‘మహా’ ఒప్పందంపై ఆందోళనలు
రాష్ర్ట టీడీపీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకోసం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంపై ఆందోళనలకు దిగాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం సమావేశం జరిగింది. ఒప్పందం తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వాదిస్తున్న టీడీపీ, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. దీని కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై పార్టీ నేతలు చర్చించారు. ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరపాలని సమావేశం నిర్ణయం తీసుకుంది.
జలసౌధ ఎదుట సోమవారం ధర్నా చేయాలని, గవర్నర్ నరసింహన్‌ను కలసి అక్రమ ఒప్పందాల గురించి వివరించాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరె డ్డి, ఉమా మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.