
సమన్వయ, సహకారాలే నా శస్త్రాస్త్రాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అందరినీ సమన్వయపరుచుకుంటూ, నాయకులందరి సహకారంతో పార్టీని పటిష్టపరుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా నూతన అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు. రాజకీయాల్లో కాలిడిన నాటి నుంచి బాధ్యతతో, కష్టించి పనిచేయడమే తన అజెండా అని స్పష్టం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షునిగా జ్యోతులను బుధవారం రాత్రి ప్రకటించారు. పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన నెహ్రూ పార్టీ అత్యున్నతమైన కేంద్రపాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నెహ్రూ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ, పీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేసిన ఆయనకు జిల్లా అంతటా విస్తృతమైన పరిచయాలున్నాయి. గురువారం గుంటూరులో ఉన్న ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
రాజకీయాల్లో సాధారణ కార్యకర్తగా అడుగు పెట్టిన ఎంతో మంది నాయకులు అనేక ఉన్నత పదవులు అలంకరించడానికి క్రమశిక్షణతో కూడిన పనితీరే కారణమని తాను గట్టిగా నమ్ముతానన్నారు. తాను కష్టపడి పనిచేస్తూ, ప్రతి నాయకుడు, కార్యకర్తా అలాగే పనిచేసేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అధినేత ఆదేశాల మేరకు పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులందరి సహకారాన్ని తీసుకుంటానని చెప్పారు. పార్టీలో చేరిన దగ్గర నుంచీ అధినేత ఆదేశాలూ శిరోధార్యంగా పనిచేస్తున్నానన్నారు. ఇకముందు కూడా అదే స్ఫూర్తితో పార్టీలో అన్ని విభాగాలను దశలవారీగా చైతన్యవంతం చేసేందుకు పాటుపడతానన్నారు. తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సహకరించాలని నెహ్రూ అభ్యర్థించారు.
ప్రజలకు అండగా ఉందాం..
రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, ఇతర వర్గాలు చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి ఓటేశారని, ఇప్పుడు ఆ హామీల అమలు సందేహాస్పదంగా పరిణమించిన తరుణంలో ప్రజలకు ప్రతి కార్యకర్తా వెన్నుదన్నుగా నిలవాలని జ్యోలు విజ్ఞప్తి చేశారు. పార్టీ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలంటే కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నాయకులు ముందుకు సాగాలన్నారు. కార్యకర్తకు ఏ కష్టమొచ్చినా మనోధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత ప్రతి నాయకునిపై ఉందన్నారు. హైదరాబాద్ నుంచి ఆదివారం తిరిగి వచ్చాక జిల్లా నాయకులంతా సమావేశమవుతామని చెప్పారు.
జ్యోతులకు అభినందనల వెల్లువ
జగ్గంపేట : వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన జ్యోతులను జిల్లాలోని పలువురు నాయకులు, నియోజకవర్గనేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫోన్లో అభినందించారు. హైదరాబాద్‌లో జ్యోతులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జి.వి.రమణ తదితరులు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని పటిష్టపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని వరుపుల ఈ సందర్భంగా జ్యోతులను కోరారు. భూపాలపట్నం ప్రసాద్, బుజ్జి తదితరులు జ్యోతుల వెంట ఉన్నారు.
అందరికీ కృతజ్ఞతలు :కుడుపూడి చిట్టబ్బాయి
పదవీ బాధ్యతల నిర్వహణలో తనకు అన్ని విధాలా సహకరించిన కార్యకర్తలకు, నాయకులకు ఇంతవరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా తన శక్తిమేరకు అధినేత అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించానన్నారు. ఆరోగ్య కారణాలతో బాధ్యతల నుంచి తప్పించాలన్న అభ్యర్థనను ఆమోదించిన జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు సాధారణ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానన్నారు.