thota narsimham
-
అనారోగ్యానికి గురైనా పట్టించుకోలేదు ..అందుకే రాజీనామా..
సాక్షి, జగ్గంపేట: అజాత శత్రువుగా పేరొందిన మెట్ట ప్రాంత రాజకీయ దిగ్గజం తోట నరసింహం తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, కాకినాడ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కిర్లంపూడి మండలంలోని స్వగ్రామం వీరవరంలో మంగళవారం సాయంత్రం కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘2004లో రాజకీయ ప్రవేశం చేసి, కాంగ్రెస్ తరఫున తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేను అయ్యాను. 2009లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాను. 2014లో టీడీపీలో చేరి, 21 రోజుల వ్యవధిలోనే కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందాను. ఎంపీగా, టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా సమర్థవంతంగా పని చేసి రాష్ట్రం తరఫున ప్రత్యేక హోదా కోసం పోరాడాను. మూడు నెలలు చేపట్టిన హోదా ఉద్యమంలో అనారోగ్యానికి గురయ్యాను. అందువల్లనే ఎన్నికలు సమీపించినా నన్ను చంద్రబాబు పట్టించుకోలేదు. నేను పోటీ చేయనని, నా భార్యకు సీటు ఇవ్వాలని కోరినా పరిగణనలోకి తీసుకోలేదు. కష్టపడి పని చేసేవారికి ఆ పార్టీ ఇచ్చే గుర్తింపు ఇదేనా? కార్యకర్తల అభీష్టం మేరకు హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బుధవారం మధ్యాహ్నం నా కుటుంబం సహా వెళ్తున్నాను. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నా భార్య వాణి పెద్దాపురం నుంచి పోటీ చేస్తారు. వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబుకు నా కార్యకర్తలను అప్పగిస్తున్నాను. వారికి సముచిత స్థానం ఇవ్వాలని కోరుతున్నా. నా కేడర్‌ను అణచివేస్తూ వచ్చిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు నా అనుచరులందరూ చంటిబాబుకు సహకరించాలి’’ అని నరసింహం చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, నరసింహం విలువలున్న నాయకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. నరసింహం సతీమణి వాణి మాట్లాడుతూ, తన తండ్రి మెట్ల సత్యనారాయణరావుకు కోనసీమలోను, తన భర్త నరసింహానికి మెట్టలోనూ రాజకీయంగా పేరుందన్నారు. తన తండ్రికి గతంలో అన్యాయం చేసిన టీడీపీ, ఇప్పుడు తన భర్తకూ అన్యాయం చేసిందన్నారు. అనారోగ్యంతో ఉన్న తన భర్త గురిం చి చంద్రబాబు కనీసం పట్టించుకోలేదని, సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని, జిల్లా టీడీపీ పెద్దలు కుట్రలు చేశారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీలో చేరుతున్న తమకు అందరూ అండగా ఉండాలని కోరారు. తన తండ్రిని అవమానించినవారికి గుణపాఠం చెప్పేందుకే పెద్దా పురం నుంచి పోటీకి సిద్ధమవుతున్నానన్నారు. అం తకుముందు అనుచరులు తుమ్మల శ్రీనివాస్, గఫూర్, దోమా గంగాధర్, తొట్టిపూడి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ, టీడీపీ అన్యాయం చేసిందని, ఆ పార్టీకి రాజీనామా చేయాలని కోరారు. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధి నుంచి భారీగా కార్యకర్తలు రావడంతో తోట నివాసం కిక్కిరిసింది. అనంతరం ఎంపీ తోట కుటుంబం, అనుచరులతో కలిసి విశాఖ పయనమైంది. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లి, బుధవారం వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. -
జ్యోతుల వెలుగుకు తోట చెక్
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కొన్నాళ్లుగా అనా రోగ్యంతో బాధపడుతున్న ఎంపీ తోట నరసిం హం తెరపైకి వచ్చారు. తన కేడర్‌ను ఇబ్బందులు పెడుతూ అష్టకష్టాలకు గురి చేస్తున్న జంప్ జిలా నీ, ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను లక్ష్యంగా చేసుకొని రాజకీయ చదరంగానికి పావులు కదుపుతున్నారు. అనారోగ్యంతో ఎంపీగా పోటీ చేయలేనంటూనే గతంలో రెండుసార్లు గెలిచిన జగ్గంపేట అసెంబ్లీ స్థానాన్ని తన సతీమణికి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో జగ్గంపేట అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. ‘తోట’ అనుచరులకు అడుగడుగునా చెక్ జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యే, ఎన్నికై గత ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలతో కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ లో టీడీపీ నేతగా కొనసాగారు. అయితే, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, పార్టీ ఫిరా యించిన జ్యోతుల నెహ్రూ రాకతో నియోజకవర్గంలో ఎంపీ తోట జోరుకు అధిష్టానం అడ్డుకట్ట వేసింది. జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడమే తరువాయి తోట కేడర్‌ను టార్గెట్ చేసి, వారికి ఏ విధమైన పనులు దక్కకుండా చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సమావేశాలకు, అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా అవమాన పరిచిన ఘటనలున్నాయి. చెప్పాలంటే తోట నరసింహం కేడర్‌ను నిర్వీర్యం చేసేందుకు జ్యోతుల నెహ్రూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తోటకు అనుచరులే లేకుండా చేసేందుకు పన్నాగం పన్నారు. రాజకీయంగా వేధించడమే కాకుండా నరసింహం అరోగ్యంపై పుకార్లు పుట్టించి గందరగోళం సృష్టించడంలో జ్యోతుల వర్గం హస్తం ఉందన్న అనుమానం ఉంది. దీంతో ఒకానొక సందర్భంలో తన కేడర్‌కు ‘నేనున్నాంటూ’ భరోసా ఇవ్వడమే కాకుండా తన ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఎంపీ నరసింహానికి ఏర్పడింది. పాత పరిచయాలతో పితలాటకం... తనకున్న కేడర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాగైనా జగ్గంపేట నుంచి బరిలోకి దిగాలని ఎంపీ తోట ఫ్యామిలీ నిర్ణయించుకున్నారు. అనారోగ్యం కారణంగా బరిలోకి దిగలేనందున తన సతీమణి వాణిని పోటీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. మంగళవారం తన కుటుంబమంతా అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. తన సతీమణి వాణికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ భేటీ అనంతరం బయటికొచ్చిన ఎంపీ నరసింహం ‘ఇక తేల్చాల్సింది చంద్రబాబే’ అని చెప్పుకొచ్చారు. జంప్ జిలానీకి షాక్ ... గెలిపించిన పార్టీని మోసం చేసి స్వప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లిన జ్యోతుల నెహ్రూకు షాక్ తగిలినట్టయింది. జగ్గంపేట టిక్కెట్‌ను తోట తన సతీమణికి కోరడంతో టీడీపీ అధిష్టానం కూడా ఇరకాటంలో పడినట్టయింది. గడిచిన ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన ఎంపీ తోట వెనుక ఉండాలా? ఇప్పటికే తనదే సీటు అని నియోజకవర్గంలో పర్యటిస్తున్న జ్యోతుల నెహ్రూ వెనుక తిరిగాలా...?అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. -
వీరవరంలో ఎంపీ తోట నర్సింహం వీరంగం
-
వీరవరంలో ఎంపీ తోట నర్సింహం వీరంగం
కిర్లంపూడి : తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో ఉద్రిక్తత నెలకొంది. అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో కాకినాడ ఎంపీ తోట నర్సింహం అప్పుడే తన ప్రతాపాన్ని చూపించారు. జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మేనల్లుడి వరస అయ్యే తోట గాంధీ, ఆయన సోదరుడిపై తోట నర్సింహం, తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మాజీ మంత్రి తోట సుబ్బారావు తమ్ముడి కొడుకైన గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. తాజా ఎన్నికల్లో వాళ్లు జ్యోతుల నెహ్రూ, ఆయన మద్దతుదారులను బలపరిచారు. ఈ కారణంతోను, ఇంతకుముందు అయిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకున్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం.. శనివారం నాడు పొద్దున్నే వేరే ఊళ్ల నుంచి జనాన్ని తీసుకెళ్లి వీరవరంలో తమ ఇంట్లో ఉన్న తోట గాంధీ, తదితరులపై దౌర్జన్యం చేశారు. తీవ్రంగా దాడి చేయడంతో గాంధీ, ఆయన సోదరుడు గాయపడ్డారు. దీంతో ఈ విషయం తెలిసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన బయల్దేరి వీరవరం వెళ్లారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బయట ఊళ్ల నుంచి వచ్చిన వారందరినీ పంపేసి ఊళ్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ఎన్నికలు జరిగినా.. వీరవరంలో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. తోట, జ్యోతుల కుటుంబ సభ్యులంతా దగ్గరి బంధువులే అయినా, రాజకీయంగా వేర్వేరు వర్గాల్లో ఉండటంతో.. ఈ ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం.