సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కొన్నాళ్లుగా అనా రోగ్యంతో బాధపడుతున్న ఎంపీ తోట నరసిం హం తెరపైకి వచ్చారు. తన కేడర్‌ను ఇబ్బందులు పెడుతూ అష్టకష్టాలకు గురి చేస్తున్న జంప్ జిలా నీ, ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను లక్ష్యంగా చేసుకొని రాజకీయ చదరంగానికి పావులు కదుపుతున్నారు. అనారోగ్యంతో ఎంపీగా పోటీ చేయలేనంటూనే గతంలో రెండుసార్లు గెలిచిన జగ్గంపేట అసెంబ్లీ స్థానాన్ని తన సతీమణికి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో జగ్గంపేట అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది.
‘తోట’ అనుచరులకు అడుగడుగునా చెక్
జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యే, ఎన్నికై గత ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలతో కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ లో టీడీపీ నేతగా కొనసాగారు. అయితే, వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి, పార్టీ ఫిరా యించిన జ్యోతుల నెహ్రూ రాకతో నియోజకవర్గంలో ఎంపీ తోట జోరుకు అధిష్టానం అడ్డుకట్ట వేసింది. జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడమే తరువాయి తోట కేడర్‌ను టార్గెట్ చేసి, వారికి ఏ విధమైన పనులు దక్కకుండా చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సమావేశాలకు, అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా అవమాన పరిచిన ఘటనలున్నాయి. చెప్పాలంటే తోట నరసింహం కేడర్‌ను నిర్వీర్యం చేసేందుకు జ్యోతుల నెహ్రూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తోటకు అనుచరులే లేకుండా చేసేందుకు పన్నాగం పన్నారు. రాజకీయంగా వేధించడమే కాకుండా నరసింహం అరోగ్యంపై పుకార్లు పుట్టించి గందరగోళం సృష్టించడంలో జ్యోతుల వర్గం హస్తం ఉందన్న అనుమానం ఉంది. దీంతో ఒకానొక సందర్భంలో తన కేడర్‌కు ‘నేనున్నాంటూ’ భరోసా ఇవ్వడమే కాకుండా తన ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఎంపీ నరసింహానికి ఏర్పడింది.
పాత పరిచయాలతో పితలాటకం...
తనకున్న కేడర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాగైనా జగ్గంపేట నుంచి బరిలోకి దిగాలని ఎంపీ తోట ఫ్యామిలీ నిర్ణయించుకున్నారు. అనారోగ్యం కారణంగా బరిలోకి దిగలేనందున తన సతీమణి వాణిని పోటీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. మంగళవారం తన కుటుంబమంతా అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. తన సతీమణి వాణికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ భేటీ అనంతరం బయటికొచ్చిన ఎంపీ నరసింహం ‘ఇక తేల్చాల్సింది చంద్రబాబే’ అని చెప్పుకొచ్చారు.
జంప్ జిలానీకి షాక్ ...
గెలిపించిన పార్టీని మోసం చేసి స్వప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లిన జ్యోతుల నెహ్రూకు షాక్ తగిలినట్టయింది. జగ్గంపేట టిక్కెట్‌ను తోట తన సతీమణికి కోరడంతో టీడీపీ అధిష్టానం కూడా ఇరకాటంలో పడినట్టయింది. గడిచిన ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన ఎంపీ తోట వెనుక ఉండాలా? ఇప్పటికే తనదే సీటు అని నియోజకవర్గంలో పర్యటిస్తున్న జ్యోతుల నెహ్రూ వెనుక తిరిగాలా...?అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment