భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ‘నిరసన తెలిపే హక్కు’ తిరుగులేనిదా అనే అంశాన్నీ పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి గానీ, శాంతియుతంగా నిరసన తెలుపడానికి గానీ ఢిల్లీ పోలీసులు తమకు అనుమతి నిరాకరించడంపై కిసాన్ మహా పంచాయత్ ఒక పిటిషన్ వేసింది. కానీ, కోర్టు ముందు పిటిషన్ వాయిదాలో ఉండటం, లేక న్యాయస్థానం పరిధిలో ఉండటం అనే కారణాలు చూపి నిరసన తెలిపే హక్కుపై ఆంక్షలను విధించకూడదు. ఒక సమస్యపై న్యాయపరిష్కారం కోసం కోర్టులను సంప్రదించాక, ప్రజలు అదే సమస్యపై నిరసన తెలిపే హక్కును కోల్పోతారని న్యాయమూర్తులు పేర్కొనడం పరిహాసాస్పదమైన విషయం.
అక్టోబర్ 4న, ఇద్దరు న్యాయమూర్తులతో (జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్) కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మూడు పేజీల ఆదేశాన్ని జారీ చేసింది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ‘నిరసన తెలిపే హక్కు’ తిరుగులేనిదా అనే అంశాన్నీ పరిశీలించాల్సి ఉందని కోర్టు నొక్కి చెప్పింది. అలాగే కేంద్రప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన 3 వ్యవసాయ సంస్కరణ చట్టాల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ రైతు ప్రతినిధులు న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత కూడా, ఆ చట్టాలకు వ్యతిరేకంగా కిసాన్ మహాపంచాయత్ తన నిరసనలను బహిరంగంగా కొనసాగించవచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలించదల్చుకున్నట్లు కోర్టు ఆదేశం పేర్కొంది.
దీనిపై కోర్టు తన ఆదేశంలో పొందుపర్చిన రాతపూర్వకమైన విషయం కానీ, న్యాయమూర్తులు వాడిన పదాల తీరు కానీ అత్యంత విచారకరంగా ఉన్నాయని చెప్పాలి. జంతర్‌మంతర్ వద్ద కూర్చుని ధర్నా చేయడానికిగానీ, శాంతియుతంగా నిరసన తెలుపడానికిగానీ ఢిల్లీ పోలీసులు తమకు అనుమతి నిరాకరించడంపై కిసాన్ మహా పంచాయత్ ఒక పిటిషన్ వేసింది. తమకు అనుమతి నిరాకరించిన పోలీసులు, సంయుక్త కిసాన్ మోర్చా వంటి సంస్థలకు మాత్రం అనుమతి మంజూరు చేశారని పిటిషన్‌దారులు సుప్రీంకోర్టుకి విన్నవిం చారు. చట్టం ముందు సమానత్వానికి హామీ ఇస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 బట్టి చూస్తే, ఈ ప్రత్యేక సందర్భంలో ఢిల్లీ పోలీసుల నిరాకరణ వివక్షతో కూడి ఉందా లేదా ఆర్టికల్ 19 కింద నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును ఇది ఉల్లంఘిస్తోందా అనే విషయాన్ని పరిశీలించడానికి న్యాయస్థానం ముందుగా ఢిల్లీ పోలీసుల ఆదేశాన్ని పరిశీలించాల్సి ఉంది. కానీ దీనికి బదులుగా, నిరసన హక్కు పరిమితులను విచారించేందుకు న్యాయస్థానం ముందుకు రావడం గమనార్హం.
రాజ్యాంగ విధానం, స్ఫూర్తి ఏమిటి?
నిరసన తెలిపే హక్కు అనేది... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ– ఆర్టికల్ 19(1) (బి) కింద శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛకు చెందిన రెండు ప్రాథమిక హక్కులతో కూడి ఉంది. పైన పేర్కొన్న రెండు హక్కులూ భారత సార్వభౌమాధికారం, దేశ సమగ్రత, సామాజిక శాంతి వంటి అంశాల ప్రాతిపదికన ఆర్టికల్ 19(2), ఆర్టికల్ 19(3) కింద హేతుపూర్వకమైన పరిమితులకు లోబడి ఉంటాయి. కోర్టు ముందు వాయిదాలో ఉండటం, లేక న్యాయ స్థానం పరిధిలో ఉండటం అనే అంశాలకు రాజ్యాంగపరంగా విలువకానీ, అనుమతికానీ లేదు. ఈ కారణాలు చూపి నిరసన తెలిపే హక్కుపై ఆంక్షలను విధించకూడదు.
మరీ ముఖ్యంగా, ఇంతకు ముందే పేర్కొన్నట్లుగా ప్రాథమిక హక్కులపై శాసన, కార్యనిర్వాహక వర్గం ఆంక్షలు విధించడాన్ని రాజ్యాంగం అనుమతిస్తుందా అనే అంశాన్ని పరిశీలించడమే న్యాయస్థానం విధి. అంతేకానీ అదనపు కారణాలను వెతకడానికి ప్రయత్నించి, వాటి ఆధారంగా ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలించే పని న్యాయస్థానంది కాదు. శాసన, కార్యనిర్వాహక వర్గం పనితీరుపై తనిఖీ ఉంచడం అనే విధిని నిర్వర్తించడానికి బదులుగా, న్యాయస్థానం ప్రాథమిక హక్కుపై ఆంక్షలకు సంబంధించి ఇలాంటి వైఖరిని చేపట్టినప్పుడు, ఆ శాసన, కార్యనిర్వాహక వర్గం తరపున కోర్టు తనకుతానుగా సమర్థవంతంగా పనిచేసినట్లు అవుతుంది. మరోమాటలో చెప్పాలంటే, న్యాయస్థానం ప్రాథమిక హక్కుల ప్రాతిపదికను విచారించి, వాటిపై ఆంక్షలు విధించడంపై ఆత్రుత ప్రదర్శించినట్లు కనిపిస్తే ప్రభుత్వం చేసే పనిని కోర్టు స్వయంగా చేసినట్లు అవుతుంది. అదనంగా, రాజ్యాంగపరమైన సవాలు కోర్టుముందు అపరిష్కృతంగా ఉందన్న కారణంగా నిరసన తెలిపే హక్కును ఎవరికైనా లేకుండా చేయకూడదని 2020 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొని ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. కాబట్టి అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన న్యాయాదేశానికి కట్టుబడాల్సిన న్యాయమూర్తులు ప్రస్తుత ఆదేశం విషయంలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించారనే చెప్పాలి.
నిరసన ఒక రాజకీయ కార్యాచరణ
న్యాయపరమైన సవాలుకు, నిరసన తెలుపడానికి మధ్య లింకు పెట్టి రైతుల నిరసన హక్కుపై ఆంక్షలు విధించవచ్చని కోర్టు సూచించడం శుద్ధ అసంగతమైన విషయం అనే చెప్పాలి. ఇలాంటి వైఖరి పూర్తిగా హేతువిరుద్ధమైనదని చెప్పడానికి కనీసం మూడు స్పష్టమైన కారణాలను పేర్కొనవచ్చు. మొదటిది, కోర్టును సంప్రదించడం అనేది న్యాయపరమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇక నిరసన అనేది రాజ కీయ అన్వేషణకు సంబంధించింది. మొదటి అంశంలో, శాసన కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధత లేదా రాజ్యాంగబద్ధతపై న్యాయస్థానం నిర్ణయం తెలపాలి. కాగా, రైతుల నిరసనకు కారణమైన ప్రభుత్వ తొలి నిర్ణయాన్ని రద్దు చేయడం లేదా సవరించడంపై నేరుగా విధాన నిర్ణేతపై ఒత్తిడి తేవాలని ప్రజలు చూస్తున్నారు. ఈ రెండు మార్గాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి. ఒక న్యాయపరమైన పరిష్కారాన్ని వెదుకుతున్నప్పుడు ఒక వ్యక్తి రాజకీయ పరిష్కారాన్ని కోల్పోవడానికి సముచితమైన కారణం లేదు.
రెండోది, శాసనాలకు ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటాయి. కానీ ప్రజాస్వామిక సమాజంలో నిరసనలకు మరింత విస్తృత ప్రాతిపదిక ఉంది. శాసనం కూడా రాజ్యాంగ బద్ధమైనదే కావచ్చు కానీ ప్రజలు దాన్ని యథాతథంగా స్వీకరిస్తారని భావించకూడదు. రాజ్యాంగపరమైన ఆదేశాలు శాసన, కార్యనిర్వాహక వర్గం కార్యాచరణకు కనీసమాత్రంగానే చట్టబద్ధతను అందిస్తాయి. ప్రజలు ప్రతి సందర్భంలోనూ నిరసన తెలిపే హక్కును కలిగి ఉంటారు. మూడోది, న్యాయస్థానం నిర్ణయాలపై నిరసన తెలుపడానికి కూడా మన రాజ్యాంగం అనుమతిస్తోంది. నిజానికి, న్యాయ నిర్ణయాలకు వ్యతిరేకంగా సాగే ప్రజా నిరసనలు ఆ నిర్ణయం ప్రభావాన్ని తటస్థం చేయడానికి లేదా ఉపశమింపచేయడానికి రాజ్యాంగ, న్యాయపరమైన మార్పులను ప్రేరేపిస్తాయి. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అత్యాచారాల నివారణ చట్టం 1989 అమలును సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పు ద్వారా పలుచబార్చినప్పుడు, చెలరేగిన తీవ్రమైన నిరసనల కారణంగా కోర్టు తీర్పును తటస్థం చేయడానికి ఆ చట్టానికి పార్లమెంటు సవరణ తీసుకొచ్చింది.
ప్రాథమికంగా అప్రజాస్వామికం
ప్రభుత్వ విధానంలో లేక నిర్ణయాల్లో తలెత్తిన వివాదాస్పద అంశాలను పరిష్కరించడానికి న్యాయపరమైన చర్యలను ప్రారంభించినప్పటికీ, అవి ఇతర ప్రజాస్వామిక చర్యలను నిరోధించలేవు. నిజానికి న్యాయపరమైన పరిష్కారాన్ని అన్వేషించడం అనేది ప్రజలు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అవలంబించే అనేక ప్రజాస్వామిక ఎంపికల్లో భాగంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ఒక సమస్యపై న్యాయపరిష్కారం కోసం కోర్టులను సంప్రదించాక, ప్రజలు అదే సమస్యపై నిరసన తెలిపే హక్కును కోల్పోతారని న్యాయమూర్తులు పేర్కొనడం పరిహాసాస్పదమైన విషయం.
ఈ సందర్భంగా న్యాయమూర్తుల ఆలోచనా ధోరణి ప్రాథమికంగానే అప్రజాస్వామికంగా ఉంది. కోర్టుల్లో విచారణ ప్రారంభించాక, నిరసన తెలిపే హక్కు ఉండదని జడ్జీలు పేర్కొన్నారని ఊహించుకుందాం. దాని పరిణామపూర్వకమైన ముగింపు ఎలా ఉంటుంది? సమస్య కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నిరసనలకు అనుమతి లేదనుకుంటే, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు కూడా అనుమతి ఉండదు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు దాన్ని నిరోధించడానికి రాజ్యాంగ సంవి ధానానికి న్యాయవ్యవస్థ అవసరమవుతుంది. సుప్రీంకోర్టు అనవసరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఊహకు అందని విషయమే.
రంజిన్ పల్లవ్ త్రిపాఠి
అధ్యాపకుడు, నేషనల్ లా యూనివర్సిటీ, ఒడిశా
Comments
Please login to add a commentAdd a comment