రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబుకు చెబుతున్న టీడీపీ మాజీ సర్పంచ్ ప్రశాంతకుమార్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు జగ్గంపేటలో చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. విభిన్న వర్గాల నుంచి ఒక్కొక్కరితో మాట్లాడించి వారి అభిప్రాయాలు తెలుసుకోవడమే ప్రధాన అజెండా అని ఆ పార్టీ నాయకులు తొలుతే ప్రకటించారు.
సమావేశంలో ఒకరి తర్వాత మరొకరు మాట్లాడుతూ వారి అభిప్రాయాలు చెప్పారు. ఈ నేపథ్యంలో గోకవరం మండలం కృష్ణునిపాలెం మాజీ సర్పంచ్ ప్రశాంతకుమార్ హలోనిన్ (కన్నబాబు) వంతు వచ్చింది. మైకు చేత్తో పట్టుకుని ‘అయ్యా.. గౌరవ అధ్యక్షుల వారికి ఒక విన్నపం. ఇది నా ఒక్కడి విన్నపమే కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిదీ. ముఖ్యంగా మన కార్యకర్తలందరిదీ.
మీరు ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే నివాసం ఉండాలి’ అని విన్నవించారు. దీంతో వేదికపై ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా బిత్తరపోయి అటూ ఇటూ చూశారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి చెవిలో ఏదో చెప్పారు. అనంతరం మరొకరు మాట్లాడాలంటూ ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment