కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న కాకినాడ ఎంపీ తోట నరసింహం
సాక్షి, జగ్గంపేట: అజాత శత్రువుగా పేరొందిన మెట్ట ప్రాంత రాజకీయ దిగ్గజం తోట నరసింహం తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, కాకినాడ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కిర్లంపూడి మండలంలోని స్వగ్రామం వీరవరంలో మంగళవారం సాయంత్రం కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘2004లో రాజకీయ ప్రవేశం చేసి, కాంగ్రెస్ తరఫున తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేను అయ్యాను. 2009లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాను. 2014లో టీడీపీలో చేరి, 21 రోజుల వ్యవధిలోనే కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందాను. ఎంపీగా, టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా సమర్థవంతంగా పని చేసి రాష్ట్రం తరఫున ప్రత్యేక హోదా కోసం పోరాడాను. మూడు నెలలు చేపట్టిన హోదా ఉద్యమంలో అనారోగ్యానికి గురయ్యాను. అందువల్లనే ఎన్నికలు సమీపించినా నన్ను చంద్రబాబు పట్టించుకోలేదు.
నేను పోటీ చేయనని, నా భార్యకు సీటు ఇవ్వాలని కోరినా పరిగణనలోకి తీసుకోలేదు. కష్టపడి పని చేసేవారికి ఆ పార్టీ ఇచ్చే గుర్తింపు ఇదేనా? కార్యకర్తల అభీష్టం మేరకు హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బుధవారం మధ్యాహ్నం నా కుటుంబం సహా వెళ్తున్నాను. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నా భార్య వాణి పెద్దాపురం నుంచి పోటీ చేస్తారు. వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబుకు నా కార్యకర్తలను అప్పగిస్తున్నాను. వారికి సముచిత స్థానం ఇవ్వాలని కోరుతున్నా. నా కేడర్‌ను అణచివేస్తూ వచ్చిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు నా అనుచరులందరూ చంటిబాబుకు సహకరించాలి’’ అని నరసింహం చెప్పారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, నరసింహం విలువలున్న నాయకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. నరసింహం సతీమణి వాణి మాట్లాడుతూ, తన తండ్రి మెట్ల సత్యనారాయణరావుకు కోనసీమలోను, తన భర్త నరసింహానికి మెట్టలోనూ రాజకీయంగా పేరుందన్నారు. తన తండ్రికి గతంలో అన్యాయం చేసిన టీడీపీ, ఇప్పుడు తన భర్తకూ అన్యాయం చేసిందన్నారు. అనారోగ్యంతో ఉన్న తన భర్త గురిం చి చంద్రబాబు కనీసం పట్టించుకోలేదని, సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని, జిల్లా టీడీపీ పెద్దలు కుట్రలు చేశారని ఆరోపించారు.
వైఎస్సార్ సీపీలో చేరుతున్న తమకు అందరూ అండగా ఉండాలని కోరారు. తన తండ్రిని అవమానించినవారికి గుణపాఠం చెప్పేందుకే పెద్దా పురం నుంచి పోటీకి సిద్ధమవుతున్నానన్నారు. అం తకుముందు అనుచరులు తుమ్మల శ్రీనివాస్, గఫూర్, దోమా గంగాధర్, తొట్టిపూడి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ, టీడీపీ అన్యాయం చేసిందని, ఆ పార్టీకి రాజీనామా చేయాలని కోరారు. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధి నుంచి భారీగా కార్యకర్తలు రావడంతో తోట నివాసం కిక్కిరిసింది. అనంతరం ఎంపీ తోట కుటుంబం, అనుచరులతో కలిసి విశాఖ పయనమైంది. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లి, బుధవారం వైఎస్సార్ సీపీలో చేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment