సాక్షి, కాకినాడ జిల్లా: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ కూడా తనవైపే ఉన్నాడని, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్రకు సీటు ఇస్తే పొత్తులో ఉండనంటూ జ్యోతుల స్పష్టం చేయడంతో సమావేశాన్ని సూర్యచంద్ర బహిష్కరించారు. దీంతో జ్యోతుల తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య తోపులాట చోటు చేసుకుంది. జనసేన-టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది.
కాగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి.
రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వెలుపల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించిన నాటినుంచి ఇదే తీరు కనిపిస్తోంది. గత మంగళవారం.. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సమన్వయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు బండబూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సమన్వయ సమావేశమని ప్రకటించినా.. ఇరుపక్షాలు ఎదురెదురుగా బల్లలు, కుర్చీలు వేసుకుని వాదోపవాదాలకు దిగారు.. తాజాగా జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది.
చదవండి: మరోసారి బయటపడ్డ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు
Comments
Please login to add a commentAdd a comment