ కారణాలు చూపి నిరసన తెలిపే హక్కుపై ఆంక్షలను విధించకూడదు. మరీ ముఖ్యంగా, ఇంతకు ముందే పేర్కొన్నట్లుగా ప్రాథమిక హక్కులపై శాసన, కార్యనిర్వాహక వర్గం ఆంక్షలు విధించడాన్ని రాజ్యాంగం అనుమతిస్తుందా అనే అంశాన్ని పరిశీలించడమే న్యాయస్థానం విధి. అంతేకానీ అదనపు కారణాలను వెతకడానికి ప్రయత్నించి, వాటి ఆధారంగా ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలించే పని న్యాయస్థానంది కాదు. శాసన, కార్యనిర్వాహక వర్గం పనితీరుపై తనిఖీ ఉంచడం అనే విధిని నిర్వర్తించడానికి బదులుగా, న్యాయస్థానం ప్రాథమిక హక్కుపై ఆంక్షలకు సంబంధించి ఇలాంటి వైఖరిని చేపట్టినప్పుడు, ఆ శాసన, కార్యనిర్వాహక వర్గం తరపున కోర్టు తనకుతానుగా సమర్థవంతంగా పనిచేసినట్లు అవుతుంది. మరోమాటలో చెప్పాలంటే, న్యాయస్థానం ప్రాథమిక హక్కుల ప్రాతిపదికను విచారించి, వాటిపై ఆంక్షలు విధించడంపై ఆత్రుత ప్రదర్శించినట్లు కనిపిస్తే ప్రభుత్వం చేసే పనిని కోర్టు స్వయంగా చేసినట్లు అవుతుంది. అదనంగా, రాజ్యాంగపరమైన సవాలు కోర్టుముందు అపరిష్కృతంగా ఉందన్న కారణంగా నిరసన తెలిపే హక్కును ఎవరికైనా లేకుండా చేయకూడదని 2020 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొని ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. కాబట్టి అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన న్యాయాదేశానికి కట్టుబడాల్సిన న్యాయమూర్తులు ప్రస్తుత ఆదేశం విషయంలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించారనే చెప్పాలి. నిరసన ఒక రాజకీయ కార్యాచరణ న్యాయపరమైన సవాలుకు, నిరసన తెలుపడానికి మధ్య లింకు పెట్టి రైతుల నిరసన హక్కుపై ఆంక్షలు విధించవచ్చని కోర్టు సూచించడం శుద్ధ అసంగతమైన విషయం అనే చెప్పాలి. ఇలాంటి వైఖరి పూర్తిగా హేతువిరుద్ధమైనదని చెప్పడానికి కనీసం మూడు స్పష్టమైన కారణాలను పేర్కొనవచ్చు. మొదటిది, కోర్టును సంప్రదించడం అనేది న్యాయపరమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇక నిరసన అనేది రాజ కీయ అన్వేషణకు సంబంధించింది. మొదటి అంశంలో, శాసన కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధత లేదా రాజ్యాంగబద్ధతపై న్యాయస్థానం నిర్ణయం తెలపాలి. కాగా, రైతుల నిరసనకు కారణమైన ప్రభుత్వ తొలి నిర్ణయాన్ని రద్దు చేయడం లేదా సవరించడంపై నేరుగా విధాన నిర్ణేతపై ఒత్తిడి తేవాలని ప్రజలు చూస్తున్నారు. ఈ రెండు మార్గాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి. ఒక న్యాయపరమైన పరిష్కారాన్ని వెదుకుతున్నప్పుడు ఒక వ్యక్తి రాజకీయ పరిష్కారాన్ని కోల్పోవడానికి సముచితమైన కారణం లేదు. రెండోది, శాసనాలకు ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటాయి. కానీ ప్రజాస్వామిక సమాజంలో నిరసనలకు మరింత విస్తృత ప్రాతిపదిక ఉంది. శాసనం కూడా రాజ్యాంగ బద్ధమైనదే కావచ్చు కానీ ప్రజలు దాన్ని యథాతథంగా స్వీకరిస్తారని భావించకూడదు. రాజ్యాంగపరమైన ఆదేశాలు శాసన, కార్యనిర్వాహక వర్గం కార్యాచరణకు కనీసమాత్రంగానే చట్టబద్ధతను అందిస్తాయి. ప్రజలు ప్రతి సందర్భంలోనూ నిరసన తెలిపే హక్కును కలిగి ఉంటారు. మూడోది, న్యాయస్థానం నిర్ణయాలపై నిరసన తెలుపడానికి కూడా మన రాజ్యాంగం అనుమతిస్తోంది. నిజానికి, న్యాయ నిర్ణయాలకు వ్యతిరేకంగా సాగే ప్రజా నిరసనలు ఆ నిర్ణయం ప్రభావాన్ని తటస్థం చేయడానికి లేదా ఉపశమింపచేయడానికి రాజ్యాంగ, న్యాయపరమైన మార్పులను ప్రేరేపిస్తాయి. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అత్యాచారాల నివారణ చట్టం 1989 అమలును సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పు ద్వారా పలుచబార్చినప్పుడు, చెలరేగిన తీవ్రమైన నిరసనల కారణంగా కోర్టు తీర్పును తటస్థం చేయడానికి ఆ చట్టానికి పార్లమెంటు సవరణ తీసుకొచ్చింది. ప్రాథమికంగా అప్రజాస్వామికం ప్రభుత్వ విధానంలో లేక నిర్ణయాల్లో తలెత్తిన వివాదాస్పద అంశాలను పరిష్కరించడానికి న్యాయపరమైన చర్యలను ప్రారంభించినప్పటికీ, అవి ఇతర ప్రజాస్వామిక చర్యలను నిరోధించలేవు. నిజానికి న్యాయపరమైన పరిష్కారాన్ని అన్వేషించడం అనేది ప్రజలు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అవలంబించే అనేక ప్రజాస్వామిక ఎంపికల్లో భాగంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ఒక సమస్యపై న్యాయపరిష్కారం కోసం కోర్టులను సంప్రదించాక, ప్రజలు అదే సమస్యపై నిరసన తెలిపే హక్కును కోల్పోతారని న్యాయమూర్తులు పేర్కొనడం పరిహాసాస్పదమైన విషయం. ఈ సందర్భంగా న్యాయమూర్తుల ఆలోచనా ధోరణి ప్రాథమికంగానే అప్రజాస్వామికంగా ఉంది. కోర్టుల్లో విచారణ ప్రారంభించాక, నిరసన తెలిపే హక్కు ఉండదని జడ్జీలు పేర్కొన్నారని ఊహించుకుందాం. దాని పరిణామపూర్వకమైన ముగింపు ఎలా ఉంటుంది? సమస్య కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నిరసనలకు అనుమతి లేదనుకుంటే, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు కూడా అనుమతి ఉండదు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు దాన్ని నిరోధించడానికి రాజ్యాంగ సంవి ధానానికి న్యాయవ్యవస్థ అవసరమవుతుంది. సుప్రీంకోర్టు అనవసరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఊహకు అందని విషయమే. రంజిన్ పల్లవ్ త్రిపాఠి అధ్యాపకుడు, నేషనల్ లా యూనివర్సిటీ, ఒడిశా -
రైతుల ఆందోళన.. అవార్డులు తిరిగిచ్చేస్తాం..
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయంలో నూతన చట్టాలను తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్, పలు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్ నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆరు రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ రైతులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ.. ఇంకా ఆందోళనను ఉధృతం చేశారు. తాజాగా రైతుల ఆందోళనలకు పంజాబ్ కి చెందిన ప్రముఖ క్రీడాకారులు మరియు కోచ్ లు మద్దతు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే తమకు వచ్చిన అవార్డులు,మెడల్స్ అన్నింటినీ తిరిగిచ్చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన క్రీడాకారులలో రెజ్లర్ మరియు పద్మశ్రీ అవార్డీ కర్తార్ సింగ్, అర్జున అవార్డ్ గ్రహీత మరియు ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్, అర్జున అవార్డ్ గ్రహీత హాకీ ఆటగాడు గుర్మైల్ సింగ్, ఒలంపిక్ హాకీ ఆటగాడు, అర్జున అవార్డ్ గ్రహీత సజ్జన్ చీమా, గోల్డెన్ గర్ల్ గా పిలువబడే మాజీ ఇండియన్ హాకీ కెప్టెన్ రజ్బిట్ కౌర్ కూడా ఉన్నారు. మంగళవారం జలంధర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఈ క్రీడాకారులందరూ డిమాండ్ చేశారు. మరోవైపు, రైతుల ఆందోళనలు విరమించేలా ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో మంగళవారం 36మంది రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మూడవ రౌండ్ చర్చలు ప్రారంభించింది. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పంజాబ్ కి చెందిన రైతులు, హర్యానా నుంచి ఇద్దరు రైతు సంఘాల ప్రతినిధులు, ఏఐకేఎస్ సీసీ లీడర్ యోగేంద్ర యాదవ్, ఉత్తరప్రదేశ్ కి చెందిన మరో నాయకుడు పాల్గొన్నారు. రైతులు ఆందోళనలను విరమింపచేసేలా తగిన వ్యూహాన్ని సిద్దం చేసేందుకు ఇవాళ ఉదయం టాప్ బీజేపీ లీడర్లు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నరేంద్ర సింగ్ తోమర్ సహా పలువరు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేవమై చర్చించిన విషయం తెలిసిందే. -
‘పెట్రో’ పరిష్కారంపై చర్చిస్తున్నాం
భువనేశ్వర్/ముంబై: పెట్రో ధరలు పెరగడంపై సత్వరమే ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు యత్నిస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పెట్రో బాదుడు నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే విషయమై ప్రభుత్వం విస్తృతంగా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన భువనేశ్వర్‌లో మాట్లాడారు. ‘పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించేందుకు వీటిని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని పెట్రోలియం శాఖ యోచిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి తెచ్చేలోపు ఈ సమస్యకు వెంటనే ఓ పరిష్కారం కనుగొనడంపై కేంద్రం చర్చిస్తోంది. పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణలో కేంద్రంతో పాటు రాష్ట్రాల పాత్ర ఉంది’ అని అన్నారు. పెట్రో సమస్యపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్, వెనిజువెలా దేశాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయన్నారు. ప్రజలపై పెట్రోబాదుడుకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్, అమ్మకపు పన్నుల్ని రాష్ట్రాలు తగ్గించాలని నీతిఆయోగ్ సూచించింది. ఆర్థికలోటును కట్టడిచేయడం, ముడిచమురు ధరల ప్రభావాన్ని ఎదుర్కోవడం వంటి కీలక బాధ్యతలు కేంద్రంపై ఉన్నందున ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం వీలుకాదని స్పష్టంచేసింది. -
యూఎస్పీసీ పోరాటాల్లో భాగస్వాములు కావాలి
ఎదులాపురం(ఆదిలాబాద్): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) పోరాటాల్లో అన్ని సంఘాలు భాగస్వాములు కావాలని ఆ సంఘం జిల్లా నాయకులు వెంకట్, వృకోధర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్ సంఘ భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న కొన్ని సంఘాలు వారి ఇమేజ్ను చూపించుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సహాయ నిధికి ఉద్యోగుల ఒక రోజు వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని మినహాయిస్తున్నట్లు 127 జీవో విడుదల చేసిందన్నారు. ఈ జీవోను యూఎస్‌పీసీలోని 10 విభాగాలు సమ్మితించడం లేదని స్పష్టం చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చట్టసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దపు ప్రకటన చేసి, ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూఎస్ పీసీ నాయకులు నాగేందర్, శ్రీనివాస్, లక్ష్మణ్‌రావు, దిలీప్, విఠల్‌గౌడ్, సేవాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మహా’ ఒప్పందంపై ఆందోళనలు
రాష్ర్ట టీడీపీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకోసం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంపై ఆందోళనలకు దిగాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం సమావేశం జరిగింది. ఒప్పందం తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వాదిస్తున్న టీడీపీ, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. దీని కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై పార్టీ నేతలు చర్చించారు. ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరపాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. జలసౌధ ఎదుట సోమవారం ధర్నా చేయాలని, గవర్నర్ నరసింహన్‌ను కలసి అక్రమ ఒప్పందాల గురించి వివరించాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరె డ్డి, ఉమా మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్న విద్యార్థిలోకం
నారాయణ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా కడప బంద్ విజయవంతం * పోలీసు నిర్బంధంలోనూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు * విద్యార్థినుల మృతిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు * పలుచోట్ల మంత్రి నారాయణ దిష్టిబొమ్మలు దగ్ధం సాక్షి నెట్వర్క్: నారాయణ విద్యా సంస్థలపై ప్రజాగ్రహం మిన్నంటింది. విద్యార్థిలోకం భగ్గుమంది. కడప నగర శివారులోని నారాయణ జూనియర్ కళాశాల బాలికల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల మరణానికి కారకులైనవారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన కడప బంద్ విజయవంతమైంది. నగరంలో బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం విధించి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. 15 నెలల్లో ఏకంగా 11 మంది నారాయణ సంస్థల విద్యార్థులు మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగమంతా కడపలో తిష్టవేసి అర్థరాత్రి నుంచే అక్రమ అరెస్టులకు పాల్పడింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమ్జాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, కడప నగర పార్టీ అధ్యక్షుడు నిత్యానందరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఉదయం బంద్ చేయడానికి రోడ్డుపైకి వచ్చిన వారందరినీ బలవంతంగా అరెస్ట్ చేసినప్పటికీ బంద్ విజయవంతం కాకుండా అడ్డుకోలేకపోయారు. నగరవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు మూత పడ్డాయి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, మౌన ప్రదర్శనలు జరిగాయి. జిల్లాలోని రాజంపేట, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ కరువైందని మండిపడ్డారు. మరోవైపు వామపక్ష పార్టీలు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, పీడీఎస్‌యూ వంటి సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కళాశాలల బంద్ జరిగింది. పలుచోట్ల ప్రదర్శనలు, మంత్రి నారాయణ దిష్టిబొమ్మల దగ్ధం వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి నారాయణను తక్షణమే బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సీమ వ్యాప్తంగా..: చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మార్‌పల్లిలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి సంబంధించి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు విశ్వనాథ్లతోపాటు మరో 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలులో జిల్లాగేటు వద్ద విద్యార్థులు రాస్తారోకో చేశారు. అనంతపురం జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రిలో ఆందోళనలు జరిగాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నారాయణ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. కార్పొరేట్ కళాశాలలు బంద్ విజయవాడ నగరంలోని కార్పొరేట్ కళాశాలలను విద్యార్థి సంఘాలు మూసివేయించాయి. ఏలూరు రోడ్డులోని నారాయణ కాలేజీ వద్ద ఏఐఎస్ఎఫ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు దిగారు. బెంజిసర్కిల్ వద్ద మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నేతలు వినోద్, విఠల్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహంకాళి సుబ్బారావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పీడీఎస్‌యూ నేతలు మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ నుంచి మానవహారంగా ఏర్పడి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ నాయకులు కార్పొరేట్ కాలేజీలను మూసివేయించారు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కశాశాల ఎదుట పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కాలేజీని విద్యార్థులు ముట్టడించడంతో పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కార్పొరేట్ కళాశాలలను మూసివేయించింది. శ్రీకాకుళం జిల్లాలోని పలు పట్టణాల్లో విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. విశాఖపట్నంలోని పెద వాల్తేరు, సంపత్‌నగర్, వినాయక టెంపుల్ రోడ్డులోనూ విద్యార్థి సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు మంత్రి నారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.