ఆర్థిక స్థితి బాగా లేదంటూ విహారయాత్రలేంటి? | ysrcp leader Jyotula Nehru fires on babu | Sakshi
Sakshi News home page

ఆర్థిక స్థితి బాగా లేదంటూ విహారయాత్రలేంటి?

Published Sat, Aug 15 2015 2:46 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

ఆర్థిక స్థితి బాగా లేదంటూ విహారయాత్రలేంటి? - Sakshi

ఆర్థిక స్థితి బాగా లేదంటూ విహారయాత్రలేంటి?

ఎమ్మెల్యేల్ని పర్యటనకు తీసుకెళతామనడంపై జ్యోతుల అభ్యంతరం
ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పాల్గొనరని స్పష్టీకరణ
ఆ డబ్బుతో అసెంబ్లీ సమావేశాల్ని మరిన్ని రోజులు జరుపుకుందాం
ప్రత్యేక హోదా, రాజధానికి తరలింపు వంటి సమస్యలెన్నో ఉన్నాయి
వాటిపై చర్చకు 20 రోజులైనా సమావేశాలు జరగాల్సిన అవసరముంది

 సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలందరినీ మూడు రోజులపాటు శ్రీహరికోట, కృష్ణపట్నం, తిరుపతికి తీసుకెళ్తామన్న శాసనసభ స్పీకర్ ఆహ్వానాన్ని తమ పార్టీ తిరస్కరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నప్పుడు బాధ్యతగల ఎమ్మెల్యే స్థాయిలో ఇలాంటి విహారయాత్రలో పాల్గొనడం మంచిది కాదన్నది తమ పార్టీ అభిప్రాయమని, అందుకే ఆ పర్యటనకు పార్టీ ఎమ్మెల్యేలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జ్యోతుల విలేకరులతో మాట్లాడారు. విహారయాత్రల పేరుతో వృథాచేసే ఇలాంటి డబ్బులతో శాసనసభ సమావేశాల్ని మరిన్ని రోజులు పొడిగించుకుని.. ప్రజాసమస్యలపై చర్చించుకుందామని సూచించారు. వర్షాకాల సమావేశాల్ని ఐదురోజులకు కుదించాలని ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తోందని, కనీసం 20 రోజులైనా సమావేశాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆయన కోరారు.
 
చర్చించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి..
రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం అనేక సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ.. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, నీటివసతి ఉన్నచోటా పంటలు వేసుకునేందుకు రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నెహ్రూ గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పుష్కరాలపై చర్చ ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రకటించారని.. దీనికితోడు విభజన తరువాత రాష్ట్రానికి కేంద్రప్రభుత్వ సహకారం వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ఇపుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోందని..

గతంలోనే తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై శాసనసభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని సూచించారని గుర్తుచేశారు. రాష్ట్ర రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించిన అంశంపైనా చర్చించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి వెంటనే కార్యాలయాల తరలింపు వల్ల ప్రయోజనమా? లేదంటే పదేళ్లపాటు హక్కున్న నేపథ్యంలో ఏ మేరకు తరలింపు ఉండాలన్న దానిపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసుతో రాష్ట్ర పరువు తీవ్రంగా దెబ్బతిందంటూ..

దీనిపై చర్చ జరగాలన్నారు. ఇలాంటి కీలక అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిన నేపథ్యంలో సమావేశాల్ని నామమాత్రంగా నిర్వహించి, ఎమ్మెల్యేల విహారయాత్రలకు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. సమావేశాల్ని 20 రోజులపాటైనా నిర్వహించాలన్నారు. ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలపై శాసనసభ వేదికపై సమగ్ర చర్చ జరగాలని తమ పార్టీ కోరుకుంటుందని జ్యోతుల నెహ్రూ పేర్కొంటూ.. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించని పరిస్థితుల్లో స్పీకర్ విజ్ఞతతో ఆలోచించి ఈ పర్యటనను రద్దు చేయాలని కోరారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ యాత్రను బహిష్కరించితే మంచిదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement