గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆది నుంచీ ఆర్భాటాలకు పోయిన చంద్రబాబు ప్రభుత్వం..
వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ
వీఐపీ ఘాట్ (రాజమండ్రి) :
గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆది నుంచీ ఆర్భాటాలకు పోయిన చంద్రబాబు ప్రభుత్వం.. చివరకు ఈ మహాపర్వం ఏర్పాట్లలో విఫలమై అప్రతిష్టను మూట కట్టుకుందని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. వీఐపీ ఘాట్‌లో శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పుష్కర స్నానమాచరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పుష్కరాల నిర్వహణ తీరు ఉందన్నారు. తొలి రోజు ప్రభుత్వపరమైన తప్పిదం కారణంగా 27 మంది మృతి చెందిన తరువాత.. చేసిన తప్పు తెలుసుకుని ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ జాగ్రత్తలు ముందుగానే తీసుకుని ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు.
పిండప్రదానాలు చేసిన జ్యోతుల
తొలుత జ్యోతుల నెహ్రూ తన భార్య మణి, కుమారుడు, జెడ్పీ ప్రతిపక్షనేత నవీన్, కోడలు లక్ష్మీదేవి, కుమార్తె సునీత, అల్లుడు తోట సర్వారాయుడుతోపాటు మనవడు, మనవరాళ్లతో కలసి పుష్కర స్నానమాచరించారు. అనంతరం తన పూర్వీకులకు గోదావరి చెంతన పిండప్రదానం నిర్వహించారు. తొలుత వీఐపీ ఘాట్ ముఖద్వారం వద్ద జ్యోతులను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చందు హనుమంతరావు స్వాగతం పలికారు. నెహ్రూ గోదావరిలో స్నానమాచరించిన సమయంలోనే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు కూడా పుష్కర స్నానమాచరించారు.