ఒక నిషిద్ధ సంస్థలో కేవల సభ్యత్వం ఉన్నా సరే దాన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 కింద నేరంగా పరిగణించవచ్చని సుప్రీం కోర్టు బెంచ్ ఇచ్చిన తాజా తీర్పుతో మౌలిక న్యాయసూత్రాలకు విఘాతం కలిగినట్లయింది!
ఇటీవల సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నిషిద్ధ సంస్థలో కేవల సభ్యత్వం ఉన్నా సరే దాన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం – 1967 కింద నేరంగా పరిగణించ వచ్చని సారాంశం. అయితే నిర్దిష్ట సంస్థలో క్రియాశీల, నిష్క్రియాత్మక సభ్యత్వాల మధ్య వ్యత్యాసాన్ని ఈ తీర్పు పట్టించు కోలేదు! ఉగ్రవాదంపై పోరు, దేశ భద్రత పరిరక్షణ పేరుతో చట్టవ్యతిరేకంగా ఏజెన్సీలు పని చేయడాన్ని చట్టబద్ధం చేయడం అనే ప్రమాదం ఈ తీర్పులో దాగుంది.
2011నాటి అరూప్ భూయాన్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ అసోం హోమ్ డిపార్ట్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టే ఇచ్చిన తీర్పుకు ఇది స్వీయ విఘాతం. నిషిద్ధ సంస్థలు తమ సభ్యుల పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు, ఈమెయి ల్‌తో కూడిన రిజిస్ట్రీని నిర్వహించవు. చట్ట బద్ధ సంస్థ సభ్యత్వ రికార్డుల విషయంలో కూడా, ఒక సంస్థ నిషేధానికి గురైన తర్వాత ఆ సంస్థలో ఎవరు సభ్యులు, ఎవరు దాంట్లో కొనసాగుతారు అని ఏ సంస్థ అయినా లేదా న్యాయస్థానమైనా ఎలా నిర్ధారిస్తాయి? సంబంధం ఉన్నంత మాత్రాన అమాయకులైన యువతీ యువకులను చట్టవిరుద్ధ ఉగ్రవాద సంస్థల సభ్యులుగా ఎలా ఇరికిస్తారు అనే విష యాన్ని గతంలో జ్యోతి బాబా సాహెబ్ కోర్జ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2012) కేసు చక్కగా విశ్లేషించింది.
ఈ కేసులో 15 మంది వ్యక్తులను (అందరూ గిరిజన యువతీయువకులే) ఉగ్రవాద సంస్థ అయిన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సభ్యులుగా ఆరోపించారు. పుస్తకాలు, ఆర్టికల్స్, పాంప్లెట్స్ వంటి మావోయిస్టు ప్రచార సాహి త్యాన్ని కలిగివుండటమే వీరు చేసిన నేరం. ఇది తప్ప, వీరు ఉగ్రవాద చర్యల్లో లేదా హింసాత్మక చర్యల్లో పాల్గొన్నారని కానీ, ఉగ్రవాద శిబిరాన్ని నిర్వహించారనికానీ, రిక్రూట్‌మెంట్ చేశారని గానీ, మావోయిస్టు కార్యకర్తలకు ఆశ్రయం ఇచ్చారని కానీ, ఉగ్రవాద చర్యల కోసం నిధులు సేకరించా రని కానీ వీరిపై ఆరోపణలు లేవు. కానీ, ఉగ్రవాద సంస్థ సభ్యత్వం తీసుకోవడం అనేది నిర్బంధించ దగిన శిక్షార్హమైన నేరం అవుతుందని, దీనిగ్గాను యావజ్జీవ శిక్షకూడా విధించొచ్చని బాంబే హైకోర్టు ‘ఉపా’ సెక్షన్ 20కి విస్తృతార్థం కల్పించింది.
2011లో అరూప్ భూయాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు, ’’హింసాత్మక చర్యలకు పాల్పడటం లేదా ప్రజలను హింసాత్మక చర్యలకు ప్రేరేపించడం లేదా అశాంతిని సృష్టించడానికి పూనుకోవడం చేస్తే తప్ప, నిషిద్ధ సంస్థలో కేవలం సభ్యత్వం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిపై నేరా రోపణ చేయలేము’’. సూచించడం, ప్రేరేపించడం మధ్య వ్యత్యాసం ఉందంటూ బ్రాండెన్ బర్గ్ వర్సెస్ ఓహియో కేసులో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై ఆనాడు భారత సుప్రీంకోర్టు ఆధారపడింది. ‘‘కేవలం సభ్యత్వం ఉన్నంత మాత్రాన దాన్ని చట్టవిరుద్ధం అని చెప్పలేము.
చట్టవ్యతిరేక కార్యాచరణకు స్పష్టంగా ప్రేరేపించి నట్లయితేనే అది చట్టవిరుద్ధంగా మారుతుంద’’ని అమెరికా ఫెడరల్ కోర్టు రనీఫ్ కేసులో తీర్పు చెప్పింది. సభ్యత్వం విషయంలో క్రియాశీలకంగా ఉండటానికి నిష్క్రియాత్మకంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉందంటూ స్కేల్స్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది.
నిషిద్ధ సంస్థతో సంబంధం ఉన్నంత మాత్రాన అపరాధం మోపడానికి నేరన్యాయ చట్టంలో తావులేదని ఎల్‌బ్రాండ్ట్ వర్సెస్ రస్సెల్ కేసులో కూడా అమెరికా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పులను నాడు భారత సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కానీ తాజా తీర్పు భద్రత పేరుతో హక్కులకు విఘాతం కలిగించేలా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 44 సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా, 13 సంస్థలను చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించింది. ఉగ్రవాదాన్ని, టెర్రరిస్టు చట్టాలను, ఉగ్రవాద బృందాలను నిర్వచించడంలో, అసంబద్ధంగా ఉగ్రవాదిగా ముద్రల పాలైన వారిని ఒక మేరకు కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పెనుగులాడుతున్నాయి. అదే సమ యంలో ఉగ్రవాద నిరోధక సంస్థల అధికారాలను దుర్వినియోగం చేయడాన్ని అరికట్టాల్సి ఉంది. వ్యక్తులపై తప్పుడు ముద్రలు వేయడం అనేది వాస్త వానికి ఉగ్రవాదంపై పోరాట యత్నాలను పలుచ బారుస్తుంది.
ఇది ప్రజాస్వామిక విలువలను, సంస్థ లను అణగదొక్కుతుంది. ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యాచరణను ఏది ఏర్పరుస్తుంది? ఉగ్రవాద, చట్టవ్యతిరేక బృంద సభ్యుడిగా ఏదీ నిర్ధారిస్తుంది అనే అంశాలపై ప్రతి ఉదార ప్రజాస్వామిక వ్యవ స్థలో కచ్చితమైన న్యాయపరమైన వ్యాఖ్యలకు అనుగుణంగానే మునుపటి మూడు తీర్పులు ఉంటూ వస్తున్నాయి.
ఉదాహరణకు, సామాజిక లేదా వృత్తిపరమైన పరస్పర ప్రతిచర్యల క్రమంలో ఉగ్ర వాద బృందాల సంబంధంలోకి తెలియకుండా వచ్చిన వారిని మినహాయించడానికి ఇవి ప్రాధాన్య మిచ్చాయి. ఇక్కడ మాత్రం అనుమానితులు కాని పౌరులను ఉచ్చులో చిక్కుకునేలా చేయడానికి నిఘా సంస్థలకు సుప్రీం తన తాజా తీర్పులో సమ ర్థంగా లైసెన్సును మంజూరు చేసినట్లయింది.
అశీష్ ఖేతాన్
వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్
జిందాల్ గ్లోబల్ లా స్కూల్
Comments
Please login to add a commentAdd a comment