jyotula Nehru
-
జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ
సాక్షి, కాకినాడ జిల్లా: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ కూడా తనవైపే ఉన్నాడని, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్రకు సీటు ఇస్తే పొత్తులో ఉండనంటూ జ్యోతుల స్పష్టం చేయడంతో సమావేశాన్ని సూర్యచంద్ర బహిష్కరించారు. దీంతో జ్యోతుల తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య తోపులాట చోటు చేసుకుంది. జనసేన-టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. కాగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వెలుపల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించిన నాటినుంచి ఇదే తీరు కనిపిస్తోంది. గత మంగళవారం.. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సమన్వయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు బండబూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సమన్వయ సమావేశమని ప్రకటించినా.. ఇరుపక్షాలు ఎదురెదురుగా బల్లలు, కుర్చీలు వేసుకుని వాదోపవాదాలకు దిగారు.. తాజాగా జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. చదవండి: మరోసారి బయటపడ్డ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు -
ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట..
ఏపీ రాజకీయాలకు తూర్పును మార్పుగా చెబుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ పార్టీకి అధికంగా సీట్లు వస్తాయో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేవారు. గత ఎన్నికల్లో కూడా ఇదే సెంటిమెంట్ పనిచేసింది. తూర్పు జిల్లాలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలైంది. వైఎస్ జగన్ దండయాత్రతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతయింది. చదవండి: దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..! ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ స్ధానానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పచ్చ పార్టీకి అభ్యర్ధులే దొరకడంలేదట. గత ఎన్నికల్లో టీడీపీ తరపున చలమల శెట్టి సునీల్ పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో టీడీపీలో పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్ధి కరువయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు అభ్యర్ధిగా టీడీపీ నుండి పోటీ బరిలోకి దిగుతారని గతంలో ప్రచారం జరిగింది. కాని తనకు అసెంబ్లీ స్ధానం చాలని.. పార్లమెంటు స్ధానం వద్దని రాజప్ప నిర్ణయం తీసుకున్నారట. పైసలుంటేనే బాబు టికెట్లిస్తారట.! రాజప్ప వద్దనడంతో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ ను దింపుతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం నవీన్ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ ఏరియా అధ్యక్షుడుగా ఉన్నారు. అందువల్ల ఈ ప్రతిపాదనను చంద్రబాబు వద్ద ఉంచారట. ఐతే ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయాలంటే కనీసం రూ.50 కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తన వద్ద డబ్బు లేక పోయినా... ప్రజా బలం ఉందని నవీన్ చెప్పారట. కాని వచ్చే ఎన్నికల్లో ప్రజాబలం కాకుండా ధన బలంతోనే పనవుతుందని చెప్పిన చంద్రబాబు.. నవీన్ ప్రతిపాదనను పక్కన పెట్టారని చర్చ నడుస్తోంది. ఆ తరువాత ప్రత్తిపాడు టిడిపి నేత వరుపుల రాజా అనుకున్నప్పటికీ.. ఆయన కూడా ప్రత్తిపాడు అసెంబ్లీ సీటుకే పరిమితమవుతానని చెప్పారట. ఒక నేతను చంద్రబాబు వద్దంటే..మరొకరు తానే వద్దనడంతో ఇంకో అభ్యర్థి కోసం వెతుకులాట మొదలైంది. ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్.? ప్రజాబలం ఎలాగూ లేదు.. డబ్బుంటే చాలని చంద్రబాబు చెప్పడంతో ఇద్దరు సీనియర్ నేతలకు సాన సతీష్ బాబు పేరు మదిలో మెదిలింది. కొంత కాలం క్రిందట మనీలాండరింగ్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసిన సతీష్ బాబు ఐతే వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసేందుకు వెనుకాడడని ఆ సీనియర్లు భావించారు. దీంతో సాన సతీష్ బాబు పేరును చంద్రబాబు చెవిలో వేశారట. ఆ పేరు విని ఉలిక్కి పడ్డ చంద్రబాబు.. అతని పేరును అలానే హోల్డ్ లో ఉంచండి.. ఎన్నికలు సమీపించినప్పుడు చూద్దామని తనకు ఆ పేరు చెప్పిన సీనియర్ నేతలతో చెప్పారట. సతీష్ పేరును హోల్డ్‌లో ఉంచమని చంద్రబాబు ఎందుకో చెప్పారో అని సీనియర్ నేతలు ఆలోచిస్తే.. అసలు కథేంటో వారికి తర్వాత అర్ధమైందట. మాకొక అభ్యర్థి కావలెను.? వచ్చే ఎన్నికల్లో జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటే కాకినాడ పార్లమెంటు సీటును జనసేనకు ఇవ్వాలని... ఒక వేళ బీజేపీ, జనసేన పార్టీలు రెండింటితోను పొత్తు పెట్టుకుంటే కాకినాడ పార్లమెంటు సీటును బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశారట. కాని ఇటీవల విశాఖ వేదికగా జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు టీడీపీని ఒంటరి చేశాయనే సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంటు సీటు కోసం అభ్యర్ధిని వెతికే పనిలో పడ్డారు జిల్లా నేతలు. సతీష్‌ను బరిలో దింపితే వర్కవుట్ కాదని పార్టీలో మరి కొందరి వాదన. అయితే డబ్బు బాగా ఖర్చుచేసే అభ్యర్థి కావాలని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు కాకినాడ పార్లమెంటు స్ధానానికి టీడీపీకి అభ్యర్ధి దొరికడం కష్టంగా మారిందని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
జ్యోతుల వెలుగుకు తోట చెక్
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కొన్నాళ్లుగా అనా రోగ్యంతో బాధపడుతున్న ఎంపీ తోట నరసిం హం తెరపైకి వచ్చారు. తన కేడర్‌ను ఇబ్బందులు పెడుతూ అష్టకష్టాలకు గురి చేస్తున్న జంప్ జిలా నీ, ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను లక్ష్యంగా చేసుకొని రాజకీయ చదరంగానికి పావులు కదుపుతున్నారు. అనారోగ్యంతో ఎంపీగా పోటీ చేయలేనంటూనే గతంలో రెండుసార్లు గెలిచిన జగ్గంపేట అసెంబ్లీ స్థానాన్ని తన సతీమణికి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో జగ్గంపేట అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. ‘తోట’ అనుచరులకు అడుగడుగునా చెక్ జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యే, ఎన్నికై గత ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలతో కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ లో టీడీపీ నేతగా కొనసాగారు. అయితే, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, పార్టీ ఫిరా యించిన జ్యోతుల నెహ్రూ రాకతో నియోజకవర్గంలో ఎంపీ తోట జోరుకు అధిష్టానం అడ్డుకట్ట వేసింది. జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడమే తరువాయి తోట కేడర్‌ను టార్గెట్ చేసి, వారికి ఏ విధమైన పనులు దక్కకుండా చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సమావేశాలకు, అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా అవమాన పరిచిన ఘటనలున్నాయి. చెప్పాలంటే తోట నరసింహం కేడర్‌ను నిర్వీర్యం చేసేందుకు జ్యోతుల నెహ్రూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తోటకు అనుచరులే లేకుండా చేసేందుకు పన్నాగం పన్నారు. రాజకీయంగా వేధించడమే కాకుండా నరసింహం అరోగ్యంపై పుకార్లు పుట్టించి గందరగోళం సృష్టించడంలో జ్యోతుల వర్గం హస్తం ఉందన్న అనుమానం ఉంది. దీంతో ఒకానొక సందర్భంలో తన కేడర్‌కు ‘నేనున్నాంటూ’ భరోసా ఇవ్వడమే కాకుండా తన ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఎంపీ నరసింహానికి ఏర్పడింది. పాత పరిచయాలతో పితలాటకం... తనకున్న కేడర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాగైనా జగ్గంపేట నుంచి బరిలోకి దిగాలని ఎంపీ తోట ఫ్యామిలీ నిర్ణయించుకున్నారు. అనారోగ్యం కారణంగా బరిలోకి దిగలేనందున తన సతీమణి వాణిని పోటీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. మంగళవారం తన కుటుంబమంతా అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. తన సతీమణి వాణికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ భేటీ అనంతరం బయటికొచ్చిన ఎంపీ నరసింహం ‘ఇక తేల్చాల్సింది చంద్రబాబే’ అని చెప్పుకొచ్చారు. జంప్ జిలానీకి షాక్ ... గెలిపించిన పార్టీని మోసం చేసి స్వప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లిన జ్యోతుల నెహ్రూకు షాక్ తగిలినట్టయింది. జగ్గంపేట టిక్కెట్‌ను తోట తన సతీమణికి కోరడంతో టీడీపీ అధిష్టానం కూడా ఇరకాటంలో పడినట్టయింది. గడిచిన ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన ఎంపీ తోట వెనుక ఉండాలా? ఇప్పటికే తనదే సీటు అని నియోజకవర్గంలో పర్యటిస్తున్న జ్యోతుల నెహ్రూ వెనుక తిరిగాలా...?అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. -
ఎమ్మెల్యే జోతుల నెహ్రూకు చేదు అనుభవం
-
అన్నింటా విఫలమైనందుకే అవిశ్వాసం
♦ వైఎస్సార్సీపీ ఉప నేత జ్యోతుల నెహ్రూ స్పష్టీకరణ ♦ విపక్షనేతపై టీడీపీ ఎమ్మెల్యేల దూషణలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యమైన విధానాలతో అన్నింటా విఫలమైనందునే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు వైఎస్సార్సీపీ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. టీడీపీ సర్కారుపై సోమవారం ఆయన అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయన ప్రారంభించి, చర్చకు అంగీకరించినందుకు ధన్యవాదాలంటూ ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు. వాస్తవాలను చర్చించి తమ తీర్మానానికి మద్దతు పలకాలని సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై చర్చను విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించేందుకు స్పీకర్ అనుమతితో పైకిలేచారు. అయితే అవిశ్వాస తీర్మానం నోటీసు, తీర్మానానికి మద్దతు ఇచ్చిన వారి సంతకాల్లో పేరు లేనివారు చర్చను ప్రారంభించడానికి వీలుకాదంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు రూల్ 49ని తెరపైకి తేవడం ద్వారా విపక్ష నేతను అడ్డుకున్నారు. అయితే వేరేవారు చర్చను ప్రారంభిం చిన తర్వాత జగన్మోహన్రెడ్డి ప్రసంగించడానికి తమకు అభ్యం తరం లేదన్నారు. దీంతో జ్యోతుల నెహ్రూ ఈ తీర్మానంపై చర్చను ఆరంభించి తదుపరి అవకాశాన్ని తమ నేత వైఎస్ జగన్‌కు ఇవ్వాలని కోరారు. వెంటనే మంత్రి యనమల లేచి విపక్ష సభ్యుడు ఒకరు మాట్లాడగానే అధికార పక్ష సభ్యులకు ఇద్దరికి అవకాశమివ్వాలని, తర్వాతే మళ్లీ విపక్షానికి అవకాశం ఇవ్వాలంటూ మరో రూల్‌ను కోట్ చేశారు. తదుపరి టీడీపీ ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్, బోండా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. వారిద్దరూ తమ ప్రసంగాల్లో ప్రభుత్వం చేసిన పనులు చెప్పడం కంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై దూషణలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. విపక్షనేత, రాజశేఖరరెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. రాజధానిలో టీడీపీ నేతల భూ దందా గురించి వార్తలు రాసిన ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయండి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి ఎన్నికై అనైతికంగా టీడీపీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం కోరింది. ఈమేరకు వైఎస్సార్సీపీ విప్ ఎన్.అమరనాథ్‌రెడ్డి శనివా రం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి అమరనాథ్‌రెడ్డి ఉదయం 11 గంటల ప్రాంతంలో స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఎమ్మెల్యేలు ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన వారు ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హులని వివరించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గుర్తుపై ఎన్నికైన ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, తిరువీధి జయరాములు, కలమట వెంకటరమణ, మణి గాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారని తెలిపారు. 1986, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారు మరో పార్టీలో చేరితే అనర్హులవుతారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని 2(1) ప్రకారం-191 (2) అధికరణను అనుసరించి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియమాల్లోని 6వ నిబంధన (ఫిరాయిస్తే అనర్హులుగా ప్రకటించడం) మేరకు ఈ ఫిర్యాదు చేశారు. ఫిరాయించిన వారికి ముఖ్యమంత్రి టీడీపీ కండువాలు కప్పడం, పత్రికల క్లిప్పింగ్‌లు, టీడీపీలో చేరినట్లు మీడియా ఎదుట ఎమ్మెల్యేలు ప్రకటించిన వీడియో క్లిప్పింగ్‌లతో పాటు రెండు లేఖలను స్పీకర్‌కు అందజేశారు. తమనోటీసు ఆధారంగా అనర్హతపై త్వరగా నిర్ణయం ప్రకటించాలని స్పీకర్‌ను కోరగా... ‘మీరిప్పుడే కదా నోటీసు ఇచ్చారు. పరిశీలిస్తా’ అని బదులిచ్చారు. రెండు అవిశ్వాస తీర్మానాలపై పరిశీలన! స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన తొలు త తమకు ఉన్నప్పటికీ ఒకే సమావేశాల్లో రెండు అవిశ్వాస తీర్మానాలు పెట్టవచ్చా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తున్నామన్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్పీకర్ కన్నా ముందుగా ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరిస్తే అవిశ్వాసం పెట్టే అవసరం కలుగకపోవచ్చన్నారు. అలా కాకపోతే అపుడు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్పీకర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కళత్తూరు నారాయణస్వామి, కిలివేటి సంజీవయ్య, ముత్తిరేవుల సునీల్, వరుపుల సుబ్బారావు, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, యక్కలదేవి ఐజయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి ఉన్నారు. నోటీసును స్వీకరించిన స్పీకర్ దానిని అసెంబ్లీ కార్యదర్శి కె.సత్యనారాయణకు ఇచ్చి అందినట్లు ధ్రువీకరించాల్సిందిగా ఆదేశించారు. స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించాలి: జ్యోతుల ఎమ్మెల్యేల ఫిరాయింపునకు సంబంధించి తాము అన్ని సాక్ష్యాధారాలు స్పీకర్‌కు ఇచ్చామని జ్యోతుల నెహ్రూ తెలిపారు. స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలు మరొకరు చేయరన్నారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఆయన అమరనాథ్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో కలసి మీడియాతో మాట్లాడారు. తామిచ్చిన నోటీసుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుంటే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబుకు చెంప పెట్టు అవుతుందన్నారు. అనర్హులైన వారి స్థానాలన్నీ ఖాళీ అయితే ఉప ఎన్నికలొస్తాయన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజల తీర్పును బట్టి వారి మనోభావాలేమిటో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. -
రోజాపై చర్యల విషయంలో అంత తొందరెందుకు
♦ ప్రివిలేజ్ కమిటీలో ప్రశ్నించిన జ్యోతుల ♦ రోజా అభిప్రాయం తెలుసుకోవాలని కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై చర్య తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆక్షేపించారు. శుక్రవారం ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. శీతాకాల సమావేశాల్లో పరిణామాలపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ కమిటీ నివేదిక ఈ సమావేశం ముందుకు వచ్చింది. ఎజెండాలో చేర్చేందుకు అసెంబ్లీ అధికారులు ప్రయత్నించగా జ్యోతుల అభ్యంతరం వ్యక్తం చేశారు.హడావిడిగా రోజా అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో ఈ నెల 8న మరోసారి సమావేశమై చర్చించాలని, రోజాను సమావేశానికి పిలిచి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కమిటీ నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెలపై గతంలో రోజా చేసిన వ్యాఖ్యల మీద నోటీస్ ఇచ్చిన చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారం తన వాదన వినిపించారు. -
మాట తప్పడంలో మేటి
► సెజ్’పై హామీలకు చెల్లుచీటీ చంద్రబాబుపై జ్యోతుల ఆక్షేపణ సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నికలకు ముందు ఒకలా చెప్పి, తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరించడంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని మించినవారు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. సెజ్ భూముల్లో ఏరువాక సాగినప్పుడు, కాకినాడలో సెజ్ వ్యతిరేక సభలో ప్రకటనలు చేసి.. వాటిని మరచిపోవడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పలువురు సెజ్ రైతులు సోమవారం మధ్యాహ్నం కాకినాడలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో నెహ్రూను కలిశారు. సెజ్ కోసం భూములిచ్చిన తమకు ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరిగేలా చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన..రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. సర్కారు తీరు డొంకతిరుగుడు.. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు నెహ్రూ సమాధానమిస్తూ.. ప్రభుత్వం ద్వంద్వ వైఖరివల్లే సెజ్ రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి రాతపూర్వకంగా సమాధానం కోరితే డొంకతిరుగుడుగా వచ్చిందని వెల్లడించారు. ‘సెజ్‌కోసం సేకరించిన భూముల రైతులకు సదరు భూమిలోని ప్రతి సెంటును తిరిగి ఇచ్చేయడం ద్వారా.. సేకరించిన భూముల్లో సేద్యం జరిగేటట్లు చూడడమవుతుందని’ 2012 ఏప్రిల్ 21న అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటన చేశారా? అయితే ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకోవడమైందా? అయితే భూములను తిరిగి పొందిన రైతులు ఎంతమంది? అలా రైతులకు తిరిగి ఇచ్చేసిన భూవిస్తీర్ణం ఎంత? లేకపోతే ఎప్పటిలోగా సదరు భూములను రైతులకు తిరిగి ఇచ్చివేస్తారు?’ అని సభలో రాతపూర్వకంగా సమాధానం కోరినట్లు చెప్పారు. దీనికి ‘21-04-2012న సభలో అప్పటి విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎటువంటి ప్రకటనా చేయలేదు’ అని ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందన్నారు. తాము అడిగిన మిగతా మూడు ప్రశ్నలకు ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అనే సమాధానం వచ్చిందన్నారు. జ్యోతులతో పాటు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు గుత్తుల సాయి, అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జంపన సీతారామచంద్రవర్మ, ఫ్రూటీ కుమార్, శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి తదితరులు ఉన్నారు. -
‘ కాల్‌మనీ’పై సర్కారును నిలదీద్దాం
-
దమ్ముంటే జగన్ దీక్షను అడ్డుకోండి: జ్యోతుల
చేతనైతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తలపెట్టిన దీక్షను అడ్డుకోవాలని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత దీక్ష తలపెట్టారని... ఆయన తెలిపారు. దీక్షను భగ్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించటం మానుకోవాలని హితవు చెప్పారు. గండేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన జగ్గంపేట నియోజకవర్గ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిని యువభేరి సదస్సులో పాల్గొన్నారనే నెపంతో ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వర్సిటీ అధికారులు అధికార టీడీపీకి వత్తాసు పలకటం మానుకోవాలని సూచించారు. -
ఏ నిబంధనల ప్రకారం తొలగించారు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ లాబీల్లో ఉన్న దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో తొలగింపుపై విపక్ష వైఎస్సార్సీపీ భగ్గుమంది. ఏ నిబంధనల ప్రకారం ఫొటోను తొలగించారని నిలదీసింది. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. రైతుల ఆత్మహత్యలు, తాగునీటి ఎద్దడి మీద ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించి, ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దివంగత నేత వైఎస్సార్ ఫొటోలను ప్రదర్శిస్తూ ఆ పార్టీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరనస వ్యక్తం చేశారు. వైఎస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. వ్యక్తిగత ఇష్టాఇష్టాలను సభలో ప్రతిబింబించకూడదని, ఫొటోల ప్రదర్శనను ఉపసంహరించుకోవాలని స్పీకర్ సూచించారు. అందుకు విపక్ష సభ్యులు అంగీకరించలేదు.చివరకు వైఎస్సార్సీపీ ఉప నేత జ్యోతుల నెహ్రూకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలంతా మానవతావాదిగా గుర్తించిన వైఎస్... అని ఆయన కొనసాగిస్తుండగా మైక్ కట్ చేశారు. ‘‘కరువు మీద వాయిదా తీర్మానం ఇచ్చారు. వైఎస్‌పై మాట్లాడేందుకు కాదు. తగిన రూపంలో నోటీస్ ఇచ్చి మాట్లాడితే అభ్యంతరం లేదు’’ అని స్పీకర్ తెలిపారు. ‘‘ఆ మహనీయుడి దారిలో నడిచి ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చేవే కాదు. వైఎస్సార్ ఫోటోను అసెంబ్లీ లాబీల్లో నుంచి తొలగించడం ఆవేదనకు గురి చేసింది’’ అని జ్యోతుల స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫొటో తొలగింపులో నిబంధనలు ఉల్లంఘించలేదని స్పీకర్ సమాధానం ఇచ్చారు.తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు వైఎస్ ఫొటోలు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. దీంతో 10 నిమిషాలపాటు సభ వాయిదా పడింది. జీరో అవర్‌లోనూ.. : ప్రశ్నోత్తరాల తర్వాత మొదలైన జీరో అవర్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీల్లో ఎవరో వైఎస్సార్ ఫొటోలు అంటించారని, వారి మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ.. అసెంబ్లీ లాంజ్‌లో ఉన్న వైఎస్సా ర్ ఫొటోను తీసేయడానికి ఏ నిబంధనలు అనుమతించాయని ప్రశ్నించారు. గత శాసనసభ ఆమోదం, అప్పటి స్పీకర్ నిర్ణయంతో ఏర్పాటు చేసిన ఫోటోను ఎలా తొలగిస్తారన్నా రు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా లాంజ్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించామని వెల్లడించారు. స్పీకర్ జోక్యం చేసుకొని.. ఫొటో తొలగింపు నేపథ్యం వివరించారు. లాంజ్‌లో ఫొటో పెట్టాలంటే సభ ఆమోదం, జనరల్ పర్పస్ కమిటీ తీర్మానం ఉండాలన్నారు. కమిటీ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామనీ తెలిపారు. అసెంబ్లీ లాంజ్‌లో ఎమ్మెల్యేల నివాళి అసెంబ్లీలో నిరసన తెలిపి బయటకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలందరూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలను చేతబట్టుకుని అసెంబ్లీ లాబీల్లో నుంచి లాంజ్‌కు వెళ్లారు. ఎక్కడి నుంచైతే వైఎస్సార్ ఫొటోను తొలగించారో అదే ప్రదేశంలో ఒక ఫొటోను అతికించారు. ఆ తరువాత ఒక బల్లపై వైఎస్సార్ ఫొటోను పెట్టి ఆయనకు పూలు చల్లి నివాళులర్పించారు. -
ఆర్థిక స్థితి బాగా లేదంటూ విహారయాత్రలేంటి?
⇒ ఎమ్మెల్యేల్ని పర్యటనకు తీసుకెళతామనడంపై జ్యోతుల అభ్యంతరం ⇒ ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పాల్గొనరని స్పష్టీకరణ ⇒ ఆ డబ్బుతో అసెంబ్లీ సమావేశాల్ని మరిన్ని రోజులు జరుపుకుందాం ⇒ ప్రత్యేక హోదా, రాజధానికి తరలింపు వంటి సమస్యలెన్నో ఉన్నాయి ⇒ వాటిపై చర్చకు 20 రోజులైనా సమావేశాలు జరగాల్సిన అవసరముంది సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలందరినీ మూడు రోజులపాటు శ్రీహరికోట, కృష్ణపట్నం, తిరుపతికి తీసుకెళ్తామన్న శాసనసభ స్పీకర్ ఆహ్వానాన్ని తమ పార్టీ తిరస్కరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నప్పుడు బాధ్యతగల ఎమ్మెల్యే స్థాయిలో ఇలాంటి విహారయాత్రలో పాల్గొనడం మంచిది కాదన్నది తమ పార్టీ అభిప్రాయమని, అందుకే ఆ పర్యటనకు పార్టీ ఎమ్మెల్యేలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జ్యోతుల విలేకరులతో మాట్లాడారు. విహారయాత్రల పేరుతో వృథాచేసే ఇలాంటి డబ్బులతో శాసనసభ సమావేశాల్ని మరిన్ని రోజులు పొడిగించుకుని.. ప్రజాసమస్యలపై చర్చించుకుందామని సూచించారు. వర్షాకాల సమావేశాల్ని ఐదురోజులకు కుదించాలని ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తోందని, కనీసం 20 రోజులైనా సమావేశాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆయన కోరారు. చర్చించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి.. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం అనేక సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ.. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, నీటివసతి ఉన్నచోటా పంటలు వేసుకునేందుకు రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నెహ్రూ గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పుష్కరాలపై చర్చ ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రకటించారని.. దీనికితోడు విభజన తరువాత రాష్ట్రానికి కేంద్రప్రభుత్వ సహకారం వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ఇపుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోందని.. గతంలోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ అంశంపై శాసనసభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని సూచించారని గుర్తుచేశారు. రాష్ట్ర రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించిన అంశంపైనా చర్చించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి వెంటనే కార్యాలయాల తరలింపు వల్ల ప్రయోజనమా? లేదంటే పదేళ్లపాటు హక్కున్న నేపథ్యంలో ఏ మేరకు తరలింపు ఉండాలన్న దానిపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసుతో రాష్ట్ర పరువు తీవ్రంగా దెబ్బతిందంటూ.. దీనిపై చర్చ జరగాలన్నారు. ఇలాంటి కీలక అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిన నేపథ్యంలో సమావేశాల్ని నామమాత్రంగా నిర్వహించి, ఎమ్మెల్యేల విహారయాత్రలకు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. సమావేశాల్ని 20 రోజులపాటైనా నిర్వహించాలన్నారు. ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలపై శాసనసభ వేదికపై సమగ్ర చర్చ జరగాలని తమ పార్టీ కోరుకుంటుందని జ్యోతుల నెహ్రూ పేర్కొంటూ.. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించని పరిస్థితుల్లో స్పీకర్ విజ్ఞతతో ఆలోచించి ఈ పర్యటనను రద్దు చేయాలని కోరారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ యాత్రను బహిష్కరించితే మంచిదన్నారు. -
రైతు ఆత్మహత్యలకు బాధ్యత బాబుదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు సీఎం చంద్రబాబునాయుడే పూర్తి నైతిక బాధ్యత వహించాలని వైఎస్సార్సీఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు 2014 ఎన్నికలకు ఏడాదిన్నర ముందునుంచే అణాపైసలతోసహా రైతుల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నమ్మిన రైతులు మోసపోయారని, అప్పులు పుట్టక.. వ్యవసాయం చేసుకోలేక సర్వస్వం కోల్పోయి, సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వీరి ఆత్మహత్యలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమన్నారు. రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జోక్యం చేసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో సీఎం దృష్టికి తెస్తే లేదని తొలుత బుకాయించారు. జగన్ అనంతపురంజిల్లాలో రైతు భరోసాయాత్ర చేపడుతున్నారని తెలిశాక రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. తాజాగా రైతు కుటుంబాలకు రూ.ఒకటిన్నర లక్షలే ఇవ్వాలని జీవో విడుదల చేశారు’’ అని నెహ్రూ మండిపడ్డారు. అందుకే ఇది కత్తిరింపుల ప్రభుత్వమని తాము చెబుతున్నామన్నారు. హామీలపై సమీక్షించుకోండి.. చంద్రబాబు సీఎం అయ్యాక ఇప్పటిదాకా జరిగిన మూడు అసెంబ్లీ సమావేశాల్లో కొనసాగిన చర్చల ఫలితంగా సర్కారు కొన్ని హామీలిచ్చిందని, వాటిని ఏమేరకు నెరవేర్చారో సమీక్షించుకుని పూర్తిచేయాలని నెహ్రూ సూచించారు. రెండు విడతలుగా రుణమాఫీ చేశామని, మూడోవిడత మాఫీకి సంబంధించిన రుణాలమొత్తాన్ని విడుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ ఆచరణలో అలాంటి పరిస్థితి లేదని స్పష్టంచేశారు. బ్యాంకులకెళ్లి ఆరాతీస్తే రైతులు బాకీఉన్న రుణాలకు, ప్రభుత్వంనుంచి విడుదలైన మొత్తానికి పొంతనే లేదన్నారు. ఇక సామాజిక పింఛన్లలో ఏకంగా పది లక్షలమందికి ఎగనామం పెట్టారన్నారు. వైఎస్ చిత్రపటం తొలగించడం సరికాదు.. శాసనసభ లాంజ్నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించడం సరికాదని జ్యోతుల విమర్శించారు. పదవిలో ఉంటూ మృతిచెందిన ముఖ్యమంత్రి వైఎస్ ఒక్కరే కనుక ఆయన చిత్రపటాన్ని పెడుతున్నట్లు అప్పట్లో స్పీకర్ ప్రకటించారని, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటి స్పీకర్ చేయడం సరికాదని సూచించారు. రిషితేశ్వరి మరణంపై వాస్తవాలను తెలుసుకోవడానికి ఆగస్టు 6న తమపార్టీ ఎమ్మెల్యేలు నాగార్జున యూనివర్సిటీకి వెళుతున్నారని ఆయన తెలిపారు. -
పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం
వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆది నుంచీ ఆర్భాటాలకు పోయిన చంద్రబాబు ప్రభుత్వం.. చివరకు ఈ మహాపర్వం ఏర్పాట్లలో విఫలమై అప్రతిష్టను మూట కట్టుకుందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. వీఐపీ ఘాట్‌లో శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పుష్కర స్నానమాచరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పుష్కరాల నిర్వహణ తీరు ఉందన్నారు. తొలి రోజు ప్రభుత్వపరమైన తప్పిదం కారణంగా 27 మంది మృతి చెందిన తరువాత.. చేసిన తప్పు తెలుసుకుని ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ జాగ్రత్తలు ముందుగానే తీసుకుని ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. పిండప్రదానాలు చేసిన జ్యోతుల తొలుత జ్యోతుల నెహ్రూ తన భార్య మణి, కుమారుడు, జెడ్పీ ప్రతిపక్షనేత నవీన్, కోడలు లక్ష్మీదేవి, కుమార్తె సునీత, అల్లుడు తోట సర్వారాయుడుతోపాటు మనవడు, మనవరాళ్లతో కలసి పుష్కర స్నానమాచరించారు. అనంతరం తన పూర్వీకులకు గోదావరి చెంతన పిండప్రదానం నిర్వహించారు. తొలుత వీఐపీ ఘాట్ ముఖద్వారం వద్ద జ్యోతులను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చందు హనుమంతరావు స్వాగతం పలికారు. నెహ్రూ గోదావరిలో స్నానమాచరించిన సమయంలోనే వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు కూడా పుష్కర స్నానమాచరించారు. -
న్యాయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతాం
-
న్యాయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతాం
అవసరమైతే రాష్ట్రవాప్తంగా ఉద్యమిస్తాం కోరుమిల్లి డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ సీపీ భరోసా అధికారపార్టీ ఆగడాలపై మండిపడ్డ జ్యోతుల, బోస్ పోలీసులు కొట్టరానిచోట కొట్టారని ఆక్రోశించిన బాధితులు మండపేట :కోరుమిల్లిలో శనివారం పోలీసులు జరిపిన దౌర్జన్యకాండలో బాధితులైన డ్వాక్రా మహిళలకు న్యాయం జరిగేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ భరోసానిచ్చింది. వారి హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. నిబంధనల మేరకు ర్యాంపు రాబడిలో పావలా వాటా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేసి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీఐటీయూ నాయకులతో పాటు 25 మంది మహిళలను అరెస్టు చేసిన ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆదివారం కోరుమిల్లిలో బాధిత మహిళలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ఉద్యమానికి నేతృత్వం వహించిన సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. పోలీసుల దురాగతాన్ని బాధిత మహిళలు వివరించారు. జీఓ ప్రకారం తమ వాటా ఇవ్వమని అడిగినందుకు వృద్ధులు, మహిళలు అని కూడా చూడలేదని, కొట్టరాని చోట కొడుతూ ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారని, అసభ్యపదజాలంతో దూషించారని వాపోయారు. సుంకర వీరబాబు అనే యువకుడిని కాళ్లపై బొబ్బలు వచ్చేలా కొవ్వొత్తులు, సిగరెట్లతో కాల్చిన తీరును వివరించారు. అధికారపార్టీ నేతలకు అండగా పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమాలను స్థానిక ప్రముఖుడు వేగుళ్ల లీలాకృష్ణ వివరించారు. ఖాకీల క్రౌర్యంపై జ్యోతుల తీవ్రంగా స్పందించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోరుమిల్లి డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేందుకు జిల్లా పార్టీ నాయకత్వం అంతా తరలివచ్చామన్నారు. శనివారం ఉన్నతాధికారులతో మాట్లాడి అందరినీ విడుదల చేసేలా కృషి చేశామన్నారు. వారికి నూరుశాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చేతకాని వాడిచేతికి దండం ఇచ్చినట్టు ఈ జిల్లాకు చెందిన వ్యక్తికి ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తే మహిళలకు రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో నీతిమంతుడిగా స్థానిక ఎమ్మెల్యేపై నమ్మకం ఉండేదని, ఈ ఘటనతో దాన్ని వదులుకున్నానన్నారు. వేధింపు చర్యలతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే డ్వాక్రా మహిళల పక్షాన రాష్ట్రవాప్తంగా ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలిచిన పార్టీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి, నియోజకవర్గ కోఆర్డినేటర్ పట్టాభి, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, స్థానిక నాయకుడు వేగుళ్ల లీలాకృష్ణ, ఉద్యమానికి అండగా నిలిచిన కె.కృష్ణవేణిలను జ్యోతుల అభినందించారు. మహిళలకు న్యాయం జరిగేంత వరకు అండగా పోరాటం చేస్తామన్నారు. రాష్ర్తమంతటా టీడీపీ నేతల ఇసుక మాఫియూ.. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బోస్ మాట్లాడుతూ జీఓలో పేర్కొన్న ప్రకారం పావలా వాటా డ్వాక్రా మహిళలకు ఇవ్వాలన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా అక్రమ వ్యాపారం చేస్తున్నారన్నారు. అక్రమ వ్యాపారంపై సమరానికి కోరుమిల్లి నాంది పలికిందన్నారు. ప్రభుత్వం కల్పించిన హక్కును అమలు చేయాలని ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కోరుమిల్లి మహిళల పోరాటం ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తుందన్నారు. పట్టాభిరామయ్య చౌదరి మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, ప్రచారసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. వేగుళ్ల లీలాకృష్ణ నియోజకవర్గంలోని ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలను వివరించారు. సీఐటీయూ నాయకులు డి.శేషుబాబ్జీ, కె.కృష్ణవేణి మాట్లాడుతూ బాధిత మహిళలకు అండగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. ఇసుక మాఫియాగా ఏర్పడి అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమాలు, పోలీసుల దురాగతాలపై స్థానిక డ్వాక్రా మహిళలు, సీఐటీయూ నాయకులు జ్యోతులకు వినతిపత్రం అందజేశారు. పార్టీ అనపర్తి, ముమ్మిడివరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి, గుత్తుల సాయి, గిరజాల వెంకటస్వామినాయుడు, ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు, సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, సత్తి వెంకటరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాసరావు, పెట్టా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కొవ్వూరి త్రినాథరెడ్డి, శెట్టిబత్తుల రాజుబాబు, యనమదల గీతా మురళీకృష్ణ, సూరంపూడి సత్యప్రసాద్, వల్లూరి రామకృష్ణ, మేడిశెట్టి సూర్యభాస్కరరావు, శీలం గోవిందు, పిల్లా వీరబాబు, ముమ్మిడివరపు బాపిరాజు, అన్నందేవుల చంద్రరావు, తుపాకుల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘తప్పు’కునే తిప్పలతో.. కుప్పకూలిన పాలన
కాకినాడ : ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదని, కృష్ణాజలాల కేటాయింపు లో నోరు మెదడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అన్ని ప్రధాన సమస్యల్నీ గాలికి వదలడం వల్ల 23 రోజులుగా రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిందన్నారు. స్థానిక భాస్కర బిల్డింగ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నోట్లతో ఎమ్మెల్యేలను కొనే వ్యవహారంలో దొరికిపోయిన చంద్రబాబు స్వీయరక్షణలో పడడంతో పాలన కుప్పకూలిపోయిందన్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా విత్తనాలందక, రుణాలు రాక రైతులు విలవిలలాడే పరిస్థితి నెలకొందన్నారు. మేలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి వార్షిక రుణప్రణాళికను ఖరారు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ ప్రయత్నమే లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణాలు రద్దు కాక, కొత్త అప్పులు పుట్టక, పెట్టుబడులు దొరక్క రైతులకు దిక్కుతోచడం లేదన్నారు. వైఎస్‌లా ఆదుకోవాలి.. కేంద్రం మొక్కుబడిగా వరికి రూ.50 గిట్టుబాటు ధర ప్రకటించినా చంద్రబాబు మిన్నకుండిపోయారని జ్యోతుల విమర్శించారు. ఒకప్పుడు కేంద్రం మద్దతుధరను ఆశించినట్టు పెంచకపోతే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రం తరఫున మరో రూ.50 ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం కూడా అదే రీతిలో ప్రస్తుతం రైతుల అవస్థలను గుర్తించి రూ.200 అదనంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడో నిర్ణయించిన నీటి కేటాయింపులను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కృష్ణాజలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎప్పుడో అంతరించిన బచావత్ అవార్డు ప్రకారం నీటి పంపిణీ వల్ల భవిష్యత్‌లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రధాన సమస్యలపై ప్రజలకు అండగా తమ పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు గురువారం ఉదయం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్టు చెప్పారు. ఇటీవలి తుపాను కారణంగా మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. హుదూద్ తుపాన్ వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.ఐదులక్షలు ఇచ్చి, ఇప్పుడు రూ.లక్ష ఎందుకు కోత విధించారని ప్రశ్నించారు. వీరికి కూడా రూ.ఐదులక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా ఏర్పాట్ల పరిశీలన కాగా గురువారం తలపెట్టిన ధర్నా ఏర్పాట్లను జ్యోతుల పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే పార్టీ శ్రేణులు, రైతుల కోసం కలెక్టరేట్ వద్ద కల్పించాల్సిన సదుపాయాలు, మైక్, టెంట్లు తదితర అంశాలపై పార్టీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్‌తో చర్చించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, జిల్లా అధికార ప్రతినిధి కె.ఆదిత్యకుమార్, రాష్ట్ర కార్యదర్శులు జి.వి.రమణ, కాలా లక్ష్మణరావు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు భూపాలపట్నం ప్రసాద్, వరసాల జాన్ ప్రభాకర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి జోగా రాజు తదితరులు ఉన్నారు. -
‘ఓటుకు కోట్లు’తో ఏపీ ప్రభుత్వానికేం సంబంధం?
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో నారా చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక నీతిబాహ్యమైన చర్యలో ఇరుక్కుంటే దాన్నుంచి ఆయనను పరిరక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ప్రయత్నం చేస్తుందని వైఎస్సార్‌కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రశ్నించింది. పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసుకీ, ఏపీ ప్రభుత్వానికీ సంబంధం ఏంటి? ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కాపాడడానికా? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కాపాడడానికా? ప్రభుత్వ యం త్రాంగం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సీఎంపై కేసు రాలేదే’’ అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పక్క రాష్ట్రంలో చేసిన నీతి బాహ్యమైన చర్యపై కేసు, విచారణ జరుగుతున్నాయని చెప్పారు. పార్టీ అధ్యక్షుడుగా బాబు వ్యక్తిగతంగా నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక సాధారణ వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి మత్తయ్య కోసం గవర్నర్ వద్దకు రాష్ట్ర డీజీపీనే రిప్రజెంటేషన్ తీసుకెళ్లే పరిస్థితితో రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ దిగిజారిపోయిందన్న భావన ఏర్పడిందన్నారు. నోటీసులు అందుకున్న తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేకు ఏపీలో రహస్యంగా వైద్య పరీక్షలు చేయించే పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 15 రోజులుగా పరిపాలనే స్తంభించి పోయిందని.. ప్రభుత్వం చేయాల్సిన పనిచేయకుండా చంద్రబాబు అనే అవినీతిపరుడ్ని, నీతిబాహ్యమైన చర్యకు పాల్పడిన వ్యక్తిని పరిరక్షించడానికే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని ఆరోపించారు. డీజీపీ, సీఎస్‌లు దీనిపై యోచించాలన్నారు. -
ఉప్పొంగిన ఉత్తేజం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. ముఖ్య నేతల ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాయి. రాష్ట్రంలో తొలిసారి పార్టీ జిల్లా కమిటీతో పాటు, రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలందరితో ఒకేసారి ప్రమాణస్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించిన ప్రత్యేకత తూర్పు గోదావరి జిల్లాకు దక్కింది. కాకినాడ సూర్యకళామందిరంలో శుక్రవారం ఉదయం నుంచి పొద్దుపోయే వరకు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం, పార్టీ పదవులు పొందిన వారికి నియామకపత్రాలు, గుర్తింపుకార్డులు అందచేసే కార్యక్రమం ఆద్యంతం పండుగను తలపించి కేడర్‌కు దిశ, దశ నిర్దేశించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ బాధ్యతలు స్వీకరించాక ఏడెనిమిది నెలల కసరత్తు అనంతరం పూర్తి స్థాయి జిల్లా కమిటీకి తుది రూపమిచ్చారు. రాష్ట్ర కమిటీ, అనుబంధ కమిటీలు, జిల్లా, అనుబంధ కమిటీలకు ఎంపికైన సుమారు 500 మందికి ఒకే వేదికపై నుంచి నియామకపత్రాలు, గుర్తింపు కార్డులు ఇవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదని ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి జ్యోతులను అభినందించారు. జిల్లా నాయకత్వం క్రమశిక్షణాయుతంగా ఇంతటి కార్యక్రమంతో తూర్పు గోదావరిలో రగిల్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకునేలా అన్ని జిల్లాలకూ సమాచారం ఇస్తామని ఆయన అనడం జిల్లాకు దక్కిన గౌరవంగా పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. కార్యక్రమానికి హాజరైన ముగ్గురు ముఖ్యనేతలు ఎవరికి వారు భిన్నమైన ప్రసంగాలతో పార్టీ శ్రేణులకు భవిష్యత్‌పై భరోసాను కల్పించారు. అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసిన ‘ఓటుకు నోటు’ వ్యవహారానికి సంబంధించిన నాయకుల విమర్శలతోవైఎస్సార్ సీపీ శ్రేణుల ఉత్సాహం ఇనుమడించింది. ఉర్రూతలూగించిన అంబటి ప్రసంగం ఆద్యంతం తన సహజశైలితో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు శ్రేణులను ఉర్రూతలూగించారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోవడం గురించి, ఏడాది పాలనలో అవినీతి గురించి ఆయన చెప్పిన పిట్టకథలు, సూక్తులు కేడర్‌ను ఉత్తేజ పరిచాయి. ఏడాది కాలంలోనే టీడీపీ పాలనకు ఐదేళ్లు నిండిపోయాయనడం, దొంగ పారిపోతూ పొగగొట్టంలో ఇరుక్కుపోయినట్టు చంద్రబాబు దొంగగా ఇరుక్కుని బయటకు రాలేక, లోపల ఉండలేక కొట్టుమిట్టాడుతున్నారనడం, ఇలాంటి ఉపమానాలు అడుగడుగునా పార్టీ శ్రేణులతో కేరింతలు కొట్టించాయి. అవగాహన కల్పించిన ధర్మాన పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణం, ప్రధాన ప్రతిపక్షంగా అధికారపార్టీలో లోటుపాట్లను ఎత్తిచూపేందుకు మానవహక్కుల సంఘాలు, ఏసీబీ, సీబీఐ, విజిలెన్స్ వంటి సంస్థలను వినియోగించుకుంటూ ప్రజలకు చేరువకావాలంటూ మరో ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఇందుకు అధ్యయనం కూడా అవసరమంటూ, అందరిపైనా గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ప్రతిపక్షంగా సరిగ్గా పనిచేసినప్పుడు అధికారం ఇవ్వాలనే ఆలోచన ప్రజల్లో కలుగుతుందని చెబుతూ వారి బాధలు తమవిగా భావించాలని సూచించారు. పదవుల పంపకాల్లో పెద్దా, చిన్నా తారతమ్యమనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, నాయకత్వం తీసుకున్న వారికి ఓపిక, సహనం, అధ్యయనం అవసరమన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, జలయజ్ఞంతో పేదలకు, రైతులకు కలిగిన ప్రయోజనాలను వివరించిన విజయసాయిరెడ్డి అదే సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాట కూడా నిటబెట్టుకోలేకపోయిన వైనాన్ని ఎత్తిచూపినప్పుడు ‘వైఎస్ అమర్హ్రే, జగన్ జిందాబాద్’ అంటూ కేడర్ చేసిన నినాదాలతో హాలు మార్మోగింది. కడవరకూ క్రమశిక్షణ పాటించిన కేడర్ పార్టీ పదవులు పొందిన ప్రతి నేతకూ చివరి వరకు ఓపికగా విజయసాయిరెడ్డి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు స్వయంగా అందచేయడం, పేరు, పేరునా అందరినీ నెహ్రూ వేదికపైకి పిలవడం కేడర్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్య నేతలు ముగ్గురూ తమదైన ప్రసంగాలతో రాబోయే కాలం మనదేననే ధైర్యాన్ని నింపగలిగారు. ప్రారంభంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెహ్రూ చెప్పిన దానికి చివరి వరకు కట్టుబడి కేడర్ మొత్తం క్రమశిక్షణతో కూడిన సైనికుల్లా నిలబడటంతో కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా నలుచెరగుల నుంచి తరలివచ్చిన పార్టీ కేడర్, అభిమానులతో సమావేశానికి వేదికైన సూర్యకళామందిరం కిక్కిరిసింది. హాలులో వేసిన కుర్చీలన్నీ నిండిపోవడంతో అంతకు రెట్టింపు సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు బయటే ఉండిపోవాల్సి వచ్చినా ఓపికగా సమావేశం చివరి వరకు కదలకుండా కనిపించారు. పార్టీ పట్ల, నేతల పట్ల కేడర్‌లో ఉన్న నమ్మకానికి ఒక చక్కటి నిదర్శనంగా ప్రమాణస్వీకారోత్సవం నిలిచిందని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద గత వారం రోజులుగా సమన్వయంతో చేసిన కృషి సమావేశం విజయవంతం కావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపిందనే సంతృప్తి మిగిల్చిందని నెహ్రూ అభిప్రాయపడ్డారు. -
అపనమ్మకంతోనే విపక్షాన్ని తిడుతున్నారు
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ ధ్వజం టీడీపీ నేతలు తమను తాము పొగుడుకోవడానికే మహానాడు పరిమితమైందని ఎద్దేవా హైదరాబాద్ : తన ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చే యలేనన్న అపనమ్మకంతోనే సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని విషయాల్లో చంద్రబాబు వ్యవహరించే తీరునే రాజధాని విషయంలోనూ ఊహాజనిత మాటలతో ప్రజల్ని మోసం చేయడంతప్ప ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద రాజధాని నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. రాజధాని పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుని సింగపూర్ కంపెనీలకు వాటిని తాకట్టు పెట్టాలన్న బాబు ప్రభుత్వ ప్రయత్నాలపట్లే తమ పార్టీ తొలినుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. ఈ విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అధికారంలో ఉన్న పార్టీ మహానాడులాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే.. సాధారణంగా రాబోయే ఏడాది, రెండేళ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసే కార్యక్రమాలపై భవిష్యత్ ఎజెండాను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తుందని, కానీ మహానాడు జరుగుతున్న తీరును చూస్తే తమను తాము పొగుడుకోవడానికే పరిమితమైందని తప్పుపట్టారు. చంద్రబాబు వారసుడి ఎంపికకు మహానాడును ఉపయోగించుకుంటున్నారేతప్ప ప్రజల అంశాలపై ఇందులో చర్చలు లేవని జ్యోతుల దుయ్యబట్టారు. -
పట్టిసీమతో రైతుల నోట్లో మట్టి: జ్యోతుల
కాకినాడ: కొందరి స్వార్థం కోసం ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉభయగోదావరి జిల్లాల రైతాంగం నోట్లో మట్టికొట్టే పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. మంగళవారం కాకినాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఖర్చు కోసం కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న కోట్లరూపాయలకు పరిహారంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కానుకగా ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎత్తిపోతల పథకం ప్రారంభించి నీటిని తోడడం ప్రారంభిస్తే ఉభయగోదావరి జిల్లాల రైతాంగానికి నష్టం వాటిల్లుతుందన్నారు. డ్వాక్రా, రైతు రుణాల మాఫీ, పోతిరెడ్డిపాడు నీటి నిల్వల సామర్థ్యం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం వంటి సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జ్యోతుల డిమాండ్ చేశారు. -
రాజమండ్రి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బయల్దేరారు. హైదరాబాద్ నుంచి ఆయన విమానంలో మధురపూడి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వైఎస్ జగన్ జగ్గంపేట మీదుగా ఇర్రిపాకకు వెళ్తారు. సోదరుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇటీవల నెహ్రూ సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జ్యోతులను పరామర్శించిన అనంతరం జగన్మోహన్రెడ్డి తుని మీదుగా విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడు వెళ్తారు. అక్కడ ఇటీవల బాణసంచా పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. -
నేడు విశాఖ, తూర్పులలో జగన్ పర్యటన
-
నేడు జిల్లాకు జగన్
జ్యోతుల కుటుంబానికి పరామర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్ నుంచివిమానంలో బయలుదేరి రాజమండ్రి మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి జగ్గంపేట మీదుగా ఇర్రిపాకకు వెళ్తారు. సోదరుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇటీవల నెహ్రూ సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జ్యోతులను పరామర్శించిన అనంతరం జగన్మోహన్రెడ్డి తుని మీదుగా విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడు వెళ్తారు. అక్కడ ఇటీవల బాణసంచా పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. -
‘బాబు’ నిర్ణయంపైనే పట్టిసీమ ఉద్యమం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై శాసనసభలో చర్చ జరగనున్న కారణంగా ఈనెల 14న తలపెట్టిన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆయన బుధవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబు సర్కారు మొండిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో రైతుల పక్షాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు. ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో చర్చకు అనుమతిస్తారని ఎదురు చూస్తున్నామని, చర్చ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే నిర్ణయూన్ని అనుసరించి తమ ఉద్యమం ఉంటుందని నెహ్రూ చెప్పారు. అంతవరకు వేచి చూస్తామన్నారు. -
విమానాశ్రయంలో జ్యోతులకు ఘనస్వాగతం
కోరుకొండ :వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూకు మధురపూడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనేకమంది ఆయనకు స్వాగతం పలికి, పుష్పమాలలతో సత్కరించారు. ఎయిర్‌పోర్టు పరిసరాలు అభిమానులతో కిక్కిరిసి పోయాయి. స్వాగతం పలికినవారిలో పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాస్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజా, రాష్ట్ర, జిల్లా నాయకులు గిరజాల వెంకట స్వామినాయుడు, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు, చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కర్రి పాపారాయుడు, జ్యోతుల నవీన్, అనంత ఉదయ భాస్కర్, ఎం.మోహన్, వట్టికూటి రాజశేఖర్, శెట్టిబత్తుల రాజబాబు, నక్కా రాజబాబు, రావు చిన్నారావు, నక్కా రాంబాబు, వెంగల సుబ్బారావు, పి.కె.రావు, గట్టి రవి, కాళ్ళ లక్ష్మణరావు, మూర వెంకటేశ్వరావు, నూటన్ ఆనంద్, దంగేటి రాంబాబు, మంచాల బాబ్జీ, ఆర్‌వీవీఎస్ చౌదరి, వాసిరెడ్డి జమీలు, సుంకర చిన్ని, కర్రి వెంకట సత్తిరెడ్డి, మంగిన సింహాద్రి, దొంగ యేసుబాబు, దూలం వెంకన్నబాబు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, విప్పర్తి వేణుగోపాల్, కుంజం వెంకన్నదొర, పోలి కిరణ్‌రెడ్డి, మండపాక అప్పన్నదొర, చాటిపర్తి దుర్గారావు, కొండమీద కోటేశ్వరరావు, బొంత శ్రీహరి, మట్టపర్తి రాజేంద్ర, కనితి జోగారావు, కాటం రజనీకాంత్, మేడపాటి షర్మిలారెడ్డి, బొత్సా రమణ, బద్రి బాబ్జీ, మోటూరి సాయి, నల్ల రామాంజనేయులు, గిరిజాల బాబు, అత్తిలి సీతారాస్వామి, మట్టపర్తి మురళీకృష్ణ, పెంటా శ్రీనివాసరావు, చిరుపురపు శ్రీనివాస్, మార్గాని గంగాధర్, అడపా వాసు, మాలెం విజయలక్ష్మి, చిన్నం అపర్ణదేవి, సాకా ప్రసన్నకుమార్, గొల్లపల్లి డేవిడ్, మట్టా రాణి, పండా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై పలువురు జ్యోతుల నెహ్రూకు వినతి పత్రాలు అందజేశారు. -
నేడు జ్యోతుల రాక
జగ్గంపేట : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ విదేశీ పర్యటనను ముగించుకుని ఆదివారం జిల్లాకు రానున్నారు. అమెరికాలోని డల్లాస్‌లో పర్యటించిన ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేశారు. విమానాశ్రయం నుంచి జ్యోతుల నరేంద్రపురం, రాజానగరం, గండేపల్లి, జగ్గంపేటల మీదుగా స్వగ్రామమైన ఇర్రిపాక వెళతారు. -
జనం కోసం..రణపథం
ఎత్తిపోతలు, ఇసుక అక్రమ రవాణాలపై పోరుకు వైఎస్సార్ సీపీ సన్నద్ధం మార్చి ఒకటిన స్వదేశానికి రానున్న జ్యోతుల విమానాశ్రయంలోనే ఆయనను కలవనున్న పార్టీ శ్రేణులు అక్కడే పోరుబాట ఖరారు చేయాలని నిర్ణయం మండపేట :పట్టిసీమ ఎత్తిపోతల పథకం జిల్లా రైతాంగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అధికారపక్ష నేతల దన్నుతో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాతో కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ రెండు సమస్యలపై పోరుబాటకు వైఎస్సార్ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జిల్లాలో కాలుమోపగానే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని గురువారం మండపేటలో నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల అమెరికా పర్యటన ముగించుకుని మార్చి ఒకటిన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాకు రానున్నారు. కాగా అధికారపార్టీ ఆగడాలతో ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు గిరజాల వెంకటస్వామినాయుడు, పెండెం దొరబాబు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, చెల్లుబోయిన వేణు, కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), ఇతర ముఖ్యనేతలు మండపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. పోలవరం దిగువన రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వలన జిల్లాలోని డెల్టాకు సాగునీటి ఇక్కట్లు తప్పవు. మరోపక్క జిల్లాలోని ఇసుక రీచ్‌లను అధికారపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు అడ్డాలుగా మార్చుకుని కోట్లాది రూపాయల ఇసుకను పక్కదారి పట్టిస్తుండటంతో ప్రభుత్వానికి రాబడి పోవడంతో పాటు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ రెండు సమస్యలపై ఉద్యమించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. అమెరికా పర్యటన ముగించుకుని జిల్లాకు వస్తున్న జ్యోతులతో చర్చించి తుదిరూపం ఖరారు చేయనున్నారు. సమస్యల తీవ్రత దృష్ట్యా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మార్చి ఒకటిన మధురపూడి విమానాశ్రయానికి వెళ్లి జ్యోతుల రాగానే ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీనివలన సమస్యల తీవ్రతను ప్రభుత్వం గుర్త్తిస్తుందన్న ఆశాభావాన్ని నేతలు వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలిరావాలి : బోస్ జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపించేందుకు పార్టీశ్రేణులు పోరుబాటకు సిద్ధం కావాలని బోస్ పిలుపునిచ్చారు. విదేశీపర్యటన ముగించుకుని మార్చి ఒకటిన జిల్లాకు రానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతులను మధురపూడి విమానాశ్రయంలోనే కలిసి సమస్యలను వివరిస్తే వాటి ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా నలుమూలల నుంచి పార్టీశ్రేణులు విమానాశ్రయానికి తరలి రావాలని కోరారు. జిల్లా యువజన, ఎస్సీ సెల్, సేవాదళ్ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, పెట్టా శ్రీనివాసరావు, మార్గాని గంగాధర్, పార్టీ నేతలు వేగుళ్ల చైతన్యబాబు, భూపాలపట్ల ప్రసాద్, గొల్లపల్లి బుజ్జి, తోట రాజేశ్వరరావు, నక్కా మోహన్, తిరగటి కొండలరావు, ఆకిరి శ్రీనివాస్, పిల్లా వీరబాబు, శెట్టి నాగేశ్వరరావు, చింతలపూడి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. -
కదనపథంలో జనదళమయ్యేలా..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం రాజీలేని పోరు కొనసాగించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల కూర్పు జరుగుతోంది. పార్టీ జిల్లా కమిటీలకు నూతన జవసత్వాలు కల్పించే దిశగా చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాత, కొత్తల మేలు కలయికతో సమర్థవంతమైన కమిటీల ఏర్పాటు జరుగుతోంది. తొలి దశలో జిల్లా కమిటీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లా కమిటీతో పాటు రాష్ట్ర కమిటీలోకి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించేందుకు జాబితాలు రూపొందిస్తున్నారు. ఈ విషయమై గురువారం రాజమండ్రి షెల్టన్హోటల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలు అంతర్గత సమావేశం నిర్వహించారు. నలుగురు ప్రధాన కార్యదర్శులు, తొమ్మిది మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 38 మంది కార్యదర్శులు, 144 మందితో పార్టీ జిల్లా కార్యవర్గం ఏర్పాటు కానుంది. ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నేతలు అందచేసిన జాబితాలపై నేతలు చర్చించారు. కమిటీ సభ్యుల ఎంపికలో ప్రాంతీయ, సామాజిక సమతూకాలు, సమర్థత, పార్టీ పట్ల అంకితభావం ప్రామాణికంగా కమిటీలకు తుది రూపమిస్తున్నారు. గతంలో వివిధ కమిటీల్లో సమర్థంగా పనిచేసిన వారిని రాష్ట్ర కమిటీల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు అందచేసిన జాబితాలపై వడపోత పూర్తిచేశారు. అనుబంధ కమిటీల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిలో కొందరిని కొనసాగించాలని, మిగిలిన వారి స్థానే ఆసక్తిగా ఉన్న కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అధినేత జగన్ చేపడుతున్న ఆందోళనలను జిల్లాస్థాయిలో సమర్థంగా కొనసాగించగలిగే వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల కన్వీనర్ల కోసం వచ్చిన జాబితాల్లో చేర్పులు, మార్పులపై చర్చించారు. రాష్ట్ర కమిటీకి జిల్లా నుంచి ప్రాతినిధ్యం, జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల కన్వీనర్లపై త్వరగా తుది ని ర్ణయం తీసుకుని అధినేత జగన్ ముందుంచాలని జిల్లా అధ్యక్షుడు నెహ్రూ నే తలకు సూచించారు. అధినేత ఆదేశాల మేరకు కమిటీల కూర్పును పూర్తిచేయాలన్నారు. ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, ఎమ్మె ల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మలకుమారి, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ ఎస్సీ, యువజన, వాణిజ్య విభాగాల జిల్లా కన్వీనర్లు శెట్టిబత్తుల రాజబాబు, అనంత ఉదయబాస్కర్, కర్రి పాపారాయుడు, పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మో హన్, నక్కా రాజబాబు, ఆదిరెడ్డి వాసు, దాసరి శేషగిరి పాల్గొన్నారు. 131 ఘాట్ల వద్ద సీసీ కెమేరాలు పి.గన్నవరం : జిల్లాలో 131 పుష్కరఘాట్ల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నట్టు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎస్.అప్పలనాయుడు చెప్పారు. బెల్లంపూడి, పి.గన్నవరాల్లోని ఘాట్లను గురువారం రాత్రి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘాట్లను ‘ఎ,బి,సి’ కేటగిరీలుగా విభజించి ఏర్పాట్లు చేస్తామన్నారు. 24 గంటలూ బందోబస్తు నిర్వహిస్తామని, పడవలు, గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. -
నేడు జగన్ రాక
స్కూలు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఓదార్పు క్షతగాత్రులకు పరామర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం రెండు గంటలకు మధురపూడి విమానాశ్రయానికి జగన్మోహన్రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి వెళ్తారు. ఇటీవల మోరంపూడి జంక్షన్ వద్ద జరిగిన స్కూలు బస్సు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తారు. ఈ ప్రమాదంలో గోరక్షణపేటకు చెందిన ర్యాలి వెంకన్న, ఏవీ అప్పారావు రోడ్డుకు చెందిన శివనేని మహాలక్ష్మి మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను జగన్ ఓదారుస్తారు. రాజమండ్రిలో కొద్దిసేపు బసచేసి అక్కడి నుంచి కాకినాడ చేరుకుంటారు. ద్వారంపూడి భాస్కర పద్మావతి ఫంక్షన్ హాలులో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కాకినాడ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహ వేడుకలకు హాజరవుతారు. వధూవరులు అంజలి, హర్షవర్థనరెడ్డిలను జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తారు. రాత్రికి తిరిగి రాజమండ్రి చేరుకుని బస చేస్తారు. గురువారం ఉదయం రాజమండ్రి షెల్టన్ హోటల్లో పార్టీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు కుమారు డు నరేన్ నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మధురపూడి చేరుకుని, విమానంలో హైదరాబాద్ పయనమ వుతారు. -
రాజకీయ జిత్తులమారి చంద్రబాబు : జ్యోతుల
రాజానగరం : చెప్పింది చేయడం, చేసేది చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం కాదని, మనిషి బలహీనతలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయనొక రాజకీయ జిత్తుల మారని శాసన సభలో వైఎస్సార్ సీపీ ఉపనేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. రుణ మాఫీ పథకం అమలు తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీకి చెందిన భూపాలపట్నం సొసైటీ అధ్యక్షుడు పేపకాయల విష్ణుమూర్తి రాజానగరంలో చేపట్టిన 36 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి, మద్దతు పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ రుణమాఫీపై వంచనకు గురైన రైతుల పక్షాన ఆందోళన చేపట్టడం అభినందనీయమన్నారు. ఆందోళనను ఉధృతం చేద్దామన్నారు. రుణమాఫీని ఉద్యానవన పంటలకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్‌ను కలిసి వివరించనున్నామన్నారు. శాగోదుంపను ఉద్యానవన పంట నుంచి తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. రుణ మాఫీ పథకం బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31, ఫిబ్రవరి 1తేదీల్లో తణుకులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టే నిరసన దీక్షను కూడా విజయవంతం చేద్దామని, భారీ ఎత్తున కదలిరండి అంటూ రైతాంగానికి జ్యోతుల పిలుపునిచ్చారు. మాయల మరాఠీ చంద్రబాబు నమ్మిన వారిని మోసం చేయడం, మాయ మాటలతో బురిడీ కొట్టించడం చంద్రబాబు నైజమని ప్రత్తిపాడు, కొత్తపేట ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బాబును వారు మాయల మరాఠీగా అభివర్ణించారు. రాజానగరంలో దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. రైతుల పక్షాన ఈ విధంగా పోరాటం చేయడాన్ని రాజానగరం నుంచి ప్రారంభించి, తమకు స్ఫూర్తిగా నిలిచారంటూ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిని, 36 గంటల దీక్ష చేస్తున్న విష్ణుమూర్తిని అభినందించారు. శిబిరంలో రాజానగరం మండలానికి చెందిన మరో 20 మంది రైతులు కూడా మద్దతు దీక్షలు చేపట్టారు. కానవరం సొసైటీ అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాసకుమార్ ప్రారంభించిన ఈదీక్షా శిబిరాన్ని ఆకుల వీర్రాజు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మందారపు వీర్రాజు, సర్పంచులు గండి నానిబాబు, ఉండమట్ల రాజబాబు, కొవ్వాడ చంద్రరావు, ఉపసర్పంచ్ అక్కిరెడ్డి మహేష్, సొసైటీ మాజీ అధ్యక్షులు అడబాల చినబాబు, అనదాస సాయిరామ్, మాజీ సర్పంచ్‌లు కొల్లి నూకరాజు, వాసంశెట్టి పెద్దవెంకన్న, స్థానిక నాయకులు సందర్శించి, మద్దతు పలికారు. -
'చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?'
రాజమండ్రి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు ప్రశ్నించారు. సీఎం వ్యవహార తీరుపై ఆయన మండిపడ్డారు. పుష్కరాలపై సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవకపోవడం సిగ్గుచేటని నెహ్రు అన్నారు. -
ఎదురుదాడే తప్ప.. చర్చలు లేవా?
-
'రాష్ట్రంలో ఎక్కడైనా గంటాతో పోటీకి సై'
-
'రాష్ట్రంలో ఎక్కడైనా గంటాతో పోటీకి సై'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ఆర్సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. మంత్రి గంటా విసిరిన ఛాలెంజ్ ను తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా గంటా పోటీకి వస్తానంటే తాను సిద్ధమేనన్నారు. -
ప్రతి దానికీ మీకే అనుభవం ఉందనొద్దు
చంద్రబాబుకు జ్యోతుల నెహ్రూ సూచన సాక్షి, హైదరాబాద్: ప్రతి దానికీ మీకే అనుభవం ఉందంటూ మాట్లాడొద్దని వైఎస్సార్సీ ఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ సీఎం చంద్రబాబుకు సూచించారు. గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో చర్చల సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెహ్రూ ఈ విధంగా స్పందించినట్లు తెలిసింది. సభలో ఏ ప్రజాసమస్యపై చర్చకు ఎంత సమయం కేటాయిస్తారో స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్సీపీ సభ్యుడు గడికోట శ్రీకాంతరెడ్డి కోరినప్పుడు చంద్రబాబు తన అనుభవాన్ని ఏకరువు పెట్టిన ట్లు సమాచారం. ‘నేను పదేళ్లు సీఎంగా పనిచేశా. పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నా ను. నాకు అనుభవం ఉంది’ అని సీఎం అన్నట్లు తెలిసింది. దీనికి నెహ్రూ స్పందిస్తూ.. ‘మీకే అను భవం ఉందంటూ ప్రతి దానికీ ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడ్డం తగదు’ అని అన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు హేళనగా నవ్వడంతో నెహ్రూ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. రైతు ఆత్మహత్యలపై సంతాపానికి అధికారపక్షం అడ్డు! పెషావర్‌లో విద్యార్థుల మృతికి అసెంబ్లీలో సం తాప తీర్మానం పెట్టాలన్న అంశానికి బీఏసీలో ఏకాభిప్రాయం కుదిరింది. అయితే, హుద్‌హుద్ తుఫాను, రైతు ఆత్మహత్యలపై సంతాపం పెడదామని ప్రతిపక్షం ప్రతిపాదనను అధికారపక్షం అడ్డుకున్నట్లు సమాచారం. హుద్‌హుద్ మృతులకు సంతాపం తెలపడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు స్పీకర్‌కు తెలియజేశారని తెలిసింది. అనంతపురం జిల్లావాసివై ఉండి రైతుల ఆత్మహత్యలపై సంతాప తీర్మానం పెట్టడాన్ని వ్యతిరేకించడం తగదని గడికోట శ్రీకాంతరెడ్డి అనగా.., మీరు రాజకీయం చేస్తున్నారంటూ కాలువ ధ్వజమెత్తినట్లు తెలిసింది. ఈ అంశాన్ని స్పీకర్ విచక్షణకు వదలేశారు. -
చర్చ జరపకుంటే ప్రతిఘటిస్తాం
ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ పట్టు అసెంబ్లీ 15 రోజులపాటు జరపాల్సిందే సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభ సమావేశాలను 15 రోజులపాటు పెంచాలని వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం అవకాశమివ్వకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్య లు, కరువు, రుణమాఫీ, కనీస మద్దతు ధర సమస్యలను ఎదుర్కొంటుందని చెప్పారు. గురు వారం శాసనసభ వ్యవహారాల మండలి (బీఏసీ) అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్నివర్గాల ప్రజ లు అనేక ఇబ్బం దులకు గురవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెం బ్లీ వేదికగా చర్చించేందుకు 15 రోజులపాటు సమావేశాలను పొడిగించాలని బీఏసీలో తమ పార్టీ తరఫున కోరినట్లు చెప్పారు. రాయలసీమకు సాగునీరందక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, డ్వాక్రా రుణమాఫీ, పింఛన్లలో అవకతవకలు, ‘పచ్చ’ కమిటీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, అంగన్వాడీల సమస్యలు, హుద్‌హుద్ తుపాను, ఇసుక మాఫి యా, శ్రీశైలం విద్యుత్, పోలవరం నిర్మాణం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం-టెండర్, ఉద్యోగుల విభజన, పీఆర్సీ పెంపు వంటి సమస్యలపై అసెం బ్లీలో కూలంకషంగా చర్చించాల్సి ఉందన్నారు. రాజధాని నిర్మాణం ప్రధానమైన అంశమని అభిప్రాయపడ్డారు. వివిధ కోణాల్లో చర్చకు వచ్చే విధంగా కృషి చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎం మాత్రం 2 రోజులపాటు సాయంత్రం వరకు సెషన్స్ కొనసాగించి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెడతామని చెప్పారని తెలిపారు. సభను తప్పుదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తారా?: గడికోట సీఎం చంద్రబాబు నాయుడు బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాన్ని హేళన చేసే విధంగా వ్యవహరించారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. వెంకటరమణ, పెషావర్ కాల్పుల్లో మృతులపై సంతాపం తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించినప్పడు... హుద్‌హుద్ తుపానులో చనిపోయిన మృతులు, కరువు కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని తాము కోరామని తెలిపారు. అయితే ఆ సంప్రదాయం లేదని చంద్రబాబు తప్పించుకున్నారని, తనకే అన్నీ తెలుసు అన్న ధోరణి ఆయన విడనాడాలని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చలు జరగకుండా ప్రభుత్వం తప్పించుకునే ధోరణి అనుసరిస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. గుంటూరు భూములు సింగపూర్‌కు.. సింగపూర్ భూములు బాబుకు.. రాజధాని ప్రకటించిన గుంటూరు జిల్లాలో భూములు సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించేందుకు చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ వేస్తున్నారని, రైతుల జీవితాలు పణంగా పెట్టే చంద్రబాబు ఆటలు మాత్రం సాగనివ్వమని ఆ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ముస్తఫాలు తెలిపారు. ‘గుంటూరు భూములు సింగపూర్‌కు.. సింగపూర్ భూములు చంద్రబాబుకు..’ అన్న విధంగానే ఏపీ ప్రభుత్వం, సింగపూర్ నడుమ క్విడ్ ప్రోకో జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు తన కుటుంబంతో కలిసి ఎన్నిసార్లు సింగపూర్‌కు వెళ్ళారో.. ఆయన పాస్‌పోర్టు స్టాంపింగ్ చూపించాలని అసెంబ్లీలో తాము డిమాండ్ చేస్తామని వారు చెప్పారు. -
3.10 రూపాయల రుణమాఫీయా..?!
-
జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రు బైక్ ర్యాలీ
కాకినాడ : రైతు రుణ మాఫీ అమలు కోసం వైఎస్ఆర్ సీపీ ఆ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు సమాయత్తం అవుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి భారీ బైక్ ర్యాలీతో కాకినాడ కలెక్టరేట్ వద్దకు చేరుకోనున్నారు. అలాగే ధర్నాలో పాల్గొనేందుకు పార్టీ నేతలు, రైతులు, డ్వాక్రా మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. -
ఉసురు తగలరాదంటే వాగ్దానం నెరవేర్చాలి
జగ్గంపేట : ‘ఆకలి మంటలతో ఉన్న రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా మలచుకున్నావు. అధికారంలోకి వచ్చి అడుగడుగునా వంచన చేశావు. అతికీలకమైన వ్యవసాయాన్ని సర్వనాశనం చేశావు. అన్నదాత ఉసురు తగలకుండా ఉండేందుకు సంపూర్ణ రుణమాఫీని చేపట్టి మాట నిలుపుకో!’- ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పిన మాటలివి. రైతు రుణ మాఫీ అమలు కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు సిద్ధమవుతుండగా చంద్రబాబు హడావుడిగా గురువారం రుణమాఫీపై ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై జ్యోతుల స్పందించారు. జగ్గంపేటలో రాత్రి పార్టీ నాయకుడు జీను మణిబాబు నివాసంలో జ్యోతుల మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటన తీరు చూస్తే రైతులను ఎంత చక్కగా మోసం చేయాలో అంత చక్కగా చేశారని అర్థమవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి రైతులతో ఆయన మైండ్ గేమ్ ఆడుకున్నారని, తొలి సంతకం పేరుతో మాఫీకి కాకుండా కేవలం విధివిధానాలకు కోటయ్య కమిటీ వేసి సరిపెట్టారన్నారు. పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన ఆయన మాట మార్చి పంట రుణాలకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. తరువాత రూ.1.5 లక్షల షరతు పెట్టారని, రూ.87 వేల కోట్లకు గాను కేవలం బడ్జెట్‌ను రూ.5 వేల కోట్లకు కుదించారని, ఇలా ప్రతి అంశంలో రైతులను మోసం చేస్తూ వచ్చారని ధ్వజమెత్తారు. రైతాంగం రుణాలన్నింటినీ రానున్న ఐదేళ్ల కాలంలో పూర్తిగా రద్దు చేయాలని, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణ మాఫీ హామీని నెరవేర్చాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. డిమాండ్ల సాధనకు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామన్నారు. కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, మంతెన నీలాద్రిరాజు తదితరులు పాల్గొన్నారు. -
5న కలెక్టరేట్ వద్ద మహాధర్నా
కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 5న కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. స్థానిక సూర్యకళా మందిరంలో మహాధర్నా పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, సాయిదుర్గా ప్రసాదరాజుతో పాటు పలువురు నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మహాధర్నాలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోస్టర్లను జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు పంపించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ, పింఛన్ల తొలగింపు సహా అనేక ప్రభుత్వ వైఫల్యాలపై ఈ ఆందోళన చేస్తున్నామన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొంటారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు పినపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హామీలపై నిలదీస్తామనే మా నేతలపై కేసులు : జ్యోతుల
అన్నవరం : ఎన్నికల హామీలను అమలు చేయని మోసంపై ప్రజల తరఫున నిలదీస్తామన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆదివారం ఆయన విశాఖపట్నం వెళుతూ సత్యదేవుని తొలిపాంచా వద్ద సత్యదేవునికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మొన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని హత్య కేసుతో అరెస్టు చేశారని, నిన్న పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథిపై కేసులు బనాయించారని ఆరోపించారు. ఎన్ని విధాలుగా భయభ్రాంతులను చేసినా ప్రభుత్వ వైఫల్యాలను జగన్ నాయకత్వంలో శాసనసభలో నిలదీసి తీరతామని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి, కొండపల్లి అప్పారావు, దడాల సతీష్, రాయి శ్రీనివాస్, బీఎస్వీ ప్రసాద్, వెదురుపాక మూర్తి, బొబ్బిలి వెంకన్న, తాటిపాక కృష్ణ తదితరులున్నారు. -
జ్యోతుల నెహ్రుకు ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ
కాకినాడ : వైఎస్ఆర్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. బుధవారం ఫోన్ చేసిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా నెహ్రు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జ్యోతుల నెహ్రు అస్వస్థతతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన కాకినాడ సేఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జ్యోతుల నెహ్రును వివిధ రాజకీయ పక్షాల నేతలు పరామర్శించారు. -
జగన్‌ను చూసి బాబుకు వణుకు: జ్యోతుల
-
జగన్‌ను చూసి బాబుకు వణుకు: జ్యోతుల
కాకినాడ: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రజాసమస్యలపై గళమెత్తుతున్న తీరును చూసి అధికార పక్షం వణికిపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ముఖ్యంగా జగన్ మాటల తూటాలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. శాసనసభలోని 175 మంది ఎమ్మెల్యేలకు సమాన న్యాయం చేయాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహార శైలి చూస్తుంటే.. ఆయన ఇంకా టీడీపీ వ్యక్తినే అన్న భావనలో ఉన్నట్టుందని జ్యోతుల విమర్శించారు. ఆయనను స్పీకర్ చేయడానికి చంద్రబాబు వారాల తరబడి ఊగిసలాడారన్నారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం, ఆయనే సభలో అన్ పార్లమెంటరీ పదాలను వాడుతుండడం ఆక్షేపణీయమన్నారు. స్పీకర్ బుద్ధి మారాలని అన్నవరం సత్యదేవుని ప్రార్థించానన్నారు. -
సమన్వయ, సహకారాలే నా శస్త్రాస్త్రాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అందరినీ సమన్వయపరుచుకుంటూ, నాయకులందరి సహకారంతో పార్టీని పటిష్టపరుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా నూతన అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు. రాజకీయాల్లో కాలిడిన నాటి నుంచి బాధ్యతతో, కష్టించి పనిచేయడమే తన అజెండా అని స్పష్టం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షునిగా జ్యోతులను బుధవారం రాత్రి ప్రకటించారు. పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన నెహ్రూ పార్టీ అత్యున్నతమైన కేంద్రపాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నెహ్రూ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ, పీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేసిన ఆయనకు జిల్లా అంతటా విస్తృతమైన పరిచయాలున్నాయి. గురువారం గుంటూరులో ఉన్న ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాజకీయాల్లో సాధారణ కార్యకర్తగా అడుగు పెట్టిన ఎంతో మంది నాయకులు అనేక ఉన్నత పదవులు అలంకరించడానికి క్రమశిక్షణతో కూడిన పనితీరే కారణమని తాను గట్టిగా నమ్ముతానన్నారు. తాను కష్టపడి పనిచేస్తూ, ప్రతి నాయకుడు, కార్యకర్తా అలాగే పనిచేసేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అధినేత ఆదేశాల మేరకు పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులందరి సహకారాన్ని తీసుకుంటానని చెప్పారు. పార్టీలో చేరిన దగ్గర నుంచీ అధినేత ఆదేశాలూ శిరోధార్యంగా పనిచేస్తున్నానన్నారు. ఇకముందు కూడా అదే స్ఫూర్తితో పార్టీలో అన్ని విభాగాలను దశలవారీగా చైతన్యవంతం చేసేందుకు పాటుపడతానన్నారు. తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సహకరించాలని నెహ్రూ అభ్యర్థించారు. ప్రజలకు అండగా ఉందాం.. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, ఇతర వర్గాలు చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి ఓటేశారని, ఇప్పుడు ఆ హామీల అమలు సందేహాస్పదంగా పరిణమించిన తరుణంలో ప్రజలకు ప్రతి కార్యకర్తా వెన్నుదన్నుగా నిలవాలని జ్యోలు విజ్ఞప్తి చేశారు. పార్టీ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలంటే కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నాయకులు ముందుకు సాగాలన్నారు. కార్యకర్తకు ఏ కష్టమొచ్చినా మనోధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత ప్రతి నాయకునిపై ఉందన్నారు. హైదరాబాద్ నుంచి ఆదివారం తిరిగి వచ్చాక జిల్లా నాయకులంతా సమావేశమవుతామని చెప్పారు. జ్యోతులకు అభినందనల వెల్లువ జగ్గంపేట : వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన జ్యోతులను జిల్లాలోని పలువురు నాయకులు, నియోజకవర్గనేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫోన్లో అభినందించారు. హైదరాబాద్‌లో జ్యోతులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జి.వి.రమణ తదితరులు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని పటిష్టపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని వరుపుల ఈ సందర్భంగా జ్యోతులను కోరారు. భూపాలపట్నం ప్రసాద్, బుజ్జి తదితరులు జ్యోతుల వెంట ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు :కుడుపూడి చిట్టబ్బాయి పదవీ బాధ్యతల నిర్వహణలో తనకు అన్ని విధాలా సహకరించిన కార్యకర్తలకు, నాయకులకు ఇంతవరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా తన శక్తిమేరకు అధినేత అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించానన్నారు. ఆరోగ్య కారణాలతో బాధ్యతల నుంచి తప్పించాలన్న అభ్యర్థనను ఆమోదించిన జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు సాధారణ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానన్నారు. -
డొల్లతనం తేటతెల్లం: జ్యోతుల నెహ్రూ
ఏపీ మంత్రివర్గ భేటీపై వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ ధ్వజం రీషెడ్యూల్ అంటూ ఆర్బీఐపై నెపమా? సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగిన తీరు ప్రభుత్వ డొల్లతనానికి, బేలతనానికి అద్దం పడుతోందని వైఎస్సార్ సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలేవీ చర్చించకుండా భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జ్యోతుల నెహ్రూ సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ముఖ్యంగా రైతులకు సంబంధించి రుణమాఫీపై ప్రభుత్వం ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని, వ్యవసాయ రుణాల మాఫీ కోసం కేటాయింపులను ప్రస్తావిస్తారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ జరగలేదన్నారు. రుణమాఫీ గురించి చెప్పకుండా రీషెడ్యూలు అంటూ రిజర్వ్ బ్యాంక్‌పై నెపం వేస్తున్నారని విమర్శించారు. గృహావసరాలకు 24 గంటలు, సేద్యానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. - రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇవ్వకపోగా మరింత గందరగోళం సృష్టించారు. మంత్రులు ఎవరిష్టం వచ్చినట్లు వారు విశాఖపట్టణం, ఒంగోలు, నెల్లూరులో రాజధాని ఉండాలని మాట్లాడుతున్నారు. - వృద్ధులు, వితంతువులకు పింఛన్లు రూ.వెయ్యి, రూ.1500కి పెంచుతూ మంత్రివర్గం భేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశించినా అదేమీ జరగలేదు. అక్టోబర్ 2 నుంచి మీరు పెంచినా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నెల నుంచే పెరిగిన మొత్తాన్ని బకాయిలతో లబ్ధిదారులకు చెల్లించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. - పార్టీ విప్‌ను ధిక్కరించారని ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబుపై జిల్లా కలెక్టర్ అనర్హత వేటు వేశారు. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికై, ప్రలోభాలకు గురై ఓట్లేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీలపై అనర్హత వేటు వేయరా? హరిబాబుకు ఓ న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? వైఎస్సార్ సీపీ విప్‌ను ధిక్కరించిన వారిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకూ అనర్హులను చేయలేదు. ప్రకాశం జడ్పీ ఎన్నిక కంటే 20 రోజుల మందే ఇవి జరిగాయి. ఇదీ చంద్రబాబు దుర్నీతి. -
సుహృద్భావ వాతావరణంలో సమీక్షలు
సాక్షి, రాజమండ్రి : ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నేతలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయని జగ్గంపేట ఎమ్మెల్యే, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. సమీక్షలు జరుగుతున్న స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల నాలుగు నుంచి జరుగుతున్న ఈ సమీక్షల్లో కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలోని నేతలు, కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, నరసాపురం నియోజకవర్గాలతో పాటు రాత్రి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమీక్ష జరుపుతారన్నారు. ప్రతీ కార్యకర్త నుంచి సూచనలు, సలహాలను తీసుకుంటూ జగన్మోహన్రెడ్డి వారిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు జరపడానికి సమయం సరిపోలేదని, అందువల్ల విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు వాయిదా వేసినట్టు చెప్పారు. తిరుపతిలో మరికొన్ని జిల్లాల సమీక్షలు జరుగుతాయని, ఆ తర్వాత ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు విశాఖపట్నంలో నిర్వహిస్తారని నెహ్రూ తెలిపారు. జగన్మోహన్రెడ్డి చేసిన దిశా నిర్దేశ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై సమర్ధవంతమైన పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు ఉద్యుక్తం అవుతున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని గ్రామస్థాయిలో ఎత్తిచూపి వాటి పరిష్కార దిశగా కార్యకర్తలు ఉద్యమిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కూడా పాల్గొన్నారన్నారు. -
ఉద్యమ పథానికి దిశానిర్దేశం
ఓటమి పాలయ్యామని కుంగిపోకుండా.. దానిని మెట్టుగా చేసుకొని.. ప్రజల పక్షాన ఉద్యమ పథాన పయనించి.. విజయ శిఖరాలను అధిరోహించడమే సడలని దీక్షకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప తేడాతో విజయాన్ని అందుకోలేకపోయిన వైఎస్సార్సీపీ.. ఇదే సూత్రాన్ని ఎంచుకుంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో.. ఎన్నికల్లో పార్టీ గెలుపోటములపై.. మూడు రోజుల పాటు రాజమండ్రిలో చేసిన సమీక్షల్లో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు ధైర్యాన్ని అందించారు. ఓటమికి గల కారణాలను గుర్తించి.. వాటిని సరిదిద్దుకొని.. మరింత పట్టుదలతో పని చేస్తే విజయ తీరాలు చేరవచ్చంటూ మార్గ నిర్దేశం చేశారు. పొందారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమీక్షలు ప్రతి రోజూ తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. ముఖ్యంగా జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములపై జగన్మోహన్రెడ్డి లోతైన పరిశీలన చేశారు. చివరి రోజైన శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్ష సాగింది. పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆచంట, పాలకొల్లు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములపై నేతలు, కార్యకర్తలతో జననేత సమీక్షించారు. ప్రతి కార్యకర్తను పేరుపేరునా పలకరిస్తూ వారి మనోగతం తెలుసుకున్నారు. పార్టీని గ్రామ, బూత్ స్థాయి వరకూ బలోపేతం చేయాలని.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉందన్న భరోసాను కల్పించాలని మాట్లాడిన కార్యకర్తలంతా సూచించారు. ప్రతి నెలా గ్రామ కమిటీలు సమావేశమవ్వాలని, ప్రతి ఆరు నెలలకోసారి అధినేత జిల్లా సమీక్షలు నిర్వహించాలని, పార్టీ స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ‘రానున్నది మనకు పరీక్షా కాలం. ప్రతి కార్యకర్తా రోడ్డెక్కి ఉద్యమించాల్సిన సమయం వేధింపులు, కేసులతో మన కార్యకర్తలను అధికార పార్టీ ఇబ్బందుల పాల్జేస్తుంది. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉంది’ అని సూచించారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, కొత్తపేట, రంపచోడవరంలలో విజయం సాధించిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరిలను జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఓటమి చెందిన అభ్యర్థులతో పాటు ఆయా నియోజకవర్గాల కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకుంటూ వారిలో ధైర్యం నూరి పోశారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘చంద్రబాబులా నేను అబద్ధాలు ఆడలేకనే ప్రతిపక్షంలో ఉన్నాను. ఆచరణ సాధ్యం కాని రైతు రుణమాఫీ చేస్తానని ఒక్క మాట చెప్పి ఉంటే చాలు. మనం అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లం. కానీ మూడు నెలలు తిరక్కుండానే రైతులు, ప్రజల ఛీత్కారానికి గురయ్యేవాళ్లం’ అని జగన్మోహన్రెడ్డి అన్నప్పుడు నిబద్ధత గల నాయకుడి సారథ్యంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పలువురు కార్యకర్తలు అన్నారు. నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయతతో పని చేసే జగన్మోహన్రెడ్డి వంటి నాయకుడు ఉండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చేవిధంగా పని చేస్తామని పార్టీ జిల్లా నాయకుడు మిండగుదిటి మోహన్ అన్నారు. జగన్మోహన్రెడ్డి వెంట రానున్న ఐదేళ్లూ సైనికుల్లా పని చేస్తామని ముమ్మిడివరానికి చెందిన పెయ్యిల చిట్టిబాబు అన్నారు. పార్టీ అధినేత చేసిన దిశానిర్దేశం, పార్టీకి వెన్నుదన్నుగా నిలచిన కార్యకర్తలు దృఢ సంకల్పం తమలో మరింత కసిని పెంచాయని ఓటమి చెందిన అభ్యర్థులు అన్నారు. అధినేత ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీని గ్రామ, బూత్‌స్థాయి వరకూ బలోపేతం చేసి, కార్యకర్తలకు అండగా నిలుస్తామని ప్రతినబూనారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని చెప్పారు. ఈ సమీక్షల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి; ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి; ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు; మాజీ మంత్రి పినిపే విశ్వరూప్; మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు; పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి; అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, గుత్తుల సాయి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, బొంతు రాజేశ్వరరావు; రాష్ర్ట యూత్, సేవాదళ్, ప్రచార, రైతు కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీలు, సుంకర చిన్ని, వసుంధర, జక్కంపూడి తాతాజీ; అనుబంధ కమిటీల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, మంతెన రవిరాజు, గారపాటి ఆనంద్; పార్టీ నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, ఆర్వీవీ సత్యనారాయణచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
వీరవరంలో ఎంపీ తోట నర్సింహం వీరంగం
కిర్లంపూడి : తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో ఉద్రిక్తత నెలకొంది. అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో కాకినాడ ఎంపీ తోట నర్సింహం అప్పుడే తన ప్రతాపాన్ని చూపించారు. జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మేనల్లుడి వరస అయ్యే తోట గాంధీ, ఆయన సోదరుడిపై తోట నర్సింహం, తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మాజీ మంత్రి తోట సుబ్బారావు తమ్ముడి కొడుకైన గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. తాజా ఎన్నికల్లో వాళ్లు జ్యోతుల నెహ్రూ, ఆయన మద్దతుదారులను బలపరిచారు. ఈ కారణంతోను, ఇంతకుముందు అయిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకున్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం.. శనివారం నాడు పొద్దున్నే వేరే ఊళ్ల నుంచి జనాన్ని తీసుకెళ్లి వీరవరంలో తమ ఇంట్లో ఉన్న తోట గాంధీ, తదితరులపై దౌర్జన్యం చేశారు. తీవ్రంగా దాడి చేయడంతో గాంధీ, ఆయన సోదరుడు గాయపడ్డారు. దీంతో ఈ విషయం తెలిసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన బయల్దేరి వీరవరం వెళ్లారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బయట ఊళ్ల నుంచి వచ్చిన వారందరినీ పంపేసి ఊళ్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ఎన్నికలు జరిగినా.. వీరవరంలో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. తోట, జ్యోతుల కుటుంబ సభ్యులంతా దగ్గరి బంధువులే అయినా, రాజకీయంగా వేర్వేరు వర్గాల్లో ఉండటంతో.. ఈ ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం. -
బాధితులకు వైఎస్సార్ సీపీ భరోసా
జగ్గంపేట, న్యూస్‌లైన్ :తుపాను, అతివృష్టి వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రజలకు సహాయ చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ముం పు ప్రాంతాలలో పర్యటిస్తున్నారని పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ట్రావెలర్స్ బంగ్లాలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. బాధాతప్త హృదయంతో విజయమ్మ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, రైతులను ఆదుకునేందుకు గట్టిగా పోరాడతామన్నారు. మెట్టలో వర్షాలకు మానవ తప్పిదం వల్లే ముంపు సమస్య తలెత్తిందన్నారు. ఏలేరు ఆధునికీకరణ కోసం తాము పాదయాత్ర చేసి హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధి పట్టించుకోకపోవడంతోనే ముంపు వల్ల రైతులు పంటలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆధునికీకరణ చేపడతామని ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర, రాష్ట్రమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. టెండర్లు పిలిచినప్పటికీ వాయిదా పడడానికి నిధులు లేకపోవడమే కారణమన్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నందున మళ్లీ ఏలేరును ఆధునికీకరిస్తామని పబ్బం గడుపుకొనేందుకు దురాలోచనలకు దిగుతున్నారన్నారు. ప్రస్తుతం ఏలేరులో 85.18 మీటర్ల ఎత్తులో నీటి నిల్వలు ఉన్నందున ఎఫ్ఆర్ఎల్కు సమీపంలో ఉందని, ప్రాజెక్టు నిండితే ఒకేసారి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే ఏలేరు ప్రాంత గ్రామాలు, పొలాలు ముంపునకు గురవుతాయన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏలేరు ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు తాను ప్రధాన భూమిక పోషిస్తానన్నారు. విజయమ్మ పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన నాయకులు ఎడతెరిపి లేకుండా ఆరు రోజుల పాటు కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు సాంత్వన చేకూర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. జగ్గంపేట నుంచి తొండంగి మండలం వరకు సాగనున్న విజయమ్మ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పార్టీ నాయకులు సోమవారం పర్యవేక్షించారు. జగ్గంపేట నుంచి పెద్దాపురం వెళ్లే మార్గంలో కాట్రావులపల్లి వద్ద ముంపులో ఉన్న సుమారు మూడువేల ఎకరాల వరి చేలను విజయమ్మ పరిశీలించనున్నారు. విజయమ్మ పర్యటన కోసం పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, నాయకులు గిరిజాల వెంకటస్వామినాయుడు, కొండేటి చిట్టిబాబు, త్రినాథ్‌రెడ్డి, మంతిన రవిరాజు తదితరులు కాట్రావులపల్లిలోని వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీరు నిలిచిపోవడంతో పంటలను పూర్తిగా కోల్పోతామని రైతులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. నాయకుల వెంట మారిశెట్టి భద్రం, కొలిపే ప్రసన్నరాణి, కుదప వెంకట శ్రీనివాస్, మురళి, ఒమ్మి రఘురామ్, నీలాద్రిరాజు, ఏలేటి బాబి, సుంకర సీతారామయ్య తదితరులు ఉన్నారు. -
ఉద్యమానికి కొత్త ఊపు
చోడవరం,న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి ఉధృతం చేయడానికి క్రమశిక్షణతో అంతా పనిచేయాలని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ పరిశీలకుడు జ్యోతుల నెహ్రూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాస్థాయి విస్తృత సమావేశం చోడవరం లో ఆదివారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాదిమంది నాయకులు, కార్యకర్తలతో పట్టణంలో సం దడి సంతరించుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు తొలుత మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు అధ్యక్షతన జరి గిన కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ప్రాంతాల వారీగా పూటకో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఉద్యమం మరిం త ఉధృతానికి ఈనెల రెండో తేదీ నుంచి నియోజకవర్గాలు, మండలాల వారీగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు, దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా డ్రామాతీరు సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు. చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు విశాఖజిల్లాకు ఎంతో అవసరమని, దీనిని పరిరక్షించుకోవడానికి రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం పరిశీలకుడు పుచ్చా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ రాష్ట్రాల సమైక్యం కోసం పోరాడితే,స్వార్థ రాజకీయంతో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ విభజనకు చర్యలు చేపట్టారన్నారు. కేంద్రపాలకమండలి సభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ వైఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధిచేసి సమైక్యంగా ఉంచితే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్ట ప్రజలతో ఆటలాడుతూ విభజనకు పూనుకున్నాయని విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం అంతా సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నెలరోజుల పోరాటానికి ప్రణాళిక రూపొందించారు. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు, దీక్షలు గురించి విస్తృతంగా చర్చించారు. సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు బోకం శ్రీనివాసరావు, చెంగల వెంకట్రావు, పూడి మంగపతిరావు, బూడిముత్యాలనాయుడు, వంజంగి కాంతమ్మ, ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్, పెట్ల ఉమాశంకరగణేష్, కోరాడ రాజబాబు, గిడ్డి ఈశ్వరి, సీకరి సత్యవేణి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ పీలా వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మిలట్రీనాయుడు, మాజీమంత్రి ఎం. బాలరాజు, పార్టీ నాయకులు పీలా ఉమారాణి, నాయకులు డాక్టర్ బండారు సత్యనారాయణ, పీవీఎస్ఎన్ రాజు, కాండ్రేగుల జగదీష్, పీవీజే కుమార్, నీలం శారద, తదితరులు పాల్గొన్నారు. -
నీ రాజకీయ విన్యాసాలు అందరికీ తెలుసు’
సాక్షి, కాకినాడ : ‘నీ రాజకీయ విన్యాసాలు అందరికీ తెలుసు.. ఇకనైనా చాలించకపోతే ప్రజలు తరిమి తరిమి కొడతారు. రాజకీయ భిక్ష పెట్టిన వారికే పంగనాలు పెట్టావ్.. ఇప్పుడు సిగ్గు వదిలేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావ్..జాగ్రత్త.! ప్రజా క్షేత్రంలో నీ పతనం ఖాయం’ అంటూ రాష్ర్ట మంత్రి తోట నరసింహాన్ని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాకినాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి తోటపై జ్యో తుల నిప్పులు చెరిగారు. తానొక్కడినే సమైక్య వాదిగా ప్రజలతో ముద్ర వేయించుకునేందుకు మంత్రి తోట తంటాలు పడుతున్నారని ధ్వజ మెత్తారు. జగ్గంపేటలో మంగళవారం నిర్వహించిన సమైక్య సింహగర్జనలో సమైక్యవాదం కోసం మాట్లాడకుండా కేవలం వైఎస్ కుటుం బాన్ని, వైఎస్సార్ సీపీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ‘ఈయనను మాజీ మంత్రి అనాలో.. మంత్రి అనాలో అర్థం కావడం లేదు. ఆయన రెండు పర్యాయాలు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఎమ్మెల్యే నయ్యానోననే విజ్ఞతను కూడా మర్చిపోయి మహా నేతను, ఆయన కుటుంబాన్ని ఇష్ట మొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఒక్కసారి తన మన స్సాక్షిని ప్రశ్నించుకుంటే వాస్తవాలేమిటో తెలుస్తాయన్నారు. సమైక్యాంధ్ర పట్ల స్పష్టతతో ఉన్న రాజకీయ పార్టీల్లో సీపీఎం, ఎంఐఎంలతోపాటు ప్రజాబలమున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని, పార్టీ జెండాతో సమైక్య ఉద్యమంలో పాల్గొనే దమ్ము,ధైర్యం, సత్తా తమకు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ర్ట విభజన సంకేతాలు వచ్చి న వెంటనే మా పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలే కాదు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహ న్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా రాజీనామాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. సీమాంధ్రులకు అండగా నిలిచారన్నారన్నారు. ప్రజాప్రతినిధులందరూ పార్టీలకతీతంగా ఒక వేదిక పైకి వచ్చి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే తప్ప సమైక్యాంధ్ర పరిరక్షణ సాధ్యం కాదని, అప్పటి వరకు రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగే అవకాశం లేదన్నారు. దొంగ రాజీనామా చేసిన రాష్ర్టమంత్రి తోట నరసిం హం తన భార్య వాణి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ ప్రక్రియ నిలిచి పోయిం దని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో ఎవరు ఎప్పుడు ఆ ప్రకటన చేశారో చెబితే తామంతా సంతోషిస్తామని, కనీసం ఇప్పటికైనా ఆ ప్రకటన చేయిస్తే సీమాంధ్రులు 50 రోజులుగా రోడ్లెక్కి చేస్తున్న ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్నించారు. తొలుత సమైక్యాంధ్రకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందంటూ వైఎస్‌తో సహా పార్టీ అధినాయకులు చేసిన ప్రకటనలు, విభజన విషయంలో వివిధ పార్టీలు ఇచ్చిన లేఖలతో కూడిన ప్రచార బుక్‌లెట్‌ను పార్టీ నేతలతో కలసి ఆవిష్కరించారు. పార్టీ వాణిజ్య, ఎస్సీ సెల్ కన్వీనర్లు కర్రి పాపా రాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సీతారామచంద్ర వర్మ పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజన పాపం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ
పాయకరావుపేట/ నక్కపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన పాపం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు తీవ్రంగా విమర్శించారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా శనివారం పాయక రావుపేట పట్టణంలో జరిగిన షర్మిల బహిరంగ సభలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావులు విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీల తీరుపై మండిపడ్డారు. జగన్ ప్రభంజనాన్ని ఓర్వలేకే విభజన: కొణతాల సభకు హాజరైన వేలాది మందినుద్దేశించి కొణతాల మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని, ప్రజల్లో జగన్ మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణను తట్టుకోలేక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై విభనను తెరమీదకు తెచ్చాయన్నారు. రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా తయారైందని వాపోయారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సోనియా గాంధీని ఎదిరించడం వల్లే జగన్ మోహన్‌రెడ్డి జైలు పాలయ్యారన్నారు. త్రికరణశుద్ధితో సమైక్యానికి మద్దతు: జ్యోతుల పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ త్రికరణశుద్ధితో సమైక్యవాదానికి మద్దతిచ్చిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్సే అన్నారు. ఈ పోరాటంలో వైఎస్ కుటుంబానికి ప్రజలంతా అండగా నిలవాలన్నారు. ఒక్క వ్యక్తిపై ఇన్ని కుట్రలా: బాబూరావు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ వైఎస్ కుటుంబంపై ఉన్న విధేయతతోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పాయకరావుపేట ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారన్నారు. ఒక వ్యక్తిమీద వందమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు మద్దతు పలికిన చంద్రబాబుకు పుట్టగతులుండవన్నారు. తెలుగు కుటుంబం ఛిన్నాభిన్నం: బలిరెడ్డి మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ వైఎస్ లేకపోవడంతో రాష్ట్రం అనాధగా మారిందన్నారు. తెలుగు కుటుంబం ఛిన్నాభిన్నమైందని వాపోయారు. పులి కడుపున పులే పుడుతుంది: కొల్లి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి మాట్లాడుతూ పులికడుపున పులే పుడుతుందని చెప్పారు. జగన్ మోహన్‌రెడ్డిని చూసి చంద్రబాబు వాతలుపెట్డుకుంటున్నాడన్నారు. హరికృష్ణను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం: చొక్కాకుల పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ జగన్ మోహన్‌రెడ్డికి వస్తున్న జనాదరణ తట్టుకోలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీడీపీ వణికిపోతోందన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. బాబుది ఆత్మవంచన యాత్ర: చెంగల పార్టీ పాయకరావుపేట నియోజవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు చేసేది ఆత్మవంచన యాత్ర అన్నారు. పాయకరావుపేట వస్తే అడ్డుకుని తగిన బుద్ధి చెబుతామన్నారు. త్వరలో జగనన్న విడుదలవుతాడని, అధైర్యపడోద్దన్నారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, కిడారి సర్వేశ్వరరావు, పార్టీ నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, రామ్మూర్తి నాయుడు, వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, దనిశెట్టి బాబూరావు, జానకి శ్రీను, బొలిశెట్టి గోవిందు, రామచంద్రరాజు, పి.వి.జి.కుమార్, దాడి శెట్టిరాజా, ఈశ్వరి, పీలా వెంకటలక్ష్మి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. సభలో సైడ్‌లైట్స్... షర్మిల బస్సుయాత్ర పాయకరావుపేటకు ఎప్పుడు వస్తుందా.. రాజన్న బిడ్డను ఎప్పుడు చూద్దామా.. అని జనం ఆసక్తిగా గంటల తరబడి ఎదురు చూశా రు. మండుటెండలో ఆమె రాక కోసం నిరీక్షించారు. షర్మిలను చూసేందుకు మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఏకంగా భవనాలు, సెల్ టవర్లు ఎక్కారు. వైఎస్సార్ సీపీ జానపద కళాకారులు ఆలపించిన గీతాలు హుషారెత్తించాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం నుంచి వచ్చిన నాసిక్ డోల్ తీన్మార్ బృందం డప్పు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షర్మిల ప్రసంగంలో 108 పథకం గురించి మాట్లాడుతూ కుయ్..కుయ్ అని అనడంతో జనం చప్పట్లు కొట్టారు. జగన్, విజయమ్మ, షర్మిల ఫొటోలు, పెద్ద జెండాల తో కార్యకర్తలు సభాప్రాంగణం వద్ద వేడుక చేశారు. గౌతం సెంటర్ నుంచి సూర్యామహాల్ సెంటర్ వరకు వేలసంఖ్యలో జనం భారీగా వాహనాలతో తరలివచ్చారు. విశాఖ నుంచి కొణతాల రామకృష్ణ 300 వాహనాలతో వచ్చిన భారీ కాన్వాయ్ అందరీని ఆకట్టుకుంది. బహిరంగ సభలో షర్మిల ప్రసంగించేందుకు మైక్ అందుకోగానే అభిమానులు ఉత్సాహంతో 20 నిమిషాలపాటు నిరంతరాయంగా బాణసంచా కాల్చడం తో ఆకాశంలో కాంతులు మిరుమిట్లు గొలిపాయి. బస్సు యాత్ర సందర్భంగా తాండవ బ్రిడ్జి నుంచి గౌతం సెంటర్ వై జంక్షన్ వరకు రోడ్డుకిరువైపులా అభిమానులు ఏర్పాటు చేసిన షర్మిల, జగన్ ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. షర్మిలను చూసేందుకు భారీగా జనం రావడంతో రోడు ్డపక్కనున్న దుకాణాల కిక్కిరిశాయి. ఆమె ప్రసంగం ప్రారంభం కాగానే దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసి ప్రసంగం ఆలకించడానికి వచ్చారు. -
తెలుగువాడికి వెన్నుదన్ను
నక్కపల్లి/ఎస్‌రాయవరం, న్యూస్‌లైన్: ఆవేదనతో సతమతమవుతున్న కోట్లాది మంది తెలుగు వారిలో ఆత్మస్థైర్యం నింపే ధ్యేయంతోనే సమైక్య శంఖారావం పేరుతో షర్మిల బస్సుయాత్ర చేపట్టారని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజవర్గ ఇన్చార్జి జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఈనెల 14న విశాఖ జిల్లాలో జరగనున్న సమైక్య శంఖారావం పర్యటన ఏర్పాట్లపై నియోజకవర్గనేతలతో చర్చించేందుకు అడ్డురోడ్డు వచ్చిన ఆయన పార్టీ నాయకుడు చెంగల వెంకటరావు క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలవారికి సమ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేసిన డిమాండ్‌కు వైఎస్సార్సీపీ ఇప్పటికీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. సమాన న్యాయం చేయకుండా ప్రాంతాల మద్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు నిర్ణయించిందని విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన మనుగడ కోసం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రలో బూటకపు యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ జగన్, విజయమ్మ సమైక్య వాదాన్ని వినిపించి పదవులకు రాజీనామాలు చేశారని, తమ ఎమ్మెల్యేలు కూడా ఇదే డిమాండ్‌తో పదవులను త్యజించారని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల తెలుగు వారు అతలాకుతలమయ్యారని, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు సమైక్యశంఖారావం పేరుతో బస్సుయాత్ర చేపట్టారని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే ప్రతి తెలుగు వాడు ఈ యాత్రలో పాల్గొని సంఘీభావం తెలపవచ్చని చెప్పారు. దీనిని పార్టీ ఉద్యమంగా ఏ ఒక్కరూ భావించవద్దని విజ్ఞప్తి చేశారు. సమైక్యంధ్ర కోరుకునే రాజకీయ,రాజకీయేతర, ఉద్యోగ-ఉపాధ్యాయ,కార్మిక జేఏసీలు సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్సిపి జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు, పార్టీ ఉత్తరాంద్రజిల్లాల మున్సిపల్ ఎన్నికల పరిశీలకు కొయ్యాప్రసాదరెడ్డి, నియోజకవర్గ ముఖ్యనేతలు మాజీ డిసిసిబి మాజీ చైర్మన్ ఆర్ఎస్రామచంద్రరాజు,ఆర్‌ఈసిఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్నియోజకవర్గ ముఖ్యనేతలు వీసం రామకృష్ణ, పెట్ల ఉమాశంకర్‌గణేష్,బొలిశెట్టి గోవిందు, చిక్కాలరామారావు, ధనిశెట్టి బాబూరావు, జానకి శ్రీను, విజయనగరం బాబు,ఆడారిప్రసాద్ పాల్గొన్నారు -
22 నుంచి సమైక్యాంధ్ర బస్సుయాత్రలు
నక్కపల్లి/ఎస్‌రాయవరం,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చిం దని, మెజారిటీ ప్రజల అభిప్రాయాలే అజెం డాగా ప్రజల పక్షాన పార్టీ నిలుస్తుందని వైఎ స్సార్సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల నెహ్రూ అన్నారు. అడ్డురోడ్డులో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో గురువారం ఆయన సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 22 నుంచి అన్ని అసెంబ్లీ ని యోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేపడతామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ ప్ర యోజనాల కోసం కాంగ్రెస్ ప్రత్యేక తెలంగా నం ఆలపిస్తోందన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచాలన్న డిమాండ్‌తోనే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పదవులకు రాజీనామా చేశారన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రప్రభుత్వానికి, కాం గ్రెస్ అధిష్టానానికి ఇప్పటికీ ఒక స్పష్టత లేదన్నారు. వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ సలహా లు, సూచనలతోనే ఈ యాత్రలు చేపడుతున్నామన్నారు. ఈనెల 19న విజయవాడలో విజయమ్మ నిరాహారదీక్షకు సంఘీభావంగా జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ షర్మిల పాదయాత్ర సాగని నియోజకవర్గాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ ఈ నెల 22న పాయకరావుపేట, 23న యలమంచిలి, 24న చోడవరం, 25న మాడుగుల, 26న నర్సీపట్నం, 27న పెందుర్తి, 28న అనకాపల్లి ప్రాంతాల్లో బస్సుయాత్రలు జరుగుతాయన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు మాట్లాడుతూ బస్సుయాత్ర పాయకరావుపేట నుంచి ప్రారంభిస్తే భారీస్థాయిలో కార్యకర్తలు, అభిమానులతో విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, ఉత్తరాంధ్ర జిల్లాల మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, యలమంచిలి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు, పూడి మంగపతిరావు, పెట్ల ఉమాశంకర్‌గణేష్, నాయకులు పి.ఎస్.ఎన్.రాజు, వీసం రామకృష్ణ, బొలిశెట్టిగోవిందు, చిక్కాలరామారావు, జానకి శ్రీను, ధనిశెట్టిబాబూరావు పాల్గొన్నారు.