చర్చ జరపకుంటే ప్రతిఘటిస్తాం
- ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పట్టు
- అసెంబ్లీ 15 రోజులపాటు జరపాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభ సమావేశాలను 15 రోజులపాటు పెంచాలని వైఎస్‌ఆర్ సీపీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం అవకాశమివ్వకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్య లు, కరువు, రుణమాఫీ, కనీస మద్దతు ధర సమస్యలను ఎదుర్కొంటుందని చెప్పారు.
గురు వారం శాసనసభ వ్యవహారాల మండలి (బీఏసీ) అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్నివర్గాల ప్రజ లు అనేక ఇబ్బం దులకు గురవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెం బ్లీ వేదికగా చర్చించేందుకు 15 రోజులపాటు సమావేశాలను పొడిగించాలని బీఏసీలో తమ పార్టీ తరఫున కోరినట్లు చెప్పారు.
రాయలసీమకు సాగునీరందక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, డ్వాక్రా రుణమాఫీ, పింఛన్లలో అవకతవకలు, ‘పచ్చ’ కమిటీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, అంగన్‌వాడీల సమస్యలు, హుద్‌హుద్ తుపాను, ఇసుక మాఫి యా, శ్రీశైలం విద్యుత్, పోలవరం నిర్మాణం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం-టెండర్, ఉద్యోగుల విభజన, పీఆర్సీ పెంపు వంటి సమస్యలపై అసెం బ్లీలో కూలంకషంగా చర్చించాల్సి ఉందన్నారు.
రాజధాని నిర్మాణం ప్రధానమైన అంశమని అభిప్రాయపడ్డారు. వివిధ కోణాల్లో చర్చకు వచ్చే విధంగా కృషి చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎం మాత్రం 2 రోజులపాటు సాయంత్రం వరకు సెషన్స్ కొనసాగించి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెడతామని చెప్పారని తెలిపారు. సభను తప్పుదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తారా?: గడికోట
సీఎం చంద్రబాబు నాయుడు బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాన్ని హేళన చేసే విధంగా వ్యవహరించారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. వెంకటరమణ, పెషావర్ కాల్పుల్లో మృతులపై సంతాపం తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించినప్పడు... హుద్‌హుద్ తుపానులో చనిపోయిన మృతులు, కరువు కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని తాము కోరామని తెలిపారు. అయితే ఆ సంప్రదాయం లేదని చంద్రబాబు తప్పించుకున్నారని, తనకే అన్నీ తెలుసు అన్న ధోరణి ఆయన విడనాడాలని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చలు జరగకుండా ప్రభుత్వం తప్పించుకునే ధోరణి అనుసరిస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు.
గుంటూరు భూములు సింగపూర్‌కు.. సింగపూర్ భూములు బాబుకు..
రాజధాని ప్రకటించిన గుంటూరు జిల్లాలో భూములు సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించేందుకు చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ వేస్తున్నారని, రైతుల జీవితాలు పణంగా పెట్టే చంద్రబాబు ఆటలు మాత్రం సాగనివ్వమని ఆ జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ముస్తఫాలు తెలిపారు. ‘గుంటూరు భూములు సింగపూర్‌కు.. సింగపూర్ భూములు చంద్రబాబుకు..’ అన్న విధంగానే ఏపీ ప్రభుత్వం, సింగపూర్ నడుమ క్విడ్ ప్రోకో జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు తన కుటుంబంతో కలిసి ఎన్నిసార్లు సింగపూర్‌కు వెళ్ళారో.. ఆయన పాస్‌పోర్టు స్టాంపింగ్ చూపించాలని అసెంబ్లీలో తాము డిమాండ్ చేస్తామని వారు చెప్పారు.