బాధితులకు వైఎస్సార్ సీపీ భరోసా
Published Tue, Oct 29 2013 3:13 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
జగ్గంపేట, న్యూస్‌లైన్ :తుపాను, అతివృష్టి వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రజలకు సహాయ చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ముం పు ప్రాంతాలలో పర్యటిస్తున్నారని పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ట్రావెలర్స్ బంగ్లాలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. బాధాతప్త హృదయంతో విజయమ్మ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, రైతులను ఆదుకునేందుకు గట్టిగా పోరాడతామన్నారు. మెట్టలో వర్షాలకు మానవ తప్పిదం వల్లే ముంపు సమస్య తలెత్తిందన్నారు. ఏలేరు ఆధునికీకరణ కోసం తాము పాదయాత్ర చేసి హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధి పట్టించుకోకపోవడంతోనే ముంపు వల్ల రైతులు పంటలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఆధునికీకరణ చేపడతామని ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర, రాష్ట్రమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. టెండర్లు పిలిచినప్పటికీ వాయిదా పడడానికి నిధులు లేకపోవడమే కారణమన్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నందున మళ్లీ ఏలేరును ఆధునికీకరిస్తామని పబ్బం గడుపుకొనేందుకు దురాలోచనలకు దిగుతున్నారన్నారు. ప్రస్తుతం ఏలేరులో 85.18 మీటర్ల ఎత్తులో నీటి నిల్వలు ఉన్నందున ఎఫ్‌ఆర్‌ఎల్‌కు సమీపంలో ఉందని, ప్రాజెక్టు నిండితే ఒకేసారి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే ఏలేరు ప్రాంత గ్రామాలు, పొలాలు ముంపునకు గురవుతాయన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏలేరు ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు తాను ప్రధాన భూమిక పోషిస్తానన్నారు.
విజయమ్మ పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన నాయకులు
ఎడతెరిపి లేకుండా ఆరు రోజుల పాటు కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు సాంత్వన చేకూర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. జగ్గంపేట నుంచి తొండంగి మండలం వరకు సాగనున్న విజయమ్మ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పార్టీ నాయకులు సోమవారం పర్యవేక్షించారు. జగ్గంపేట నుంచి పెద్దాపురం వెళ్లే మార్గంలో కాట్రావులపల్లి వద్ద ముంపులో ఉన్న సుమారు మూడువేల ఎకరాల వరి చేలను విజయమ్మ పరిశీలించనున్నారు. విజయమ్మ పర్యటన కోసం పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.
పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, నాయకులు గిరిజాల వెంకటస్వామినాయుడు, కొండేటి చిట్టిబాబు, త్రినాథ్‌రెడ్డి, మంతిన రవిరాజు తదితరులు కాట్రావులపల్లిలోని వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీరు నిలిచిపోవడంతో పంటలను పూర్తిగా కోల్పోతామని రైతులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. నాయకుల వెంట మారిశెట్టి భద్రం, కొలిపే ప్రసన్నరాణి, కుదప వెంకట శ్రీనివాస్, మురళి, ఒమ్మి రఘురామ్, నీలాద్రిరాజు, ఏలేటి బాబి, సుంకర సీతారామయ్య తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement